PENAMALURU : అసెంబ్లీ సెగ్మెంట్ మార్చిన జోగి రమేశ్… పెనమలూరుకు పోయింది అందుకేనా..?
పవన్ కల్యాణ్ (Pawan Kalyan)... చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)... ఇద్దర్నీ మడతపెట్టి... వ్యక్తిగతంగా తిట్టాలంటే జోగి రమేశ్ ముందుంటారు.
పవన్ కల్యాణ్ (Pawan Kalyan)… చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)… ఇద్దర్నీ మడతపెట్టి… వ్యక్తిగతంగా తిట్టాలంటే జోగి రమేశ్ ముందుంటారు. ఆయన ఇప్పుడు ముచ్చటగా మూడో నియోజకవర్గం పెనమలూరులో పోటీచేస్తున్నారు. అంతకు ముందున్న రెండు నియోజకవర్గాలను ఎందుకు వదిలిపెట్టారో ఆయనకే తెలియాలి. ప్రత్యర్థిపార్టీలు మాత్రం… జోగి రమేశ్ అనుచరుల దందాలు, అక్రమాలతో ఓడి పోతానని భావించే పెనమలూరుకు వచ్చినట్టు చెబుతుంటారు. జోగికి ప్రత్యర్థి టీడీపీ (TDP) అభ్యర్థి బోడే ప్రసాద్… చివరి నిమిషం దాకా ఆయనకు టీడీపీ అధిష్టానం టిక్కెట్ ఇస్తుందో లేదో తెలియని పరిస్థితి. చివరకు టిక్కెట్టు వచ్చాక ఇప్పుడు ప్రచారంలో బిజీ అయ్యారు. జోగి రమేశ్, బోడే ప్రసాద్ ఈ ఇద్దరిలో పెనమలూరు ప్రజలు ఎవర్ని ఎన్నుకుంటారు… వీళ్ళిద్దరి మధ్య పవర్ ఫైట్ ఎలా ఉండబోతోందో చూద్దాం.
ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పెనమలూరు… 2004 అసెంబ్లీ ఎన్నికల (AP Assembly Elections) దాకా కంకిపాడు నియోజకవర్గంలో ఉంది. ఆ తర్వాత 2009లో అసెంబ్లీ నియోజకవర్గంగా ఏర్పాటైంది. ఈ నియోజకవర్గం ఏర్పడ్డ తర్వాత జరిగిన మూడు ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ ఒక్కోసారి గెలుచుకుంటూ వచ్చాయి. పెనమలూరు నియోజవర్గంలో 2 లక్షల మంది దాకా ఓటర్లు ఉన్నారు. ఇక్కడ బీసీ ఓటర్లే ఎక్కువ. ఆ తర్వాత స్థానంలో ఎస్సీలు, కమ్మ సామాజిక వర్గం ఓటర్లు ఉన్నారు. ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం కూడా పెనమలూరు. కృష్ణా జిల్లాలోనే అతి పెద్ద నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో కంకిపాడు, ఉయ్యూరు, పెనమలూరు మండలాలతో పాటు వైఎస్సార్ తాడిగడప మున్సిపాలిటీ ఉన్నాయి.
పెనమలూరులో అధికార వైసీపీ నుంచి జోగి రమేశ్ (Jogi Ramesh) పోటీ చేస్తుండగా… టీడీపీ నుంచి బోడె ప్రసాద్ రేసులో ఉన్నారు. జోగి రమేశ్ వరుసగా మూడు సార్లు మూడు నియోజకవర్గాల్లో పోటీ చేశారు. ప్రతి ఎన్నికల్లో అసెంబ్లీ నియోజకవర్గాన్ని మారుస్తూ వస్తున్నారు. 2014లో మైలవరం, 2019లో పెడన నుంచి పోటీ చేశారు. ఇప్పుడు 2024లో పెనమలూరుకు షిప్ట్ అయ్యారు. మైలవరంలో జోగి రమేశ్ ఓడిపోగా… పెడనలో వైసీపీ హవాతో గెలిచారని అంటారు. మరి ఇప్పుడు ఆయన పెనమలూరుకి ఎందుకు షిప్ట్ అయ్యారంటే… 2019లో ఆయన గెలిచిన తర్వాత పెడన, మైలవరం నియోజకవర్గాల్లో జోగి అనుచరులపై అక్రమ ఆరోపణలు వెల్లువెత్తాయి. దాంతో ఆ రెండు స్థానాల్లో పోటీ చేయడానికి ఇష్టపడలేదు. అందుకే జోగి రమేశ్ మరో నియోజకవర్గం ఎంచుకున్నారు. ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా కూటమి పార్టీలు బలపరచిన బోడె ప్రసాద్ పోటీ చేస్తున్నారు. ఆయన స్థానికుడు కావడం, అవినీతి ఆరోపణలు లేకపోవడం ప్లస్ అనుకోవాలి. మొదట బోడే ప్రసాద్ కి టీడీపీ అధిష్టానం టిక్కెట్ ఇవ్వదని తెలియడంతో… ఆయన అనుచరులు అన్ని మండలాల్లో ఆందోళన చేశారు. దీంతో అధిష్టానం వెనక్కి తగ్గి ఆయనకే టిక్కెట్ కన్ఫమ్ చేసింది.
పెనమలూరులో వైసీపీ (YCP) లో గ్రూపుల గోల జోగి రమేశ్ కి ఇబ్బందిగా మారుతోంది. ఈ నియోజకవర్గంలో గతంలో కొలుసు పార్థసారధి గెలిచారు. ప్రస్తుతం ఆయన టీడీపీలో చేరి… నూజివీడు నుంచి పోటీ చేస్తున్నారు. పెనమలూరులోని పార్థసారధి వర్గం… జోగి వెంట నడవడం లేదు. అంతేకాదు… జోగి తన బంధువులను తెచ్చుకొని వాళ్ళకే పార్టీల బాధ్యతలు అప్పగించడంతో… లోకల్ వైసీపీ కేడర్ గుర్రుగా ఉంది. జోగి రమేశ్… ప్రతిపక్ష నేతలైన చంద్రబాబు, పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీద తరచుగా వ్యక్తిగత విమర్శలు చేస్తుంటారు. మైలవరం, పెడనలోనే కాదు… పెనమలూరు వచ్చాక కూడా జోగి అనుచరులు… ఇసుక దందా మొదలుపెట్టినట్టు ఆరోపణలున్నాయి. రెండు వారాల క్రితమే జోగి రమేశ్ ముగ్గురు బామ్మర్దులు, 40 మంది బంధువులు టీడీపీలో చేరిపోవడం ఆయనకు మైనస్. జోగి ఇంటి ముందే వేదిక ఏర్పాటు చేసి టీడీపీ (TDP) లో చేరడం షాక్ తగిలినట్టయింది. వైపీపీలో గ్రూపులు పరోక్షంగా టీడీపీ అభ్యర్థి బోడె ప్రసాద్ కి అనుకూలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయనకు టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ సపోర్ట్ ఇవ్వడం కూడా కలిసివచ్చే అంశం.