KADAPA : ఏపీ ఎన్నికల్లో హిటెక్కిస్తున్న కడప లోక్ సభ స్థానం..
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈసారి కడప లోక్ సభ స్థానంలో బిగ్ ఫైట్ జరగబోతోంది. మొదటిసారి ఇక్కడ వైఎస్ కుటుంబం నుంచి అక్కా తమ్ముడు పోటీ పడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈసారి కడప లోక్ సభ స్థానంలో బిగ్ ఫైట్ జరగబోతోంది. మొదటిసారి ఇక్కడ వైఎస్ కుటుంబం నుంచి అక్కా తమ్ముడు పోటీ పడుతున్నారు. ఈ ఇద్దరిలో ఎవరు గెలుస్తారు… ఎవరు ఓడిపోతారు… అన్నది ఆంధ్ర పాలిటిక్స్ లో టెన్షన్ రేపుతోంది. కాంగ్రెస్ నుంచి ఫస్ట్ టైమ్ షర్మిల బరిలోకి దిగుతుంటే… వైసీపీ అభ్యర్థిగా ఆమె తమ్ముడు అవినాశ్ రెడ్డి మూడోసారి పోటీ చేస్తున్నారు. టీడీపీ అభ్యర్థిగా భూపేశ్ రెడ్డి బరిలో ఉన్నా… అక్కా తమ్ముడి మధ్యే ప్రధాన పోటీ. కడపలో వివేకానంద రెడ్డి హత్య కేసే ప్రధాన ప్రచారాస్త్రంగా లోక్ సభ ఎన్నికలు జరగబోతున్నాయి. పీసీసీ అధ్యక్షురాలి హోదాలో… వివేకా హత్యపై సానుభూతి సెంటిమెంట్ తో షర్మిల… సీఎం జగన్ సపోర్ట్ తో అవినాశ్ రెడ్డి ఇద్దరూ కడపలో పోటీలో ఉన్నారు. ఈ ఇద్దరి పవర్ ఫైట్ ఎలా ఉండబోతోంది.
మునుపెన్నడూ లేనివిధంగా ఈసారి కడప లోక్ సభ ఎన్నికలు హైటెన్షన్ రేపుతున్నాయి. ఒకే కుటుంబంలో జరుగుతున్న ఈ పోరులో ఎవరు గెలుస్తారని ఆంధ్రప్రదేశ్ జనమంతా ఎదురు చూస్తున్నారు. కడప లోక్ సభ స్థానం 1951లో ఏర్పాటైంది. మొదట్లో ఇక్కడ కమ్యూనిస్టులే గెలిచేవారు. మొదటి ఎన్నికల తర్వాత నిం మూడుసార్లు వరుసగా సీపీఐదే విజయం. 1984లో టీడీపీ ఎంపీ గెలవగా… ఇక 1989 నుంచి కడప పార్లమెంట్ స్థానంలో వైఎస్ కుటుంబం పాగా వేసింది. అప్పటి నుంచి 2019 వరకూ కూడా కడపలో వైఎస్ కుటుంబ సభ్యులే గెలుస్తున్నారు.
కడప లోక్ సభ స్థానంలో మొత్తం 16 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గం పరిధిలో కడప, పులివెందుల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, బద్వేలు, కమలాపురం, మైదుకూరు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఇక్కడ మహిళా ఓటర్ల సంఖ్యే ఎక్కువ. 2019 ఎన్నికల ముందు వివేకానంద రెడ్డి హత్య జరిగింది. ఆ సానుభూతితో అవినాశ్ రెడ్డి… 2014 తర్వాత మరోసారి 2019లోనూ విజయం సాధించారు. వివేకా హత్యను సీఎం జగన్ తనకు అనుకూలంగా మార్చుకున్నారన్న టాక్ కూడా ఉంది. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో వివేకా హత్య కేసు నిందితుల్లో అవినాశ్ రెడ్డి, అతని కుటుంబ సభ్యుల పేర్లు కూడా వచ్చాయి. దాంతో అవినాశ్ రెడ్డికి వ్యతిరేకంగా… వివేకా కూతురు సునీత న్యాయ పోరాటం చేస్తున్నారు. అది ఇప్పుడు రాజకీయ పోరాటంగా మారింది.
షర్మిల ఏపీసీసీ చీఫ్ పదవి చేపట్టాక అన్న సీఎం జగన్ పైనే తన అస్త్రాలను ప్రయోగిస్తూ వచ్చారు. వివేకా కూతురు సునీతకు అండగా నిలబడ్డారు. షర్మిలను కడప లోక్ సభ నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ అధిష్టానం ఆదేశించింది. దాంతో అవినాశ్ రెడ్డికి పోటీగా కాంగ్రెస్ తరపున షర్మిల కడప బరిలోకి దిగారు. వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాశ్ కి టిక్కెట్ ఇవ్వడం వల్లే తాను పోటీలో ఉన్నట్టు షర్మిల చెబుతున్నారు. ఆమెకు వివేకా కుటుంబం సపోర్ట్ గా నిలిచింది. సునీత కూడా కడప ప్రచారంలో పాల్గొంటున్నారు. కడప, బద్వేలు, మైదుకూరు, కమలాపురం, పులివెందుల నియోజకవర్గాల్లో వివేకాకు అభిమానులు ఉన్నారు. అందుకే ఇక్కడ షర్మిలకు సపోర్ట్ గా సునీత క్యాంపెయిన్ లో పాల్గొంటున్నారు. అవినాశ్ రెడ్డిని ఓడించాలని కోరుతున్నారు.
సీఎం జగన్ మాత్రం… అవినాశ్ చిన్న పిల్లోడనీ… అతనికి ఈ హత్యతో సంబంధం లేదని వాదిస్తున్నారు. అందుకే మళ్ళీ వైసీపీ టిక్కెట్ ఇచ్చినట్టు చెబుతున్నారు. అభ్యర్థుల బలాలు, బలహీనతలు చూస్తే… వైసీపీ నుంచి మూడుసారి కడప లోక్ సభ సీటకు పోటీలో ఉన్నారు అవినాశ్ రెడ్డి. జగన్ అండదండలు ఉండటం, ఎమ్మెల్యేల సపోర్ట్, జగన్ భార్య భారతీ రెడ్డి కూడా అవినాశ్ తరపున పోటీ చేస్తుండటం ప్లస్ పాయింట్స్. వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉండటం…అవినాశ్ రెడ్డే చంపించాడని వివేకా కూతురు సునీతతో పాటు షర్మిల తీవ్ర ఆరోపణలు చేస్తూ ప్రచారం చేయడం మైనస్. అతని సన్నిహతులు భూకబ్జాలు, దందాలు చేస్తారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.
కాంగ్రెస్ తరపున బరిలో ఉన్న షర్మిలకు… రాజశేఖర్ రెడ్డి కూతురుగా కడప ప్రాంతంలో ఆదరణ ఉంది. జగన్ జైల్లో ఉన్నప్పుడు అన్నను గెలిపించడానికి వైసీపీ తరపున ప్రచారం చేశారు. వివేకా హత్య కేసులో న్యాయం చేయమని అడుగుతుండటంతో మహిళల్లోనూ కొంత సానుభూతి పరిస్థితి అయితే కడపలో కనిపిస్తోంది. కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అయిన ముస్లింలు, క్రిస్టియన్, దళితులు… ఈసారి వైసీపీకి కాకుండా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే ఛాన్సుంది. క్రైస్తవులతో బ్రదర్ అనిల్ కుమార్ సమావేశాలు నిర్వహిస్తూ… షర్మిలకు ఓట్లు రాబట్టే పనిలో ఉన్నారు. షర్మిల గతంలో తెలంగాణలో పార్టీ పెట్టి… దాన్ని మూసేసి ఆంధ్రకు రావడం… ముందు నుంచీ కడపలో గ్రౌండ్ వర్క్ చేయకపోవడం మైనస్ గా మారే ఛాన్సుంది. అంతేకాదు… కడప లోక్ సభ నియోజకవర్గంలో మిగిలిన అసెంబ్లీ స్థానాల్లో బలమైన కాంగ్రెస్ అభ్యర్థులు కూడా లేరు.
ఈ ఎన్నికల్లో టీడీపీ తరపున భూపేశ్ రెడ్డి బరిలో ఉన్నారు. ఆయన మొదటిసారి బరిలోకి దిగారు. అయినా కడపలో టీడీపీ కేడర్ అండగా ఉంది. జమ్మలమడుగు అసెంబ్లీ స్థానంలో సొంత బాబాయి ఆదినారాయణ రెడ్డి… బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు. భూపేశ్ రెడ్డి టీడీపీ సూపర్ సిక్స్ పథకాలను జనంలోకి తీసుకెళ్తున్నాడు. వైసీపీ ఓట్లల్లో చీలిక వస్తే… గెలుస్తానని ధీమాగా ఉన్నారు భూపేశ్ రెడ్డి. అయితే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెదిన టీడీపీ నేతలతో సమన్యవయం చేసుకోలేకపోతున్నారు. టీడీపీ నేతలు సొంత నియోజకవర్గాల్లోనే తిరుగుతుండటంతో భూపేశ్ రెడ్డితో కలసి పనిచేసేవాళ్ళు కరువయ్యారు.
కడప పార్లమెంట్ ఎన్నికల్లో వివేకానంద రెడ్డి హత్య కేసు ప్రభావం క్లియర్ గా కనిపించనుంది. అవినాశ్ రెడ్డి నిందితుడని జనం భావిస్తే… షర్మిలకి ఓట్లేసి గెలిపిస్తారు. ఇక్కడ వైఎస్ కుటుంబానికి విధేయ వర్గం పెద్ద సంఖ్యలో ఉంది. వాళ్ళు ఎటు డిసైడ్ చేస్తారన్న దానిపై షర్మిల, అవినాశ్ రెడ్డి గెలుపు ఆధారపడి ఉంటుంది.