AP Assembly Elections : ఏపీలో భారీగా మహిళల ఓటింగ్.. ఏ పార్టీకి కలిసి రాబోతోంది ?
ఏపీ పోలింగ్.. ఆసక్తికరంగా సాగింది. పోలింగ్ కేంద్రాల దగ్గర మహిళలు, వృద్ధులు.. భారీగా కనిపించారు. కొన్ని పోలింగ్ స్టేషన్‌లో పెద్దపెద్ద క్యూ లైన్‌లు కనిపించాయ్.
ఏపీ పోలింగ్.. ఆసక్తికరంగా సాగింది. పోలింగ్ కేంద్రాల దగ్గర మహిళలు, వృద్ధులు.. భారీగా కనిపించారు. కొన్ని పోలింగ్ స్టేషన్‌లో పెద్దపెద్ద క్యూ లైన్‌లు కనిపించాయ్. దీంతో పోలింగ్ కేంద్రాలన్నీ మహిళలతో సందడి సందడిగా కనిపించాయ్.
గంటలకు గంటలు వెయిట్ చేసి మరీ.. ఓటు హక్కు వినియోగించకున్నారు. వృద్ధుల సంగతి ఎలా ఉన్నా.. మహిళల ఓటు బ్యాంక్.. ఓ పార్టీకి కలిసొస్తుందనే చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది. ఇదంతా తమకే అనుకూలిస్తుందని.. టీడీపీ, వైసీపీ లెక్కలేసుకుంటున్నాయ్. ఐతే ఇప్పుడు మరికొందరు మాత్రం గత ఎన్నికల ట్రెండ్‌ను బయటకు తీస్తున్నారు. 2019లోనూ మహిళ ఓటర్లు భారీగా పోలింగ్‌లో పాల్గొన్నారు. ఆ ఎన్నికల ముందు పసుపు కుంకుమ పథకంతో.. ప్రతీ మహిళా ఖాతాలో పదివేల నగదును వేశారు.
దీంతో మహిళల ఓటు అంతా తమదే అని అప్పట్లో టీడీపీ అంచనా వేసుకుంది. ఫలితాలు వచ్చాక సీన్ మొత్తం రివర్స్ అయింది. టీడీపీ కేవలం 23స్థానాలకే పరిమితం అయింది. ఆ లెక్కన మహిళలు ఎక్కువ శాతం వైసీపీకి ఓటు వేశారని అర్థమైంది. అయితే ఈసారి కూడా మహిళలే అధిక సంఖ్యలో ఓటింగ్ ప్రక్రియలో పాల్గొంటూ ఉండడంతో.. ఇప్పుడు ఏ పార్టీకి అది కలిసి వస్తుందో తేలాల్సి ఉంది. మహిళల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువ ఉందని, అది తమకు కలిసి వస్తుందని టీడీపీ ఇప్పుడు ఆశలు పెట్టుకుంది. ఏపీలో అభివృద్ధి లేకపోవడం, మద్య నిషేధం చేయకపోవడం, శాంతి భద్రత సమస్యల్లాంటివి.. మహిళల్లో ఆలోచన తీసుకొచ్చాయని.. కచ్చితంగా వారంతా ఎన్డీఏ కూటమి వైపే మొగ్గు చూపుతారని టీడీపీ అంచనా వేస్తోంది.
ఇక మేనిఫెస్టోలో ప్రకటించిన ఉచిత బస్సు సౌకర్యం, ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం పేరుతో కుటుంబంలో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా వారందరికీ డబ్బులు ఇస్తామని ప్రకటించడం వంటివి.. తమకు మహిళా ఓట్లను రాల్చాయని అంచనా వేస్తోంది. ఇక వైసీపీ కూడా ఇదే పాజిటివ్ దృక్పథంతో కనిపిస్తోంది. మహిళా ఓటర్లు తమకు అనుకూలంగానే ఓటు వేస్తారని.. ఈ ఐదేళ్లలో వైసీపీ సర్కార్ ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిందని.. ప్రభుత్వం అమలు చేసిన పథకాలన్నీ మహిళల పేరు మీదే ఇవ్వడం, వారి బ్యాంకు ఖాతాలోనే సొమ్ములు జమ చేయడం, ఇల్లు, ఇళ్ల స్థలాలు వారి పేరు రజిస్ట్రేషన్ చేయడం ఇవన్నీ లెక్కలు వేసుకుని వైసీపీ వైపు మొగ్గు చూపుతారని ఆ పార్టీ అంచనా వేస్తోంది.