MINISTER ROJA: రోజాపై తిరుగుబాటు.. నగరిలో టిక్కెట్ ఇస్తారా..?
నాడు రోజాను గెలిపించడానికి పని చేసినవారే ఇప్పుడు ఆమె మీద తిరుగుబాటు చేస్తున్నారు. నియోజకవర్గంలోని ప్రతి మండలంలోనూ ఒక అసమ్మతి నేత బలమైన ప్రత్యర్థిగా ఎదిగారంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చంటున్నారు పరిశీలకులు.

MINISTER ROJA: మామూలుగానే గరం గరంగా ఉండే చిత్తూరు జిల్లా నగరి వైసీపీలో పొలిటికల్ హీట్ ఇప్పుడు ఇంకా పెరిగింది. అసలే గ్రూపులకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న పార్టీలో టికెట్ అంశం మరింతగా కాకరేపుతోంది. ఎమ్మెల్యే రోజా 2014, 2019, ఎన్నికల్లో వరుసగా గెలిచారు. అయితే ఆమె రెండోసారి గెలిచినప్పటి నుంచి స్థానిక వైసీపీ మూడు ముక్కలైంది. నాడు రోజాను గెలిపించడానికి పని చేసినవారే ఇప్పుడు ఆమె మీద తిరుగుబాటు చేస్తున్నారు. నియోజకవర్గంలోని ప్రతి మండలంలోనూ ఒక అసమ్మతి నేత బలమైన ప్రత్యర్థిగా ఎదిగారంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చంటున్నారు పరిశీలకులు. వడమాల పేటలో జెడ్పిటిసిలు, నిండ్రలో శ్రీశైలం ఆలయ పాలకమండలి చైర్మన్ చక్రపాణి రెడ్డి, విజయపురంలో మాజీ రైతు సంఘం రాష్ట్ర నాయకుడు లక్ష్మీపతి రాజు, పుత్తూరులో అమ్ములు, నగరిలో ఈడిగ కార్పొరేషన్ అధ్యక్షురాలు కేజే శాంతి, కేజే కూమార్ ఎమ్మెల్యేని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
MP Kesineni Nani Cadre : అయ్యో తిట్టి తప్పు చేశాం.. అయోమయంలో కేశినేని క్యాడర్.. !
ఈ పరిస్థితుల్లో రోజాకు ఈసారి టిక్కెట్ ఎలా వస్తుందో చూస్తామంటూ గతంలో బహిరంగ సవాల్ చేశారు అసమ్మతి నేతలు. ఎమ్మెల్యేల మార్పు లిస్ట్‌లో రోజా పేరు ఖచ్చితంగా ఉంటుందని అనుకున్నారట. నియోజకవర్గంలో టీడీపీ దూకుడు, ఎమ్మెల్యే మీదున్న వ్యతిరేకతను పరిగణనలోకి తీసుకుని ఆమెను మార్చేస్తారని ఆశించిందట అసమ్మతి వర్గం. కానీ.. సీన్ కట్ చేస్తే సిట్యుయేషన్ వేరేలా ఉందట. ఎవరి సంగతి ఎలా ఉన్నా.. రోజాకు మాత్రం టిక్కెట్ ఖాయమన్న ప్రచారం జరగడం, అందుకు తగ్గట్టే ఆమె అనుచరులు నగరిలో టపాసుల పేల్చి సంబరాలు చేసుకోవడం లాంటివి చూసి రగిలి పోతోందట అసమ్మతి వర్గం. అందులో ఎవరికి వారు తమకున్న పరిచయాలతో పార్టీ పెద్దలను ఆరా తీస్తే.. ఇంకా అలాంటి నిర్ణయం ఏదీ తీసుకోలేదని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నట్టు తెలిసింది. అయితే అదే సమయంలో తాజాగా అసమ్మతి నేతల్లో ఒకరైన కెజె కుమార్‌కు తాడేపల్లి నుంచి పిలుపు రావడంతో మరోసారి పొలిటికల్ హీట్ పెరిగింది.
రోజా వ్యతిరేక వర్గంలో ఉన్న మిగతా నేతలంతా ఇప్పుడు ఆయన్నే ఎందుకు పిలిచారు..? మా అందరిలో ఆయన్నే బలమైన నాయకుడిగా అధిష్టానం గుర్తిస్తోందా? మాకు మాత్రం బలం లేదా..? అసహనంగా ఉన్నట్టు తెలిసింది. అసలే రోజాకు టికెట్ కన్ఫామ్ అన్న ప్రచారం ఓవైపు సలుపుతుంటే.. మరోవైపు అందర్నీ కాకుండా కుమార్ ఒక్కడినే తాడేపల్లికి పిలవడం పుండు మీద కారం చల్లినట్టయిందట. అసలు కేజే కుమార్‌ను మాత్రమే అధిష్టానం ఎందుకు పిలిచింది? మేం పార్టీ కోసం పనిచేయలేదా అంటూ మిగిలిన నేతలు బహిరంగంగానే విమర్శిస్తున్నట్టు తెలిసింది. కుమార్ మాత్రం కేవలం తనకు టికెట్ ప్రయత్నాలు చేసుకోవడానికే తాడేపల్లి వచ్చినట్లు చెబుతున్నారని అంటున్నాయి పార్టీ వర్గాలు. ఈ మొత్తం వ్యవహారంతో నగరి వైసీపీ కేడర్ తీవ్ర గందరగోళంలో ఉందట. ఎమ్మెల్యేతో ఉండాలా..? వ్యతిరేకవర్గంతో నడవాలా అన్నది తేల్చుకోలేక సతమతం అవుతున్నారట. మొత్తానికి నగరి సీటు విషయమై వైసీపీలో పెద్ద గందరగోళమే నడుస్తోందంటున్నాయి పార్టీ వర్గాలు. దీనిపై ఎంత త్వరగా క్లారిటీ ఇస్తే అంత మంచిదని, లేకుంటే మొదటికే మోసం వస్తుందన్న మాటలు వినిపిస్తున్నాయి.