వంశీని ఒంటరిగా వదిలేసిన నానీలు
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్టు చేసిన తర్వాత వైసిపి పెద్ద ఎత్తున హడావిడి చేసింది. ఏకంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. వంశీని పరామర్శించేందుకు విజయవాడ వెళ్లారు.

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్టు చేసిన తర్వాత వైసిపి పెద్ద ఎత్తున హడావిడి చేసింది. ఏకంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. వంశీని పరామర్శించేందుకు విజయవాడ వెళ్లారు. అనంతరం ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇక కృష్ణా జిల్లా వైసీపీ నేతలు కూడా ఆరోజు వంశీని పరామర్శించి వచ్చారు. అయితే ఆ తర్వాత నుంచి వంశీ విషయంలో పెద్దగా ఆసక్తి చూపించడం లేదు కృష్ణాజిల్లా నేతలు. మాజీ మంత్రి పేర్ని నాని ఆ తర్వాత వంశీని పరామర్శించేందుకు వెళ్లి వచ్చారు.
ఇక అప్పటినుంచి ఏ ఒక్కరు కూడా వంశీ కోసం వెళ్లకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అటు మీడియా సమావేశాలు కూడా వంశీకు మద్దతుగా పెద్దగా లేవనే చెప్పాలి. ఆయనపై వరుస కేసులు నమోదు అవుతున్నాయి. గత వారం రోజుల్లో దాదాపు 6 కేసులు నమోదు చేశారు పోలీసులు. త్వరలోనే మరిన్ని కేసులు కూడా నమోదు చేసే అవకాశం ఉంది. ప్రధానంగా మట్టి తవ్వకాల విషయంలో అలాగే భూముల కబ్జాల విషయంలో వల్లభనేని వంశీ మోహన్ పై కేసులు నమోదు అవుతున్నాయి.
ఆయనతో పాటుగా ఆయన అనుచరులు పై కూడా కేసులు పెడుతున్నారు. ఈ విషయంలో వంశీ ఒంటరిగానే పోరాడుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. న్యాయ సహాయం వైసీపీ అందిస్తున్నా పార్టీ నేతలు నుంచి మాత్రం నైతిక మద్దతు లేదు అనే అభిప్రాయాలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. దీనిపై వైసీపీ కార్యకర్తలు కూడా సైలెంట్ గా ఉంటున్నారు. అటు గన్నవరం వైసీపీ నాయకులు కూడా పెద్దగా వంశీని పరామర్శించేందుకు రాకపోవడం ఆశ్చర్యం కలిగించే అంశం. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో వంశీ వెంట తిరిగిన నాయకులు… ఇప్పుడు వంశీ కోసం బయటకు రాకపోవడం గమనార్హం.
వస్తే తమన ఎక్కడ అరెస్టు చేస్తారో అని భయపడి సైలెంట్ గా ఉండిపోవడం జరుగుతుంది. అటు కొడాలి నాని కూడా వంశీ విషయంలో పెద్దగా రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయడం లేదు. జగన్ వెళ్ళినప్పుడు జైలు వద్దకు వెళ్లిన కొడాలి నాని ఆ తర్వాత కనీసం మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయలేదు. పేర్ని నానితో కలిసి ఆయన జైలు వద్దకు కూడా తర్వాత వెళ్ళకపోవడం గమనార్హం. దీనితో నానీలు ఇద్దరు వల్లభనేని వంశీని వదిలేసారని అంటున్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ కూడా విజయవాడలోనే ఉంటున్న వంశీని మాత్రం కలిసే ప్రయత్నం చేయడం లేదు. ఇక వంశీకి ఇప్పట్లో బెయిల్ కూడా వచ్చే అవకాశం లేదనే సంకేతాలు కూడా వస్తున్నాయి. వంశీ పై కేసుల మీద కేసులు పెట్టడంతో ఆయనకు బెయిల్ రావడం కష్టమే. ఆయనపై పిటి వారింట్ కూడా ఇప్పటికే దాకలైంది. దీనితో త్వరలోనే వంశీని పలు కేసుల్లో పోలీసులు తిప్పే అవకాశం ఉంది. మరోవైపు కస్టడీలో వంశీ ఎటువంటి సమాధానాలు చెప్పడం లేదని పోలీసులు మీడియా వద్ద వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనితో మరోసారి ఆయనను కస్టడీకి కూడా కోరే అవకాశాలు ఉండవచ్చు.