AP, TS Election Nominations: ఇవాళ్టి నుంచి నామినేషన్ల జాతర… అభ్యర్థులు ఏం జాగ్రత్తలు తీసుకోవాలంటే !

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎన్నికల కోలాహలం మొదలైంది. ఇవాళ ఎన్నికల కమిషన్ జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీ, తెలంగాణలో లోక్ సభ ఎన్నికలతో పాటు ఏపీలో అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతాయి. ఇవాళ్టి (గురువారం) నుంచి ఈ నెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 18, 2024 | 11:05 AMLast Updated on: Apr 18, 2024 | 11:05 AM

Nominations Fair From Today What Precautions Should Candidates Take 2

 

 

 

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎన్నికల కోలాహలం మొదలైంది. ఇవాళ ఎన్నికల కమిషన్ జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీ, తెలంగాణలో లోక్ సభ ఎన్నికలతో పాటు ఏపీలో అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతాయి. ఇవాళ్టి (గురువారం) నుంచి ఈ నెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. సెలవు రోజులు తప్ప మిగిలిన రోజుల్లో ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకూ నామినేషన్లను స్వీకరిస్తారు. పార్లమెంట్ స్థానాలకు కలెక్టరేట్లలో…. అసెంబ్లీ స్థానాలకు నియోజకవర్గ ప్రధాన కేంద్రాల్లో ఏర్పాట్లు చేశారు. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ ఈనెల 25, 26న పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ నెల 29. మే 13వ తేదీ పోలింగ్, జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. నామినేషన్ వేసే అభ్యర్థితో పాటు మరో నలుగురికి మాత్రమే ఆర్వో ఆఫీసు లోపలికి అనుమతిస్తారు. నామినేషన్ వేసే అభ్యర్థుల ఊరేగింపుతో పాటు ఫైల్ చేసే ప్రాంతంలో పూర్తిగా వీడియో రికార్డింగ్ తీస్తారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో హెల్ప్ డెస్కులను ఏర్పాటు చేశారు.

నామినేషన్ల దాఖలు చేసే అభ్యర్ధులకు జాగ్రత్తలు, నిబంధనలు :

  • నామినేషన్ల దాఖలకు మొత్తం 13 రకాల డాక్యుమెంట్లను తీసుకువెళ్ళాలి.
  • అన్ని డాక్యుమెంట్లు సక్రమంగా ఉంటేనే నామినేషన్లను అనుమతిస్తారు.
  • పార్లమెంటరీ నియోజకవర్గం కోసం ఫారం-2A, అసెంబ్లీ నియోజకవర్గం కోసం ఫారం-2B సమర్పించాలి.
  • నోటిఫైడ్ తేదీల్లో ఉదయం 11.00 నుంచి మధ్యాహ్నం 3.00 గంటల వరకు నామినేషన్లను స్వీకరణ
  • ప్రభుత్వ సెలవు రోజుల్లో నామినేషన్ల స్వీకరణ ఉండదు
  • ఒక అభ్యర్థి గరిష్టంగా 4 సెట్ల నామినేషన్లు దాఖలు చేయవచ్చు.
  • 2 కంటే ఎక్కువ నియోజకవర్గాల నుంచి అభ్యర్థులు నామినేషన్లను ఫైల్ చేయడం కుదరదు
  • అభ్యర్థి నామినేషన్ వేసేటప్పుడు అప్లికేషన్ పూర్తిగా పూరించారా లేదా సరి చూసుకోవాలి
  • అఫిడవిట్ ప్రతి పేజీ పైనా అభ్యర్థి విధిగా సంతకం చేయాలి
  • పార్లమెంట్ నియోజకవర్గ పోటీకి జనరల్ అభ్యర్థి సెక్యూరిటీ డిపాజిట్ గా రూ.25 వేలు చెల్లించాలి.
  • SC/ST అభ్యర్థులైతే కుల ధృవీకరణ పత్రం సమర్పిస్తూ రూ.12,500 సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి.
  • అసెంబ్లీ నియోజకవర్గ పోటీకి జనరల్ అభ్యర్థి రూ.10 వేలు, SC/ST అభ్యర్థులు రూ.5 వేలు డిపాజిట్ చేయాలి
  • ఇటీవల మూడు నెలల లోపల ఫోటో తీసుకున్నట్లుగా డిక్లరేషన్ ఇవ్వాలి. 2x 2.5 సెంమీ సైజు మూడు కలర్ ఫొటోలు సమర్పించాలి
  • ఇతర నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులైతే ఎలక్ట్రోల్ రోల్ సర్టిఫైడ్ కాపీని సమర్పించాలి,
  • ఇంక్ తో సంతకం చేసిన ఫారం A, Bని రిటర్నింగ్ ఆఫీసర్ కి సమర్పించాలి. జిరాక్స్ కాపీలు అనుమతించరు.
  • అభ్యర్థి ఎన్నికల ఖర్చుల పరిశీలన కోసం కొత్తగా ఏదైనా బ్యాంకు/కోఆపరేటీవ్ బ్యాంకు/పోస్టాఫీసులో తెరిచిన ప్రత్యేక బ్యాంక్ అకౌంట్ వివరాలను సమర్పించాలి
  • బ్యాలెట్ పేపర్ (లేదా EVM)లో తన పేరు తెలుగు, ఇంగ్లీషు భాషల్లో ఎలా ప్రింట్ చేయాలో తెలియజేయాలి
  • ఇండిపెండెంట్ అభ్యర్థులైతే ఎంచుకున్న సింబల్ ను సూచించాలి.
  • నామినేషన్ల దాఖలు చేసేటప్పుడు…కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో గరిష్టంగా 3 వాహనాలను మాత్రమే అనుమతిస్తారు.
  • నామినేషన్ల దాఖలు చేసేప్పుడు అభ్యర్థితో కలిపి గరిష్టంగా ఐదుగురికి మాత్రమే ROఆఫీస్‌లోకి అనుమతి ఉంటుంది.
  • నామినేషన్ల స్వీకరణకు సంబంధించి అవగాహన కల్పించేందుకు పార్లమెంట్, అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేశారు.
  • అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసినప్పుటి నుంచి, ఎన్నికల ఖర్చు అతని ఖాతాలో లెక్కిస్తారు.
  • పత్రికల్లో వచ్చే ప్రకటనలు, పెయిడ్ న్యూస్ వార్తలకు అయ్యే ఖర్చును కూడా అభ్యర్థి ఖాతాలో లెక్కిస్తారు.