YS Jagan : జగన్‌ను నమ్ముకొని ఇరుక్కున్న అధికారులు.. ఈ ఐఏఎస్‌ల కెరీర్‌లు ఇక నాశనమే..

నమ్మకం వేరు, గుడ్డి నమ్మకం వేరు.. నమ్మకం ఉంటే పర్లేదు.. గుడ్డిగా నమ్ముకుంటేనే భవిష్యత్ అంధకారంగా మారుతుంది. ఏపీలో కొందరు ఐఏఎస్‌ల పరిస్థితి ఇలానే ఉంది పాపం ! ఒకప్పుడు.. ఇప్పుడు... జగన్‌ను నమ్ముకున్న ఐఏఎస్‌ల కెరీర్‌ను ఇప్పుడు ఎండింగ్‌కు చేరుకున్నట్లు కనిపిస్తున్నాయ్. ఏపీలో వైసీపీ ఓటమి తర్వాత పరిణామాలు వేగంగా మారుతున్నాయ్.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 19, 2024 | 01:25 PMLast Updated on: Jun 19, 2024 | 1:25 PM

Officials Who Trusted Jagan Careers Of These Ias Are Now Ruined

నమ్మకం వేరు, గుడ్డి నమ్మకం వేరు.. నమ్మకం ఉంటే పర్లేదు.. గుడ్డిగా నమ్ముకుంటేనే భవిష్యత్ అంధకారంగా మారుతుంది. ఏపీలో కొందరు ఐఏఎస్‌ల పరిస్థితి ఇలానే ఉంది పాపం ! ఒకప్పుడు.. ఇప్పుడు… జగన్‌ను నమ్ముకున్న ఐఏఎస్‌ల కెరీర్‌ను ఇప్పుడు ఎండింగ్‌కు చేరుకున్నట్లు కనిపిస్తున్నాయ్. ఏపీలో వైసీపీ ఓటమి తర్వాత పరిణామాలు వేగంగా మారుతున్నాయ్. ప్రభుత్వంలో చకచకా బదిలీలు జరుగుతున్నాయ్. సీఎస్‌ జవహర్ రెడ్డి సెలవుపై వెళ్లడం.. ఆయన స్థానంలో నీరబ్ కుమార్ రావడం.. ఆ తర్వాత వెంటనే పూనం మాలకొండయ్య, రేవు ముత్యాల రాజు, నారాయణ భరత్‌ గుప్తా బదిలీ కావడంతో.. గేమ్ స్టార్ట్ అయింది. ప్రభుత్వం మారినప్పుడు ఇలాంటి బదిలీలు కామనే ! ఇది కాదు ఇక్కడ మ్యాటర్‌.. జగన్‌ను నమ్ముకొని.. కెరీర్‌ నాశనం చేసుకున్నామని కొందరు ఐఏఎస్ అధికారులు ఇప్పుడు లబోదిబోమంటున్నారు.

జగన్ కారణంగా ఒకసారి దెబ్బతిని.. మళ్లీ ఆయననే నమ్ముకొని.. ఇప్పుడు నిండా మునిగిపోయారు. 2004 నుంచి 2009 మధ్య జగన్‌ దగ్గర పనిచేసి కేసులు, అరెస్టులతో ఇబ్బందులు పడి.. 2019లో జగన్‌ సర్కార్‌లో పనిచేసి.. కెరీర్‌ను ఇబ్బందుల్లోకి నెట్టేసుకున్నామని కొందరు అధికారులు పడుతున్న బాధ అంతా ఇంతా కాదు. నిజానికి జగన్‌ను నమ్ముకున్న ఐఏఎస్‌లందరి పరిస్థితి ఇలానే ఉంది. అప్పుడు బీపీ ఆచార్య, శ్రీలక్ష్మి నుంచి.. ఇప్పుడు ప్రవీణ్‌ ప్రకాశ్, సీతారామాంజనేయులు, ధర్మారెడ్డి వరకు.. అందరి ఐఏఎస్ అధికారులు ఇలాంటి పరిస్థితే ఎదుర్కొంటున్నారు.

గతం నుంచి చూస్తే.. వైఎస్‌ సీఎంగా ఉన్న సమయంలో ఐఏఎస్ బీపీ ఆచార్య జగన్ కోసం పనిచేశారనే ఆరోపణ ఉంది. జగన్ అక్రమాస్తుల కోసం బీపీ ఆచార్య నిందితుడిగా ఉన్నారు. జగన్ ఆస్తుల కేసుకు సంబంధించిన అరబిందో, హెటిరో ఫార్మా కంపెనీలపై మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ దాఖలు చేసిన ఫిర్యాదులో ఆయన ప్రధాన నిందితుడు. ఇక ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసులో అరెస్ట్ అయ్యారు కూడా ! ఐతే బీపీ ఆచార్య మీద సీబీఐ విచారణ నిలుపుదల చేయాలని ఆ మధ్య సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా.. కెరీర్ చివరలో జగన్‌ కారణంగా బీపీ ఆచార్య పడిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఆయన టోటల్ కెరీర్‌కే జగన్ వల్ల మచ్చపడిందనే చర్చ ఇప్పటికీ వినిపిస్తోంది.

ఇక బీపీ ఆచార్య తర్వాత ఆ లెవల్‌ జగన్ వల్ల ఇబ్బంది పడ్డ మరో ఐఏఎస్ శ్రీలక్ష్మీ. ఉమ్మడి ఏపీలో వైఎస్ హయాంలో అవకతవకలకు పాల్పడిన ఆరోపణలపై విచారణను ఎదుర్కొని శ్రీలక్ష్మీ జైలుకు వెళ్లి వచ్చారు. అప్పుడు జగన్ కోసం పనిచేశారనే ఆరోపణలు ఉన్నాయ్. అప్పుడు జగన్‌ కోసం పనిచేసి ఇబ్బందులు పడిన శ్రీలక్ష్మి.. వైసీపీ అధికారంలోకి వచ్చాక.. ఏపీకి వచ్చేందుకు చేయని ప్రయత్నాలు లేవు. ఎలాగోలా ఏపీ కేడర్‌కు వచ్చిన శ్రీలక్ష్మి.. ఆ తర్వాత అడ్డదిడ్డ, అవకతవక నిర్ణయాలన్నిటికీ వత్తాసు పలికారని టీడీపీ ఫైర్ అవుతోంది. మున్సిపల్‌ శాఖ ప్రిన్నిపల్ సెక్రటరీ హోదాలో నిబంధనలను తుంగలో తొక్కి జగన్ ఏం చేయమంటే అది చేశారనే ఆరోపణలు ఉన్నాయ్. కట్ చేస్తే ఇప్పుడు జగన్ అధికారం పోయింది.

శ్రీలక్ష్మీ కెరీర్‌ ప్రమాదంలో పడింది. దీంతో అలర్ట్ అయిన ఆమె.. చంద్రబాబు, మంత్రి నారాయణను కూల్ చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఐతే టీడీపీ ఆమె మీద కోపంతో కనిపిస్తోంది. శ్రీలక్ష్మీ ఇచ్చిన బొకే తీసుకోవడానికి కూడా చంద్రబాబు ఇష్టపడలేదు. ఇక మంత్రి నారాయణ అయితే.. శ్రీలక్ష్మి ఇచ్చిన ఫైల్‌ చూసేందుకు కూడా ఇష్టపడలేదు. జగన్ అవకతకల్లో భాగం అయ్యారని కోపంతో ఉన్న చంద్రబాబు సర్కార్.. రాబోయే రోజుల్లో శ్రీలక్ష్మీపై విచారణ చేయడం ఖాయం.. ఈ లెక్కన ఆమె కెరీర్‌ ప్రమాదంలో పడినట్లే ! ఈ ఇద్దరు అప్పట్లో ఇబ్బందులు పడితే.. మరికొందరు ఐఏఎస్‌, ఐపీఎస్‌లు జగన్‌ తీరుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

జగన్‌కు అనుకూలం అని పేరున్న అధికారులపై చంద్రబాబు టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. దీంతో జగన్ హయాంలో వైసీపీ సర్కార్‌కు అనుకూలంగా వ్యవహరించిన ఐఏఎస్, ఐపీఎస్‌లో.. ఘోర అవమానాలు ఎదుర్కొంటున్నారు. ప్రమాణస్వీకారానికి ముందే సీఎస్‌ను మార్చేశారు. ఆ తర్వాత బదిలీలు కంటిన్యూ చేశారు. హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా ఉన్న ప్రవీణ్‌ ప్రకాశ్‌ను మార్చేసి.. పోలా భాస్కర్‌ను నియమించారు చంద్రబాబు. ప్రవీణ్ ప్రకాశ్‌.. జగన్‌కు అనుకూలంగా వ్యవహరించి.. చాలా అవకతవకలకు పాల్పడ్డారని చంద్రబాబు ఆగ్రహంతో ఉన్నారు. జగన్ బాగోతాలు బయటకు తీస్తామని పదేపదే చెప్తున్న చంద్రబాబు సర్కార్‌.. రాబోయే రోజుల్లో ప్రవీణ్ ప్రకాశ్‌ను కూడా టార్గెట్ చేసే అవకాశాలు లేకపోలేదు. అదే జరిగితే.. ఆయన కెరీర్‌ రిస్క్‌లో పడినట్లే.

ప్రవీణ్‌తో పాటు జగన్‌ను నమ్ముకున్న చాలామంది ఐఏఎస్, ఐపీఎస్‌ల పరిస్థితి ఇలానే ఉంది. జగన్‌ ఏరి కోరి తెచ్చుకున్న సీనియర్ ఐపీఎస్ రామాంజనేయులును కలవడానికి కూడా చంద్రబాబు ఇష్టపడలేదు. వైసీపీ ప్రభుత్వంలో ఇంటలిజెన్స్ చీఫ్‌గా ఉన్న రామాంజనేయులు.. తనకు, తన పార్టీ వ్యతిరేకంగా జగన్‌ పన్నిన కుట్రలకు.. పూర్తిగా సహకరించారని చంద్రబాబు కోపంతో ఉన్నారు. ఎవరినీ వదిలేది లేదు అని పదేపదే చెప్తున్న చంద్రబాబు.. రామాంజనేయులను టార్గెట్ చేసే అవకాశాలు లేకపోలేదు. అందుకే ఆయనను కలిసేందుకు కూడా చంద్రబాబు ఇష్టపడలేదు. ఫలితాల వచ్చిన తర్వాత కలిసేందుకు రామాంజనేయులు ప్రయత్నించగా.. చంద్రబాబు ఆసక్తి చూపించకపోగా.. అక్కడి నుంచి వెళ్లిపోవాలని కలఇంటెలిజెన్స్ ఏడీజీతో చెప్పించారంటే.. అర్థం చేసుకోవచ్చు ఎంత కోపంగా ఉన్నారు.

రామాంజనేయులపై వేటు పడడం ఖాయంగా కనిపిస్తోంది. ఇలా జగన్‌కు అనుకూలంగా ఉండి.. ఆయన కూడా కెరీర్‌ను రిస్క్‌లో పెట్టుకున్నట్లు అయింది. జగన్‌ను నమ్మి ఇబ్బందుల్లో పడ్డ మరో ఐఏఎస్‌.. కేవీవీ సత్యనారాయణ. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశారని కేవీవీ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఈయనకు కీలకమైన నిధుల పంపిణీ బాధ్యతలు అప్పగించారు జగన్. ఐదేళ్లుగా జగన్ తన అనుచరులకు మాత్రమే బిల్లులు చెల్లించి ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ నిబంధనలను ఆయన ఉల్లంఘించారనే ఆరోపణలు ఉన్నాయ్. జగన్‌ను మద్దతుగా, జగన్ అండతో ఇష్టారాజ్యంగా వ్యవహరించారనే టాక్ ఉంది. ఏపీఎస్‌డీసీ పేరుతో ఒకసారి.. మద్యం వ్యాట్‌ ఆదాయాన్ని దారి మరల్చి మరోసారి.. కేవీవీ అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయ్. వీటిని కూటమి సర్కార్ బయటకు తీసే అవకాశాలు లేకపోలేదు. వైఎస్ కుటుంబానికి ఆప్తుడు అయిన ధర్మారెడ్డిని.. ఢిల్లీ నుంచి రప్పించుకొని మరీ టీటీడీ ఈవో బాధ్యతలు అప్పగించారు జగన్‌. రక్షణ శాఖకు చెందిన ఐడీఈఎస్‌ అధికారి ధర్మారెడ్డిని.. ముందుగా కొండ మీద జేఈవో పోస్టులో ఓఎస్డీగా చేరిన తర్వాత.. ఆయన కోసమే ప్రభుత్వం ఆ పోస్టును అదనపు ఈవోగా అప్‌గ్రేడ్‌ చేసింది. తర్వాత ఈవోను కూడా సాగనంపి ఈవో ఫుల్‌ అడిషనల్‌ చార్జి కూడా ధర్మారెడ్డికే అప్పగించింది.

దీంతో మొత్తం టీటీడీ వ్యవహారాలపై ఆయన పెత్తనం మొదలైంది. ఆ పోస్టును అడ్డుపెట్టుకుని పలు అంశాల్లో వైసీపీ ప్రభుత్వానికి, గత సీఎం జగన్‌కు అనుకూలంగా వ్యవహరించారన్న ఆరోపణలు ధర్మారెడ్డిపై ఉన్నాయ్. ఇక రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే ధర్మారెడ్డి సెలవుపై వెళ్లిపోవడానికి ప్రయత్నించారు. ఐతే పదవిలోంచి తప్పుకున్నంత మాత్రాన ధర్మారెడ్డిని వదిలేది లేదని.. టీడీపీ నేతలు బహిరంగంగానే సవాల్ చేస్తున్నారు. ఈ లెక్కన రాబోయే రోజుల్లో ఆయన కూడా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవడం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే.. కెరీర్‌లో మాయని మచ్చగా మిగిలిపోవడం ఖాయం. ఇలా జగన్‌ నమ్మినవాళ్లు.. జగన్‌ను నమ్ముకున్న వాళ్లు.. ఐఏఎస్‌, ఐపీఎస్ అధికారుల కెరీర్ ఇప్పుడు ప్రమాదంలో పడింది. జగన్‌ను నమ్మాం.. మునిగాం అంటూ వాళ్లంతా లబోదిబోమంటున్న పరిస్థితి.