Pawan, Chandrababu : 31న పవన్, చంద్రబాబు భేటీ.. గెలుపుపై భయం మొదలైందా..
ఏపీలో ఫలితాలకు ఇంకొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ నెల 31న టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ భేటీ కాబోతున్నారు.
ఏపీలో ఫలితాలకు ఇంకొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ నెల 31న టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ భేటీ కాబోతున్నారు. ఇద్దరు నేతలు పోలింగ్ జరిగిన తీరు, ఆ తర్వాత జరిగిన పరిణామాలపై రివ్యూ చేసే అవకాశాలు ఉన్నాయ్. 31న బీజేపీ నేతలు కూడా చంద్రబాబుని కలిసే అవకాశం ఉంది. ఏపీలో గెలుపు ఎవరిది అనే దానిపై క్లారిటీ రావడం లేదు. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే టెన్షన్ కనిపిస్తోంది. ఎవరి అంచనాలు వారివి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని కొందరు అంటుంటే.. వైసీపీ వరుసగా రెండోసారి అధికారం చేపట్టబోతుందని ఇంకొందరి వాదన. మరోవైపు రెండు పార్టీల నేతలు.. సీఎం ప్రమాణ స్వీకారం తేదీలను ప్రకటిస్తున్నారు.
జగన్ జూన్9న విశాఖలో ప్రమాణస్వీకారం చేస్తారని వైసీపీ నేతలు ప్రకటనలు చేశారు. అమరావతిలో చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎవరెన్ని ప్రకటనలు చేసినా సీఎంగా ప్రమాణం చేసేది ఒకరే.. ఆ ఒకరు ఎవరనే ఉత్కంఠ ఏపీ జనాల్లో కంటిన్యూ అవుతోంది. గెలుపు ఖాయం అని కూటమి నేతలు చెప్తున్నా.. వారిని ఓ విషయం మాత్రం కంగారు పెడుతోంది. పెరిగిన పోలింగ్ శాతం గ్రామీణ ప్రాంతంలో కావడం.. అందులోనూ మహిళల ఓటింగ్ ఎక్కువ జరగడంతో.. కూటమి నేతల్లో లోలోపల టెన్షన్ స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది.
దీనిపై ఇద్దరి భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే నియోజకవర్గాలవారీగా పోలింగ్ సరళిపై ఆరా తీశారు. రాష్ట్రవ్యాప్తంగా కోటి 69లక్షల మంది మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆ ఓట్ బ్యాంక్ తమదేనని వైసీపీ క్లెయిమ్ చేసుకుంటోంది. ఐతే అదంతా ప్రభుత్వ వ్యతిరేక ఓటుగా టీడీపీ వాదిస్తోంది. పూర్తి స్థాయిలో మహిళా ఓట్ బ్యాంక్.. వైసీపీకి వెళ్లలేదని టీడీపీ నేతలు లెక్కలు వేస్తున్నారు. టీడీపీ కూటమి నేతలు ఇప్పటి వరకు గెలుపు పైన ధీమా వ్యక్తం చేయకపోవటం.. గెలిచే సీట్ల పైన అంచనాలు చెప్పకపోవటంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. ఇలాంటి పరిస్థితుల మధ్య ఇద్దరి భేటీ మరింత ఆసక్తికరంగా మారింది.