ఇది పవన్ దెబ్బ… వైసీపీ ఖాళీ అవుతోందా…?
అధికారం కోల్పోయిన తర్వాత రాజకీయం చేయడం ఇప్పుడు వైఎస్ జగన్ కు చాలా కష్టంగా మారుతోంది. ప్రజల్లోకి వెళ్లేందుకు జగన్ చేస్తున్న ప్రయత్నాలు అంతగా ఫలించకపోవడం ఒకటి అయితే ఇప్పుడు వైసీపీ నుంచి ఎప్పుడు, ఎవరు, ఏ విధంగా బయటకు వెళ్ళిపోతారు అనేది ఆందోళన కలిగిస్తోంది. గత ప్రభుత్వంలో అవినీతి కార్యక్రమాలు చేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ ఇప్పుడు బయట పడటానికి పార్టీ మార్పునే నమ్ముకున్నట్టుగా స్పష్టంగా అర్ధమవుతోంది. టీడీపీలోకి ఎంట్రీ లేదని ఆ పార్టీ అధిష్టానం చెప్పడంతో జనసేన గడప తోక్కుతున్నట్టుగానే కనపడుతోంది.
ఇటీవల మద్దాలి గిరి వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేసి జనసేనలో జాయిన్ అయ్యేందుకు నాదెండ్ల మనోహర్ ద్వారా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆయనతో పాటుగా గుంటూరు మేయర్ కావేటి మనోహర్ నాయుడు కూడా పార్టీ మారేందుకు రంగం సిద్దం చేసుకున్నారని, ఇద్దరూ కలిసి ఒకే రోజు జనసేనలోకి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చే జరిగింది. ఇక గుంటూరు పార్లమెంట్ ఇంచార్జ్ గా ఉన్న కిలారి వెంకట రోశయ్య కూడా పార్టీ మారే ప్రయత్నం చాలా గట్టిగా చేసారు.
వైసీపీకి రాజీనామా చేసిన అనంతరం ఆయన నేరుగా జనసేన పార్టీ ఆఫీస్ కి వెళ్ళారు. కాని పార్టీ మారడం ఎందుకో కుదరలేదు. గుంటూరు టీడీపీ నేతల నుంచి వ్యతిరేకత రావడంతోనే ఆయన చేరిక జనసేనలో ఆగింది అనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు మరో నేత కూడా పార్టీ మారేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన కూడా జనసేనలోకి చేరడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆయనే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు. గత కొన్నాళ్ళుగా పార్టీ మారతారు అనే వార్తలను నిజం చేస్తూ రాజీనామా చేసేందుకు సిద్దం అయ్యారు.
ఆయనతో పాటుగా తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కీలక నేతలు జనసేనలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. అలాగే కుప్పం నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ భరత్ కూడా ఇప్పుడు జనసేనలో చేరే ప్రయత్నాలు ముమ్మరం చేసారు. ఆయన నియోజకవర్గానికి దూరంగానే ఉంటున్నారు. కడప జిల్లాకు చెందిన పలువురు నేతలు కూడా ఇప్పుడు వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేన తీర్ధం పుచ్చుకునే ఆలోచనలో ఉన్నట్టుగా రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇలా టీడీపీలోకి ఎంట్రీ లేని వైసీపీ నేతలను పవన్ తన పార్టీలోకి తీసుకుంటున్నారు.
దీని ద్వారా జనసేన పార్టీ బలోపేతం అయ్యే అవకాశాలు ఉన్నాయని పవన్ భావిస్తున్నారు. అయితే గతంలో టీడీపీ నేతలను ఇబ్బంది పెట్టిన వారిని కాకుండా సౌమ్యులుగా గుర్తింపు ఉన్న వారినే పవన్ ఆహ్వానిస్తున్నారు. అలాగే అవినీతి వ్యవహారాల్లో ఉన్న నేతలను ఆయన పక్కన పెట్టేస్తున్నారు. వైసీపీని భూస్థాపితం చేసే దిశగా పవన్ అడుగులు ఉన్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి. చీరాలకు చెందిన కరణం కుటుంబం కూడా ఇప్పుడు వైసీపీ నుంచి బయటకు వచ్చి జనసేన తీర్ధం పుచ్చుకునే ఆలోచనలో ఉంది. ఇలా వైసీపీలో పట్టున్న మంచి నేతలకు పవన్ స్వాగతం పలుకుతున్నట్టుగా తెలుస్తోంది.