PAWAN KALYAN: పవన్ పోటీ చేసే నియోజకవర్గం అదేనా..? క్లారిటీ వచ్చిందా..?
భీమవరం నుంచి పోటీ చేస్తారని ఒకసారి.. తిరుపతి నుంచి పోటీ చేస్తారని మరోసారి.. ఇలా పలు నియోజకవర్గాలు వినిపించాయి. అయితే, పవన్ వీటికి భిన్నంగా మరో నియోజకవర్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
PAWAN KALYAN: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయబోయే నియోజకవర్గం విషయంలో సందిగ్ధత నెలకొంది. భీమవరం నుంచి పోటీ చేస్తారని ఒకసారి.. తిరుపతి నుంచి పోటీ చేస్తారని మరోసారి.. ఇలా పలు నియోజకవర్గాలు వినిపించాయి. అయితే, పవన్ వీటికి భిన్నంగా మరో నియోజకవర్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. పవన్ కాకినాడ నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఆయన నిర్ణయం తీసుకుని, పోటీకి సిద్ధంగా ప్రణాళికలు కూడా రచిస్తున్నారు.
BJP-TDP: టీడీపీతో బీజేపీ పొత్తు.. పవన్‌కు సలహా ఇచ్చిన బీజేపీ
అందుకోసమే పవన్ ఈ వారంలోనే కాకినాడ వెళ్లే అవకాశం ఉంది. ఈ పర్యటనలో అక్కడి వార్డులపై పవన్ సమీక్ష చేయబోతున్నారు. కాకినాడలో 50 వార్డులు ఉంటే ఇప్పటికే 28 వార్డుల పెద్దలతో చర్చలు జరిపారు. అలాగే కాకినాడలో సొంత నివాసాన్ని ఏర్పాటు చేసుకునేందుకు కూడా పవన్ కల్యాణ్ ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. కాకినాడ చుట్టూ.. పవన్ ఉండేందుకు అనువైన ప్రాంతాలను జనసేన నేతలు పరిశీలిస్తున్నారు. అయితే, పవన్ కాకినాడ నగరం నుంచి పోటీ చేయాలని నిర్ణయం తీసుకోవడం వెనుక అనేక కారణాలున్నాయి. కాకినాడ సిటీలో పవన్ సామాజికవర్గమైన కాపు ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఇక్కడ ఆయన పోటీ చేస్తే ఆ ప్రభావం కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఉంటుంది. ఇప్పటికే అక్కడ జనసేనకు మద్దతు పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కాకినాడ నుంచి పోటీ చేయడమే సరైందని పవన్ భావిస్తున్నారు. ఇక.. గతంలో వారాహి యాత్ర జరిగినప్పుడు పవన్ ఇక్కడికి వచ్చారు.
వైసీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై పవన్ పలు విమర్శలు చేశారు. దీనికి స్పందించిన ద్వారంపూడి.. పవన్ కాకినాడ నుంచి పోటీ చేయాలని సవాల్ చేశారు. అయితే, ఈ సవాల్ స్వీకరించి కాదుగానీ.. అన్ని రకాలుగా ఆలోచించే పవన్ ఇక్కడ పోటీ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. నిజానికి ఈ నిర్ణయం చాలా కాలం క్రితమే తీసుకున్నారట. కానీ, వైసీపీ ట్రాప్‌లో పడటం ఇష్టం లేక ఇంతకాలం ప్రకటన చేయలేదని జనసేన నేతలు అంటున్నారు.