ఏపీలో క్వార్టర్ కిక్, రూ 99 క్వార్టర్ కోసం క్యూ లైన్లు

ఆంధ్రప్రదేశ్ లో నూతన ఎక్సైజ్ పాలసీ మందు బాబులకు పండుగ రోజులు తెచ్చింది. ఇన్నాళ్ళు మందు దాహంతో అలమటించిపోయిన మందుబాబులకు ఏపీ లో 99 రూపాయలకే క్వార్టర్ పథకం దాహం తీరుస్తోంది. ఇందుకోసం 20 వేల కార్టన్ లను సప్లై చేసామని ఎక్సైజ్ అధికారులు ప్రకటించారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 18, 2024 | 04:19 PMLast Updated on: Oct 18, 2024 | 4:19 PM

Quarter Kick In Ap Queue Lines For Rs 99 Quarter

ఆంధ్రప్రదేశ్ లో నూతన ఎక్సైజ్ పాలసీ మందు బాబులకు పండుగ రోజులు తెచ్చింది. ఇన్నాళ్ళు మందు దాహంతో అలమటించిపోయిన మందుబాబులకు ఏపీ లో 99 రూపాయలకే క్వార్టర్ పథకం దాహం తీరుస్తోంది. ఇందుకోసం 20 వేల కార్టన్ లను సప్లై చేసామని ఎక్సైజ్ అధికారులు ప్రకటించారు. క్వార్టర్ 99కి అందిస్తామని చంద్రబాబు చెప్పినట్లే బ్రాందీ షాపులకు షాట్ విస్కీ, ఓల్డ్ క్లబ్ బ్రాందీ చేరాయి. డిపోల నుంచి ఇంకా చాలా షాపులకు 99 క్వార్టర్ బాటిల్స్ చేరకపోవడంతో మందుబాబులు ఎదురు చూస్తున్నారు.

వైసీపీ హయాంలో క్వార్టర్ బాటిల్ ప్రారంభ ధర 120 రూపాయలుగా ఉంది. రాడికో, ప్రేడ్ డిస్టలరీస్ నుంచి 99 రూపాయల కే మద్యం సరఫరా చేస్తోంది ప్రభుత్వం. ఒక్కరోజే 10 వేల కేసుల 99 క్వార్టర్ బాటిల్ స్టాకు డిపోలకు సరఫరా చేసినట్టు ఏపీ ఎక్సైజ్ శాఖ చెప్పడం గమనార్హం. మరో 25 వేల కేసుల స్టాకు పంపటానికి ఏర్పాట్లు చేస్తున్నామని ప్రకటించారు. ఇదంతా బాగానే ఉంది గాని వినడానికే వింతగా విడ్డూరంగా, చండాలంగా ఉంది. ప్రభుత్వాలతో పాటు ప్రజలు ఎంత వరకు దిగాజారిపోయాయో చెప్పడానికి ఇదే ప్రత్యక్ష ఉదాహరణ.

గతంలో సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వాలు ఘనంగా ప్రకటించేవి. రెండు రూపాయలకే కిలో బియ్యం, ఉచిత వైద్యం, ఎన్టీఆర్ గృహకల్ప, ఇందిరమ్మ ఇల్లు అంటూ పేదలకు కూటికి గుడ్డకు లోటు లేకుండా చూస్తామని ప్రభుత్వాల నుంచి ప్రకటనలు వచ్చేవి. మద్యపాన నిషేధం గురించి పెద్ద ఎత్తున ప్రచారాలు కూడా నిర్వహించారు. అలాంటి ప్రభుత్వాలు క్వార్టర్ బాటిల్ ను 99 రూపాయలకే అందిస్తున్నామని సంక్షేమ పథకం రేంజ్ లో దానికి ప్రచారం నిర్వహించడం, ఎక్సైజ్ శాఖ అధికారులు ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేయడం నిజంగా గర్హించే విషయమే.

రాజకీయ నాయకులు ప్రజలను మభ్య పెట్టడానికి ఎన్నో కార్యక్రమాలు ప్రచారం చేస్తూ ఉంటారు. ఇప్పుడు గత ప్రభుత్వం లిక్కర్ ను ఎక్కువ ధరకు అమ్మింది, మేం తక్కువ ధరకు అందుబాటులోకి తెస్తున్నామని ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. ఇక ప్రభుత్వ అనుకూల మీడియా కూడా ఈ చండాలం గురించి ఎక్కువగానే ప్రచారం కల్పించడం గమనార్హం. ఇక ప్రజలు కూడా ఆ మద్యం కోసం ఎగబడటం వినడానికి, చూడటానికి కూడా రోతగా ఉంది. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమకు తక్కువ ధరకే వైద్యం అందాలని, నిత్యావసర సరుకుల ధరలు తగ్గాలని, మంచి నీళ్ళు అందుబాటులో ఉండాలని, రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని డిమాండ్ చేసే ప్రజలు క్వార్టర్ బాటిల్ కోసం ఏ మాత్రం సిగ్గుపడకుండా ఎగబడటం కలియుగంలో ఓ చరిత్ర.