Top story: ఇసుక… లిక్కర్… రేషన్ బియ్యం అన్నీ మావే ఏపీలో బరితెగించేసిన ఎమ్మెల్యేలు
చంద్రబాబుకి ఏం పోయింది? ఎన్నైనా చెప్తాడు. పవన్ కళ్యాణ్ సూక్తులు ఇక్కడ పనిచేయవు. కోట్లు ఖర్చుపెట్టి ఎమ్మెల్యేలుగా గెలిచాం. మేం సంపాదించుకోవద్దా? పైన వాళ్లు మాత్రమే బాగుపడాలా? మేము అడుక్కుతినాలా?
చంద్రబాబుకి ఏం పోయింది? ఎన్నైనా చెప్తాడు. పవన్ కళ్యాణ్ సూక్తులు ఇక్కడ పనిచేయవు. కోట్లు ఖర్చుపెట్టి ఎమ్మెల్యేలుగా గెలిచాం. మేం సంపాదించుకోవద్దా? పైన వాళ్లు మాత్రమే బాగుపడాలా? మేము అడుక్కుతినాలా? ఈ మాటలు ఎవరివో కాదు. ఏపీలో 75% ఎమ్మెల్యేలంతా ఇలాగే మాట్లాడుతున్నారు. ఇసుక, మద్యం షాపులు, రేషన్ బియ్యం ఇవే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎమ్మెల్యేలకు నికర ఆదాయం. ఎలాంటి వ్యాపారాలు చేయకుండా ఇంట్లో కూర్చున్నా… కూడా ఈ మూడింటి ద్వారానే ఒక్క ఎమ్మెల్యే కి నెలకి కనీసం కోటి రూపాయలు ఆదాయం వస్తుంది. అందుకే ఆ ఎమ్మెల్యే …ఈ ఎమ్మెల్యే అని లేదు కొందరు మంత్రులు.. ఇంకొందరు బడా కాంట్రాక్టర్లైన ఎమ్మెల్యేలు మినహా మిగిలిన అందరూ ఈ మూడింటిని అడ్డం పెట్టుకొని ఏపీలో కుమ్ముడే కుమ్ముడు.
2019 నుంచి 24 వరకు వైసిపి పాలనలో ఇసుక నుంచి వేలకోట్లు పిండేసాడు జగన్. రాష్ట్రంలో ఇసుక రీచ్ లన్నిటిని ఒక ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టి, ఆ సంస్థ ఇసుక అమ్ముకునేలా చేసి తద్వారా ప్రభుత్వానికి, తనకి వ్యక్తిగతంగా ఆదాయం వచ్చేటట్లు ఏర్పాటు చేసుకున్నాడు జగన్. ఆ ఐదేళ్లు ఇసుక రీచ్ ల వైపు వైసిపి ఎమ్మెల్యేలు గానీ, ఇతర నేతలు గాని కనుతిప్పి కూడా చూసే సాహసం చేయలేకపోయారు. ఓ పద్ధతి ప్రకారం ఇసుక నుంచి డబ్బు పిండుకున్నాడు జగన్. దీంతో జనం అల్లాడిపోయారు. అధిక రేట్ ఇచ్చి ఇసుక కొనలేక, రాష్ట్రంలో నిర్మాణాలు ఆగిపోయిన పరిస్థితులు వచ్చాయి. జగన్ పాలనలో ఇసుక దోపిడీపై టిడిపి ,జనసేన …విస్తృత ప్రచారం చేశాయి. అధికారంలోకొస్తే ఉచిత ఇసుక ఇస్తామని టిడిపి ప్రకటించింది. కూటమినేతల గెలుపుకి ఇది కూడా ఒక కారణం . కూటమి అధికారంలోకి వచ్చాక ఉచిత ఇసుక అన్నారు…. కానీ…. జగన్ హయాం కంటే ఇప్పుడే ఇసుక ఎక్కువ రేటు పలుకుతుంది. దీని కారణం రాష్ట్రంలో దాదాపు ఎమ్మెల్యేలు అందరూ ఇసక దోపిడీ మొదలెట్టడమే. పేరుకు ఉచిత ఇసుక పంపిణీ…. అయినప్పటికీ ప్రతి ఎమ్మెల్యే తను నియోజకవర్గంలోని ఇసుక రీచ్ లు అన్నిటిని కంట్రోల్లో పెట్టుకుంటున్నారు. ఇసుక ఉచితమే కానీ ట్రాన్స్పోర్ట్ కి మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఇసుకను తవ్విపోసేది ఎవరు? రీచ్ నుంచి ఎత్తి లారీల్లోకి లోడ్ చేసేది ఎవరు? నిర్మాణాల వరకు డెలివరీ చేసేది ఎవరు? ఇవన్నీ ఇప్పుడు ఎమ్మెల్యేలు భుజాలకి ఎత్తుకున్నారు.
అంతా తామే నడిపిస్తున్నారు. కొన్నిచోట్ల వాళ్ళ అనుచరులు నడుపుతున్నారు. ఏపీలో అన్ని జిల్లాల్లో ఎమ్మెల్యేలు వాళ్ళ అనుచరులే రీచ్ ల వారీగా పాడుకుంటున్నారు. చాలామంది ఎమ్మెల్యేలు నేరుగానే ఈ రీచ్ లను కైవసం చేసుకుంటున్నారు. తమ అనుమతి లేకుండా ఎవరైనా రీచ్ లో కాంట్రాక్టులు దక్కించుకుంటే అక్కడ ఇసుక తవ్వుకోడానికి… కాలు కూడా పెట్టనివ్వరు. గోదావరి జిల్లాల్లో, కృష్ణ గుంటూరు , ఉత్తరాంధ్ర జిల్లాల్లో అన్నిచోట్ల ఇదే తంతు. ప్రభుత్వం నిర్ణయించిన వంద రూపాయలు ధరకు టెండర్ పాడుకునే వాళ్లని కూడా రీచ్ లో అడుగుపెట్టనివ్వరు. ఎమ్మెల్యేల మనుషులే రీచ్ లో వ్యవహారం నడిపిస్తున్నారు. ప్రతి లారీకి మూడు నుంచి నాలుగు వేలు అక్రమంగా వసూలు చేస్తున్నారు. బిల్లులు మేమే ఇస్తాం, ఇసుక మేమే పోస్తాం అంటున్నారు. టెన్ టైర్ లారీ కి 6000,12 టైర్ లారీ కి 8000 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారు. ఒక్కొక్క డంపింగ్ లో రోజుకి సుమారు 120 లారీల వరకు అధిక బిల్లులతో ఇసుక వెళ్తుంటే, ఒక 50 లారీలు జీరో బిల్లులతో వెళ్తున్నాయి. అంతేకాదు ఇసక రీచ్ టెండర్ పాడుకునేది ఒకచోట అయితే, తవ్వేది నాలుగైదు చోట్ల. పేరుకు మాత్రమే ఉచిత ఇసుక. కానీ ఒక్కొక్క లారీకి ఎమ్మెల్యే కి వచ్చేది కనీసం మూడు నుంచి 5 వేలు. రాష్ట్రంలో ఇసుక రీచ్ ల మీద ఒక్కొక్క ఎమ్మెల్యే నెల ఆదాయం 50 లక్షలకు పై మాటే. ఈ వ్యవహారం మొత్తం ముఖ్యమంత్రి చంద్రబాబు కి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి పూర్తి సమాచారం ఉంది. కానీ ఏపీలో ఎమ్మెల్యేలను అదుపులో పెట్టే పరిస్థితి ఇప్పుడు లేదు లేదు. అదేమంటే ఐదేళ్లు మేం పార్టీని కాపాడాం, జగన్ అరాచకాలుకి ఎదురొడ్డి పోరాటం చేసాం, ఆస్తులు పోగొట్టుకున్నాం, 40….. 50 కోట్లు ఎన్నికల్లో ఖర్చు పెట్టాం, ఇప్పుడు ఏం చేసుకోకుండా ఎలా ఉంటాం? అని ఎదురు ప్రశ్నిస్తున్నారు ఎమ్మెల్యేలు. మా డబ్బైనా మాకు రావాలి కదా అంటున్నారు. చిత్రమైన విషయం ఏంటంటే… పవన్ కళ్యాణ్ మానియాతో గెలిచిన కొందరు జనసేన ఎమ్మెల్యేలు కూడా టన్నులు టన్నుల ఇసుక కుమ్మేస్తున్నారు.
ఇసుక తర్వాత ఏపీ ఎమ్మెల్యేలకు అత్యధికంగా వస్తుంది లిక్కర్ షాపు ద్వారానే. రాష్ట్రంలో లిక్కర్ షాపులన్నీ కూటమి ఎమ్మెల్యేలు కైవసం చేసుకున్నారు. మరికొందరు ఎమ్మెల్యేలు వాళ్ళ అనుచరులకి లిక్కర్ షాప్ టెండర్ల దక్కేలా చేసుకున్నారు . ఇంకొందరు ఎమ్మెల్యేలు బినామీ పేరుతో లిక్కర్ షాపులు దక్కించుకున్నారు. రాష్ట్రం మొత్తం మీద ఎమ్మెల్యేలు, మంత్రులకు సంబంధం లేకుండా ఒక్క లిక్కర్ షాపు లైసెన్స్ ఇవ్వలేదు. ఒకప్పుడు సీఎం జగన్… ఆయన కోటరీ మాత్రమే లిక్కర్ ఆదాయాన్ని అనుభవించేవారు. ఏ మాట కా మాట చెప్పుకోవాలి ఇప్పుడు మాత్రం ఎమ్మెల్యేలు ,మంత్రులు, వారి అనుచరులు, టిడిపి ,జనసేన నాయకులు లిక్కర్ దందాపై నెల నెల వందల కోట్లు సంపాదిస్తున్నారు. స్వయంగా లిక్కర్ షాపులు పెట్టని ఎమ్మెల్యేలు, లైసెన్స్ దక్కిన వాళ్ల నుంచి సేల్స్ లో 25% కమిషన్ నేరుగా గుంజుకుంటున్నారు. ఇదే విషయంలో అధికార పార్టీ ఎమ్మెల్యేల మధ్య కూడా గొడవలు మొదలయ్యాయి. మా వాడి నుంచి
25% ఎలా అడుగుతావు? అంటూ ఎమ్మెల్యేలు సిగపట్లు పడుతున్నారు. ఇక అన్ని జిల్లాల్లోనూ ఎమ్మెల్యేలు వాళ్ళ అనుచరులు సహకారం తో బెల్ట్ షాపులు యదేచ్చగా నడుస్తున్నాయి. లిక్కర్ షాపులపై ఒక్కొక్క ఎమ్మెల్యే కి నెలకి పాతిక నుంచి 40 లక్షల ఆదాయం వస్తుంది. ఇదంతా సీఎం కార్యాలయానికి తెలీదా అంటే… ఇంతకన్నా అమాయకమైన ప్రశ్న మరొక ఉండదు.
ఇక కొన్ని దశాబ్దాలుగా నడుస్తున్న రేషన్ బియ్యం దందా ఏపీలో కూటమి సర్కార్ హయాంలోనూ యదేచ్చగా కొనసాగుతోంది. అది ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుణ్యమా అని సీజ్ ది షిప్ వివాదంతో ఇది మరోసారీ జనంలోకి వచ్చింది. భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రేషన్ బియ్యం దందా జోరుగా సాగుతోంది. ఇది పూర్తిగా ఎమ్మెల్యేల కనుసనల్లో జరుగుతుంది. నియోజక వర్గాల్లో రేషన్ డిపోల సంఖ్యను బట్టి ప్రతి ఎమ్మెల్యేకి రేషన్ బియ్యం దందా ద్వారా నెలకి 30 నుంచి 50 లక్షల రూపాయలు నికర ఆదాయం వస్తోంది. బహిరంగ మార్కెట్లో సన్న బియ్యం కిలో 60 రూపాయలు ఉంది. కానీ కేంద్రం మనిషికి ఐదు కిలోలు, కుటుంబానికి 30 కిలోలు చొప్పున ఉచిత బియ్యం ఇస్తుంది. అయితే ఈ దుడ్డు బియ్యాన్ని జనం తినటం లేదు. రేషన్ డీలర్లు కిలో పది రూపాయలు చొప్పున 30 కిలోలకు 3 వందల రూపాయలు డబ్బులు ఇచ్చి, బియ్యం తీసుకున్నట్లు వేలిముద్రలు వేయించుకుంటారు. ఆ బియ్యాన్ని రేషన్ డీలర్ల నుంచి ఒక సిండికేట్ సేకరిస్తుంది.
కిలో బియ్యానికి రేషన్ డీలర్ కు మూడు నుంచి నాలుగు రూపాయలు వరకు కమిషన్ ఇస్తారు. ప్రతి నియోజకవర్గంలో ఈ సిండికేట్ రేషన్ డీలర్ నుంచి బియ్యాన్ని క్వింటాళ్ల లో సేకరించి ఒక దగ్గర చేరుస్తారు. ప్రతి ఎమ్మెల్యే కి తన నియోజకవర్గంలో సహకరించిన మొత్తం పిడిఎస్ బియ్యానికి కిలోకి పది రూపాయలు చొప్పున అందుతుంది. ఇలా సేకరించిన బియ్యాన్ని పాలిష్ చేసి, చెడిపోకుండా కెమికల్ ట్రీట్మెంట్ చేసి షిప్పుల్లో ఈస్ట్ ఆఫ్రికా తో పాటు మరికొన్ని దేశాలకు తరలిస్తున్నారు. ఈ సిండికేట్ మొత్తానికి అధిపతి జెట్టి అగర్వాల్. ఇతని కనుసన్న ల్లోనే ఈ వేలకోట్ల రూపాయల దందా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో లోకల్ సిండికేట్ లో పయ్యావుల కేశవ్ వియ్యంకుడు, వైసిపి మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి, అతని సోదరుడు ఇలా చాలామంది రైస్ ఎక్స్పోర్టర్స్ ఉన్నారు. వీళ్లందరి దగ్గర జెట్టిఅగర్వాల్ బియ్యం కొని 44 రూపాయలకి ఈస్ట్ ఆఫ్రికా కి బియ్యం ఎగుమతి చేస్తాడు. ఎక్స్పోర్ట్ కానీ బియ్యం తెలుగు రాష్ట్రాల్లో హోటల్స్ కి అమ్ముకుంటారు. కేంద్రం ఉచితంగా ఇచ్చే కిలో బియ్యంలో పది రూపాయలు పబ్లిక్ కి, మూడు రూపాయలు రేషన్ డీలర్ కి, పది రూపాయలు ఎమ్మెల్యే కి, ఏడు రూపాయలు సిండికేట్ కి, పది రూపాయలు విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసే సంస్థకు, నాలుగు రూపాయలు ప్రాసెసింగ్ కి చేరుతున్నాయి. దొంగలు దొంగలు కలిసి ఊళ్లు పంచుకుంటున్నట్టు ఉచిత రేషన్ బియ్యాన్ని ఇంత కలిసి దోచుకుంటున్నారు.
పిడిఎస్ బియ్యం అక్రమ రవాణాని అరికట్టడం ఎవడి వల్ల కాదు. దానికి ప్రధాన కారణం ఏపీలో 175 మంది ఎమ్మెల్యే లో కనీసం 150 మంది ఎమ్మెల్యేలు దీని వెనుక ఉన్నారు. అది ఈ ప్రభుత్వంలోనే కాదు అన్ని ప్రభుత్వాల్లోనూ ఎమ్మెల్యేలు, వాళ్ల అనుచరులు ఉచిత బియ్యం ద్వారా జనం సొమ్ముని కొల్లగొట్టారు. పవన్ కళ్యాణ్ కి కూడా ఇప్పటికే ఆ విషయం స్పష్టమైనది. అందుకే బియ్యం గురించి ఇప్పుడు ఆయన మాట్లాడడం లేదు.
ఏపీలో ఎమ్మెల్యేలు అందరూ మిగతా వ్యాపారాలు, బదిలీలు, దందాలు, పంచాయతీలు లో డబ్బు ఎంత సంపాదించుకున్నప్పటికీ…. ఇసుక, లిక్కర్, రేషన్ బియ్యం లో మాత్రం నికరంగా నెలకి ఒక్కొక్క ఎమ్మెల్యే కోటి రూపాయలు సంపాదించుకోవడం ఖాయం. అందుకే వాళ్ళు ఎవ్వరిని లెక్క చేయడం లేదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎన్ని హెచ్చరికలు చేసినా ఎమ్మెల్యేలు డోంట్ కేర్ అంటున్నారు .