Sharmila Vs Jagan : తండ్రిని ఆయుధంగా చేసుకున్న షర్మిల.. జగన్‌ను మరింత ఇబ్బంది పెడుతోందిగా..

అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాభవం మూటగట్టుకుంది. కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమై.. ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 12, 2024 | 06:15 PMLast Updated on: Jul 12, 2024 | 6:15 PM

Sharmila Who Made Her Father A Weapon Is Giving More Trouble To Jagan

అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాభవం మూటగట్టుకుంది. కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమై.. ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది. జగన్‌ పరిస్థితి చూసి.. ఇప్పుడు ఇంటా బయట సెటైర్లు వినిపిస్తున్నాయ్. అంతన్నావ్.. ఇంతన్నావ్‌.. ఇలా బొక్కబోర్లా పడ్డావ్ అంటూ.. జగన్ టార్గెట్‌గా ట్రోలింగ్ మొదలుపెట్టారు. ఇక దెబ్బ మీద దెబ్బ అన్నట్లుగా.. జగన్‌కు వరుస షాక్‌లు తగులుతూనే ఉన్నాయ్. ఓవైపు పార్టీ నేతల మీద కేసులు.. మరోవైపు జంపింగ్‌కు సిద్ధమైన నాయకులు.. అసలే ఇబ్బందుల్లో ఉన్నాడు జగన్ అంటే.. షర్మిల ఆయనను మరింత ఇబ్బంది పెడుతున్నారు.

దీనికోసం తండ్రిని ఆయుధంగా మార్చుకుంటోంది. అసలు నువ్ వైఎస్ కొడుకువేనా అనే ప్రశ్నను తెరమీదకు తీసుకువస్తూ.. వైసీపీని జగన్ మీద వస్తున్న అంతో ఇంతో సింపథీని కూడా రాకుండా చేస్తున్నారు షర్మిల అనిపిస్తోంది పరిస్థితి చూస్తుంటే ! ఈ మధ్యే వైఎస్‌ 75వ జయంతి జరిగింది. జగన్ తన తల్లితో కలిసి ఇడుపులపాయకు వెళ్లి… తన తండ్రికి ఘనంగా నివాళులు అర్పించి వచ్చారు. అంతకుమించి వైసీపీ తరఫున ఎలాంటి కార్యక్రమం నిర్వహించలేదు. దీన్నే షర్మిల ఆయుధంగా మార్చుకున్నారు. సిద్ధం అంటూ ఎన్నికల సమయంలో కోట్లకు కోట్లు పెట్టి సభలు నిర్వహించావ్‌గా.. తండ్రి 75వ జయంతి గుర్తులేదా.. అసలు ఏం చేశావ్ జగన్ అంటూ ప్రశ్నలు గుప్పిస్తున్నారు షర్మిల. ఇడుపులపాయకు వెళ్లి అరగంట కూడా లేవు.. కనీసం కూర్చోను కూడా కూర్చోకుండా ఐదు నిమిషాలు నిల్చుని వచ్చేశావ్‌.. నువ్ అసలు వైఎస్ వారసుడినని ఎలా చెప్పుకుంటావ్ అంటూ షర్మిల ప్రశ్నిస్తున్నారు. వైసీపీ అంటేనే.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేస్తున్న షర్మిల..

ఇప్పుడు వైఎస్ అనే బ్రాండ్‌ను జగన్‌కు దూరం చేయాలని అనుకుంటున్నారా.. దానికోసం తండ్రి పేరును ఆయుధంగా వాడుకుంటున్నారా అనే చర్చ జరుగుతోంది. ఇక్కడితో ఆగారా అంటే.. చంద్రబాబు నిర్ణయాలతో జగన్‌ పాలనను కంపేర్ చేస్తూ.. అన్నను మరింత వీక్ చేసే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపించారు. తల్లికి వందనం విషయంలో వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలపై కూడా కౌంటర్ ఇచ్చారు. 2019 హామీలు గుర్తులేవా అంటూ మరో ప్రశ్న సంధించారు. బైబై బాబు అంటూ ఒకసారి.. జైల్లో ఉన్నప్పుడు ఇంకోసారి.. ఇలా తనతో జగన్‌ అబద్ధాలు చెప్పించారు అంటూ.. వైసీపీని మరింత టార్గెట్ చేస్తున్నారు షర్మిల. ఆమె వ్యాఖ్యలపై.. ఫ్యాన్‌ పార్టీ నుంచి కూడా స్ట్రాంగ్ కౌంటర్లు వినిపిస్తున్నా.. షర్మిల కామెంట్లు వైసీపీకి.. ముఖ్యంగా జగన్‌కు మరింత ఇబ్బందిగా మారడం ఖాయంగా కనిపిస్తోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.