SHOCK TO NANI: కేశినేని నానికి షాకిచ్చిన టీడీపీ !
ఏపీలోని విజయవాడ సిట్టింగ్ ఎంపీ కేశినేని నానికి టీడీపీ హైకమాండ్ గట్టి షాక్ ఇచ్చింది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఆయనకు సీటు ఇచ్చేది లేదని క్లారిటీ ఇచ్చింది. ఈనెల 7న తిరువూరులో జరిగే చంద్రబాబు సభ బాధ్యతలను కూడా కేశినేని చిన్నికి అప్పగించింది. ఇకపై పార్టీ వ్యవహారాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోవద్దని కూడా బాబు వార్నింగ్ ఇచ్చారు. రెండు రోజుల క్రితం తిరువూరు టీడీపీ మీటింగ్ లో ఎంపీ కేశినేని నాని వర్గీయులు... నానా రచ్చ చేయడమే ఇందుక్కారణం.
క్రమశిక్షణ తప్పితే ఊరుకోబోమని పార్టీ నేతలకు టీడీపీ అధినేత చంద్రబాబు వార్నింగ్ ఇస్తున్నారు. అందుకే విజయవాడ సిట్టింగ్ ఎంపీ కేశినేని నానికి ఎంపీ టిక్కెట్ ఇచ్చేది లేదని తెగేసి చెప్పారు. పైగా నియోజకవర్గ ఇంఛార్జ్ బాధ్యతల నుంచి కూడా తప్పించడం సంచలనంగా మారింది. గత కొంత కాలంగా అన్నదమ్ములు కేశినేని నాని-చిన్న మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. రెండు రోజుల క్రితం ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో కేశినేని నాని వర్గీయులు బలప్రదర్శనకు దిగారు. టీడీపీ విసృతస్ధాయి సమావేశంలో గందరగోళం తలెత్తింది. ఈ మీటింగ్ కు ఆహ్వానం పలుకుతూ కేశినేని చిన్ని ఫోటోలతో ప్లేక్సీలు పెట్టారు. వాటిని చూడగానే నాని వర్గీయులు రెచ్చిపోయారు. ఫ్లెక్సీలు చించేసి… కుర్చీలు విసిరేశారు. దాంతో నాని, చిన్ని వర్గాల మధ్య తీవ్ర వాగ్వివాదం, కొట్లాటకు దారి తీసింది. కేశినేని చిన్నిని సమావేశం లోపలకి రానీయకుండా అడ్డుకుంది నాని వర్గం. గో బ్యాక్ చిన్ని అంటూ నినాదాలు చేశారు నాని వర్గీయులు. తిరువూరులో ఈ గొడవకు కారణం కేశినేని నాని అని గుర్తించింది టీడీపీ హైకమాండ్. అందుకే ఆయన్ని పక్కనబెట్టింది.
2024 ఎన్నికల్లో కేశినేని నానికి బదులు ఆయన తమ్ముడు చిన్నికి టీడీపీ ఎంపీ టిక్కెట్ ఇవ్వబోతోంది. లోకేష్ కూడా చిన్ని వైపే ఇంట్రెస్ట్ చూపించారు. 2019అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచి నాని…. టీడీపీ హైకమాండ్‌పై తరచూ విమర్శలు చేస్తున్నారు. లోకేష్‌కి పార్టీలో అధిక ప్రాధాన్యత ఇవ్వడాన్ని తప్పుబట్టారు. దీంతో పార్టీ హైకమాండ్ ఆయన్ని దూరం పెడుతూ వచ్చింది. కేశినేని నాని ఈమధ్యే ఓ ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయట్లేదనీ..… తన కుటుంబం నుంచి కూడా ఎవరూ నిలబడరని అన్నారు. బీసీలకు విజయవాడ ఎంపీ టిక్కెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాను లేకపోతే విజయవాడను దోచుకోవాలని చూస్తున్నారంటూ… సొత పార్టీ నేతలపైనే విమర్శలు చేశారు నాని. ఒకానొక దశలో టీడీపీ టిక్కెట్ ఇవ్వకపోతే… ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేసి గెలుస్తా అని కూడా అంటున్నారు.
అందుకే వివాదస్పదంగా మారిన కేశినేని నానికి ప్రాధాన్యత తగ్గించారు టీడీపీ చీప్ చంద్రబాబు. తిరువూరులో ఈనెల 7న జరిగే మీటింగ్ లో చంద్రబాబు పాల్గొంటున్నారు. దీని నిర్వహణ బాధ్యతలు కూడా కేశినేని చిన్నికి అప్పగించారు. ఇదే విషయం ట్విట్టర్ ద్వారా అందరికీ తెలిపారు నాని. అధినేత ఆదేశాలను పాటిస్తానని అంటున్నారు. తనకు ఎలాగూ టీడీపీ టిక్కెట్ రాదు కాబట్టి… మరి నాని విజయవాడ ఎంపీ స్థానానికి ఇండిపెండెంట్ గా పోటీచేస్తారా…. లేదంటే వైసీపీలోకి జంప్ అవుతారా అన్నది చూడాలి.