NEGGEDEVARU SARVEPALLY : సర్వేపల్లిలో సోమిరెడ్డికి చావో …రేవో… మంత్రి కాకాణి హ్యాట్రిక్ కొడతారా ?
నెల్లూరు జిల్లా (Nellore District) సర్వేపల్లి (Sarvepalli) నియోజకవర్గంలో మాజీ మంత్రి వరుసగా ఏడు సార్లు పోటీ చేశారు. నాలుగు సార్లు ఓడిపోయారు. అయినప్పటికీ... టీడీపీ మళ్లీ మళ్లీ టికెట్ ఆయనకే ఇచ్చింది.
నెల్లూరు జిల్లా (Nellore District) సర్వేపల్లి (Sarvepalli) నియోజకవర్గంలో మాజీ మంత్రి వరుసగా ఏడు సార్లు పోటీ చేశారు. నాలుగు సార్లు ఓడిపోయారు. అయినప్పటికీ… టీడీపీ మళ్లీ మళ్లీ టికెట్ ఆయనకే ఇచ్చింది. మరోవైపు రెండు ఎన్నికల్లో గెలిచిన మంత్రికే…మూడోసారి టికెట్ ఇచ్చింది వైసీపీ. చివరి ఎన్నికలంటున్న మాజీ మంత్రిని ప్రజలు గెలిపిస్తారా? లేదంటే మంత్రికి హ్యాట్రిక్ విజయాలు అందిస్తారా ? సర్వేపల్లిలో నెగ్గేదెవరు?
నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం…20 ఏళ్లుగా ఇక్కడ తెలుగుదేశం పార్టీకి పరాజయాలే పలుకరిస్తున్నాయి. ఒకే అభ్యర్థి వరుసగా నాలుగు సార్లు ఓడినా…ఐదోసారి కూడా ఆయనకే టికెట్ ఇచ్చింది. దీంతో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి…ఈ ఎన్నికలు చావోరేవోలా అన్నట్లు తయారైంది. మరోవైపు వరుసగా రెండు పర్యాయాలు సోమిరెడ్డిపై గెలిచిన మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి…మూడోసారి పోటీ చేస్తున్నారు. దీంతో సర్వేపల్లి నియోజకవర్గం ఫలితం ఆసక్తి రేపుతోంది. ఈ నియోజకవర్గం నుంచి అత్యధిక సార్లు పోటీ చేసిన వ్యక్తిగా సోమిరెడ్డి రికార్డు సృష్టించారు. 1994 నుంచి ఇప్పటి వరకూ ఆయన వరుసగా ఏడు సార్లు పోటీ చేశారు. 1994, 1999 ఎన్నికల్లో మాత్రమే సోమిరెడ్డి గెలిచారు. 2004, 2009లో ఆదాల ప్రభాకర్ రెడ్డి చేతిలో, 2014, 2019 ఎన్నికల్లో కాకాణి గోవర్దన్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. వరుసగా నాలుగు ఎన్నికల్లో ఓడినప్పటికీ… తెలుగుదేశం పార్టీ ఐదోసారి కూడా సోమిరెడ్డికే టికెట్ ఇచ్చింది. సర్వేపల్లి నియోజకవర్గంలో ముత్తుకూరు, మనుబోలు, తోటపల్లి గూడూరు, వెంకటాచలం, పొదలకూరు మండలాలు ఉన్నాయి. కృష్ణపట్నం పోర్టు, ఫిషింగ్ జెట్టి, ధర్మల్ విద్యుత్ కేంద్రాలతో పాటు పరిశ్రమలు ఈ నియోజకవర్గ పరిధిలోనే ఉన్నాయి. ఇక్కడ 2 లక్షల 32 వేల మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఎన్నికల్లో 83.88 శాతం పోలింగ్ నమోదైంది. లక్షా 94 వేల 618 మంది ఓటు వేశారు.
వైసీపీ నుంచి మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, టిడిపి తరఫున మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి…వరుసగా మూడోసారి తలపడ్డారు. 2014, 2019 ఎన్నికల్లో సోమిరెడ్డిపై ఆయన విజయం సాధించారు. జగన్ కేబినెట్‌లో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ సాధించాలన్న లక్ష్యంతో క్యాంపెయిన్ చేశారు. వారంలో ఐదు రోజులపాటు నియోజకవర్గంలోనే పర్యటిస్తూ ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులతో ప్రత్యేకంగా మండలాల వారీగా సదస్సులు నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేయించారు. పొదలకూరు, మనుబోలు, వెంకటాచలం మండలాల్లో…కాకాణికి మెజార్టీ వస్తుందని వైసీపీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. ముత్తుకూరు, తోటపల్లి గూడూరులో…మెజార్టీ తగ్గినా..ఎలాంటి ఇబ్బంది ఉండబోదంటున్నారు.
టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉంది. మాజీ మంత్రి నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మేనల్లుడైన సోమిరెడ్డి…మామ దగ్గర రాజకీయ ఓనమాలు నేర్చుకున్నారు. ఆయన వెన్నంటే ఉంటూ పని తీరును గమనించారు. సోమిరెడ్డిని నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి ప్రోత్సహించారు. దీంతో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్‌గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు సోమిరెడ్డి. సారా వ్యతిరేక ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. జిల్లా వ్యాప్తంగా అనుచర గణాన్ని ఏర్పాటు చేసుకున్న సోమిరెడ్డి.. టిడిపిలో కీలక నేతగా ఎదిగారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. నియోజకవర్గ ప్రజలతో అనుబంధం అధికంగా ఉన్న సోమిరెడ్డి…సర్వేపల్లి నుంచి వరుసగా ఏడోసారి పోటీ చేశారు. రెండు సార్లు గెలిచి…నాలుగు సార్లు పరాజయం పాలయ్యారు.
మొదటి రెండు జాబితాల్లో తన పేరు లేకపోవడంతో సోమిరెడ్డి ఆశలు వదులుకున్నారు. సోమిరెడ్డి స్థానంలో ఆయన కోడలు శృతిని బరిలోకి దించాలని టిడిపి అధిష్టానం భావించింది. చివరి నిమిషంలో సోమిరెడ్డికి టిక్కెట్ ఇచ్చింది. ఆయన తరపున కూతురు, కొడుకు, కోడలు ప్రచారం నిర్వహించారు. వైసీపీ ఖాళీ అవుతుందని, మంత్రి కాకాణి చేస్తున్న దోపిడీలు, అక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళారు. వైసిపి పాలనపై జనంలో తీవ్ర వ్యతిరేకత ఉందనీ…దాన్ని ఎన్నికల్లో చూపించారని టీడీపీ నేతలు భావిస్తున్నారు. తనకు ఇవే చివరి ఎన్నికలని చెబుతూ ప్రజల నుంచి సానుభూతిని పొందేందుకు ప్రయత్నించారు సోమిరెడ్డి. అటు కాకాణి గోవర్దన్‌రెడ్డి, ఇటు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి…విస్తృతంగా ప్రచారం చేశారు. గ్రామాలను యూనిట్‌గా తీసుకుని…పార్టీ బలాబలాలను బేరీజు వేసుకుంటున్నారు. సోమిరెడ్డికి వరుసగా ఐదోసారి ఓటమి తప్పదని వైసీపీ నేతలు అంటుంటే…ఈసారి గెలుపు తమదేనంటూ బల్లగుద్ది చెబుతున్నారు. మరి ఓటరు ఎవరి వైపు నిలిచారనే విషయం కౌంటింగ్ తర్వాతే వెల్లడి కానుంది.