విడదల రజని 2.5 కోట్లు కొట్టేసింది… స్టోన్ క్రషర్స్ యజమాని కన్నీళ్లు
అధికారం అడ్డుపెట్టుకొని.. వైసీపీ నేతలు చేసిన దందాలు, బాగోతాలు బయటకు వస్తున్నాయ్. బాధితులు ఒక్కొక్కరుగా కొత్త ప్రభుత్వానికి తమ గోడు వినిపించుకుంటున్నారు.
అధికారం అడ్డుపెట్టుకొని.. వైసీపీ నేతలు చేసిన దందాలు, బాగోతాలు బయటకు వస్తున్నాయ్. బాధితులు ఒక్కొక్కరుగా కొత్త ప్రభుత్వానికి తమ గోడు వినిపించుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించిన నేతల్లో చాలామందిపై ఇప్పటికే ఆరోపణలు వచ్చాయ్. ఇక మాజీ మంత్రి విడదల రజనిపై.. లేటెస్ట్‌గా మరికొన్ని ఫిర్యాదులు హోం మంత్రికి అందాయి. మంత్రిగా ఉన్న సమయంలో విడదల రజని.. తమను వేధించి అక్రమంగా వసూళ్లు చేశారంటూ
పల్నాడు జిల్లా యడ్లపాడుకు చెందిన బాలాజీ స్టోన్ క్రషర్ భాగస్వామి నల్లపనేని చలపతిరావు ఫిర్యాదు చేశారు. తమ ప్రాణాలకు హాని ఉందని, రక్షణ కల్పించాలని వేడుకున్నారు. ఫిర్యాదును తీసుకున్న హోంమంత్రి అనిత… ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లుగా తెలుస్తోంది. మాజీ మంత్రి విడుదల రజినీ, అప్పటి విజిలెన్స్ ఎస్పీ జాషువా, రజినీ పీఏ గోపి కలిసి.. రెండున్నర కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ఫిర్యాదులో తెలిపారు. ఈ విషయం బయటకు వచ్చినా.. ఫిర్యాదు చేసినా వ్యాపారం చేయలేరని… ప్రాణాలతో ఉండరని బెదిరించడంతో ఎవరికీ చెప్పకుండా ఇప్పటివరకు సైలెంట్‌గా ఉన్నట్లు ఫిర్యాదులో ఆవేదన వ్యక్తం చేశారు బాదితులు. విడదల రజనితో పాటు ఆమె మరిది గోపి, పీఏ రామకృష్ణ, నాటి విజిలెన్స్ ఎస్పీ జాషువా నుంచి ప్రాణహాని ఉందని.. రక్షణ కల్పించాలని వేడుకున్నారు. బెదిరించి, భయపెట్టి వసూలు చేసిన సొమ్ములు వెనక్కి ఇప్పించాలని నల్లపనేని చలపతిరావు విజ్ఞప్తి చేశారు. చలపతిరావు, మరో ముగ్గురు భాగస్వాములతో కలసి 2010 నుంచి యడ్లపాడు గ్రామంలో స్టోన్ క్రషర్ వ్యాపార సంస్థను నడుపుతున్నారు. 2020 సెప్టెంబరు 9న నాటి రజని పీఏ రామకృష్ణ క్రషర్ దగ్గరకు వచ్చి.. ఎమ్మెల్యేని కలవమని చెప్తే కలిశామని.. వ్యాపారం చేసుకోవాలంటే డబ్బులు చెల్లించాలని ఆమె చెప్పినట్లు ఫిర్యాదులో రాసుకొచ్చారు. ముందు 5 కోట్లు చెల్లించాలని ఒత్తిడి చేసశారని.. ఐతే చివరికి రెండున్నర కోట్లు ఇచ్చుకోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. రజనికి 2 కోట్లు, ఎస్పీ జాషువాకు 10 లక్షలు… రజనీ మరిది గోపీకి 10 లక్షలు చెల్లించాలని అన్నారు. 2021, ఏప్రిల్ 4న చిలకలూరిపేట టౌను, పురుషోత్తపట్నంలోని గోపి నివాసంలో ఆ మొత్తాన్ని ఆయనకు అందజేసినట్లు చలపతిరావు తన ఫిర్యాదులో వివరించారు.
ఈ కంప్లైంట్‌ను సీరియస్‌గా తీసుకున్న హోంమంత్రి అనిత.. విచారణకు ఆదేశించారు. గతంలోనూ రజనీపైన ఫిర్యాదులు ఉన్నాయ్. చిలకలూరిపేట నియోజకవర్గం పసుమర్రు గ్రామంలో ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ప్రకారం ఎకరా రూ12 లక్షలు పలకగా జగనన్న ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వానికి ఇస్తే ఎకరాకు 31 లక్షలు ఇప్పిస్తానంటూ రజిని రైతులకు ఎరవేశారని ఆరోపణలు ఉన్నాయి. మొదటి రెండు విడతల్లో 50 ఎకరాలు సేకరించగా ఎకరాకు రెండున్నర లక్షల చొప్పున కోటీ 16 లక్షలు రైతుల నుంచి వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపించాయి. మూడు, నాలుగు విడతల్లో 100 ఎకరాల వరకు సేకరించగా ఎకరాకు ఏడున్నర లక్షలు చొప్పున ఏడున్నర కోట్లు ఇవ్వాలంటూ రైతుల నుంచి ముందుగానే చెక్కులు, నోట్లు తీసుకున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి.