TDP first list is ready : టీడీపీ ఫస్ట్ లిస్ట్ రెడీ ! ఆ పాతికమందికి గ్యారంటీ !

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మొదటి జాబితాను తెలుగుదేశం రెడీ చేసింది. ఇరవై లేదా పాతిక మంది అభ్యర్థుల పేర్లతో సంక్రాంతి కల్లా లిస్ట్ రిలీజ్ చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నియోజకవర్గాల్లో ఎలాంటి వివాదం లేనివి.. జనసేన లిస్ట్ లో లేని సీట్లను ఎంపిక చేసి అక్కడి టీడీపీ అభ్యర్థులను ప్రకటిస్తారని తెలుస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 11, 2024 | 11:02 AMLast Updated on: Jan 11, 2024 | 11:02 AM

Tdp First List Is Ready Guarantee For Those Old People

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మొదటి జాబితాను తెలుగుదేశం రెడీ చేసింది. ఇరవై లేదా పాతిక మంది అభ్యర్థుల పేర్లతో సంక్రాంతి కల్లా లిస్ట్ రిలీజ్ చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నియోజకవర్గాల్లో ఎలాంటి వివాదం లేనివి.. జనసేన లిస్ట్ లో లేని సీట్లను ఎంపిక చేసి అక్కడి టీడీపీ అభ్యర్థులను ప్రకటిస్తారని తెలుస్తోంది. కుప్పం నుంచి చంద్రబాబు, టెక్కలి నుంచి అచ్చెనాయుడు, మంగళగిరి నుంచి లోకేష్ పేర్లు ఎలాగూ మొదటి జాబితాలోనే కనిపిస్తాయి. ఏపీలోని మూడు ప్రాంతాల్లో అన్ని సామాజిక వర్గాలను లెక్కలోకి తీసుకొని అభ్యర్థుల లిస్ట్ అనౌన్స్ చేయాలని పార్టీ చీఫ్ చంద్రబాబు ఆలోచిస్తున్నారు.

చంద్రబాబు నాయుడు ముందే చెప్పినట్టు టీడీపీ అభ్యర్థులను ప్రకటించడానికి ముందు పెద్ద కసరత్తే జరుగుతోంది. ముందుగా టీడీపీ అంతర్గత విచారణ పూర్తయ్యాక.. ఇప్పుడు నియోజకవర్గాల్లో IVRS విధానంలో ఫోన్ ద్వారా అభ్యర్థులపై సర్వేలు నిర్వహిస్తున్నారు. పార్టీ సభ్యులతో ఒక సర్వే చేస్తుండగా.. సాధారణ ప్రజలతో మరో సర్వే జరుగుతోంది. ఇది కాకుండా ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల వ్యక్తిత్వం.. గెలుపు ఓటముల గురించి గ్రౌండ్ లెవల్లో కూడా టీడీపీ అధినేత చంద్రబాబు సర్వే చేయిస్తున్నారు. ఇలా సర్వేల్లో మెరుగ్గా తేలిన.. దాదాపు 20 నుంచి పాతిక మంది దాకా లిస్ట్ రెడీ చేశారు. పండగ సెంటిమెంట్ గా.. సంక్రాంతికి ముందు లేదా కనుమ దాటిన తర్వాత గానీ టీడీపీ మొదటి జాబితాను బయటపెట్టే ఛాన్సుంది. రెండో లిస్ట్ ని.. జనసేనతో సీట్ల సర్దుబాటు, ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాకే రిలీజ్ చేస్తారు. అంటే దాదాపు ఫిబ్రవరి నుంచి లిస్టులు విడుదల అవుతాయని భావిస్తున్నారు.

ప్రస్తుతం చంద్రబాబు రా కదలిరా అంటూ ఆంధ్రప్రదేశ్ అంతటా బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. మొత్తం 22 పార్లమెంటు నియోజకవర్గంలోని 22 అసెంబ్లీ స్థానాల్లో ఇవి జరుగుతున్నాయి. ఈ కార్యక్రమం ద్వారా కూడా అభ్యర్థుల విషయంలో చంద్రబాబు అవగాహనకు వస్తున్నట్టు తెలుస్తోంది. టీడీపీ ఇప్పటి దాకా రాష్ట్రంలో 6 సభలు నిర్వహించింది. కనిగిరికి ఉగ్ర నరసింహారెడ్డి, తిరువూరుకు శ్యామలా దేవదత్, అచంటకు పితాని సత్యనారాయణ, ఆళ్లగడ్డకు భూమా అఖిలప్రియ, బొబ్బిలికి బేబీ నాయన, తునికి యనమల దివ్య ప్రస్తుతం ఇన్చార్జిలుగా ఉన్నారు. వీళ్ళందరికీ టిక్కెట్లు ఇస్తామనీ.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని చంద్రబాబు జనానికి సంకేతాలు పంపారు. మిగతా 16 చోట్ల కూడా చంద్రబాబు సభలు జరుగుతాయి. దాదాపుగా ఆ నియోజకవర్గాల్లోనూ ప్రస్తుతం ఇన్చార్జిలుగా ఉన్నవాళ్ళంతా టీడీపీ అభ్యర్థులు అవుతారని చెబుతున్నారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో ఎలాంటి పేచీ లేకుండా.. దాదాపుగా ప్రకటించే పరిస్థితి ఉన్న నియోజకవర్గాల్లోనే చంద్రబాబు రా కదలిరా.. సభలు నిర్వహిస్తున్నట్టు అర్థమవుతోంది. మొదటి జాబితాలో ఈ అభ్యర్థుల పేర్లన్నీ ఉంటాయని పార్టీ వర్గాల నుంచి సమాచారం. ఇప్పటికే నియోజకవర్గాల ఇంఛార్జుల పేరుతో.. అనేక మార్పులు, చేర్పులు చేసి.. అభ్యర్థుల జాబితాలను ప్రకటిస్తోంది వైసీపీ. పండగలోపే మూడో జాబితా కూడా వస్తే.. దాదాపు వైసీసీ లిస్ట్ పూర్తయినట్టే. కానీ చంద్రబాబు మాత్రం లేట్ గా మొదలుపెట్టినా జనసేన పొత్తు, ఎలాంటి వివాదాలు తలెత్తకుండా అన్ని అంశాలూ పరిశీలించి అభ్యర్థుల పేర్లు ప్రకటించాలని భావిస్తున్నారు.