TDP, Achchennaidu : అచ్చెన్నాయుడు తీరుపై టీడీపీలో రచ్చరచ్చ..

ఆయన.. పేరుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు. కానీ.. సొంత జిల్లాలో సైతం పెత్తనం నడవడం లేదట. టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడి (Achchennaidu) వ్యవహారశైలిపై.. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్న చర్చ ఇది. చంద్రబాబు అరెస్ట్‌ సమయంలో కాస్త హడావిడి చేసినట్టు కనిపించినా.. తర్వాత కామ్‌ అయ్యారని, రాష్ట్రం సంగతి తర్వాత.. ముందు జిల్లాలో కూడా ఆయన పట్టు కోల్పోతున్నారా అన్న డౌట్స్‌ వస్తున్నాయట రాజకీయ పరిశీలకులకు!

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 15, 2024 | 05:30 PMLast Updated on: Jan 16, 2024 | 8:07 PM

Tdp Fuss Over Achchennaidus Behavior

ఆయన.. పేరుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు. కానీ.. సొంత జిల్లాలో సైతం పెత్తనం నడవడం లేదట. టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడి (Achchennaidu) వ్యవహారశైలిపై.. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్న చర్చ ఇది. చంద్రబాబు అరెస్ట్‌ సమయంలో కాస్త హడావిడి చేసినట్టు కనిపించినా.. తర్వాత కామ్‌ అయ్యారని, రాష్ట్రం సంగతి తర్వాత.. ముందు జిల్లాలో కూడా ఆయన పట్టు కోల్పోతున్నారా అన్న డౌట్స్‌ వస్తున్నాయట రాజకీయ పరిశీలకులకు! శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో (AP Politics) ఒకప్పుడు కింజరాపు కుటుంబానిది తిరుగులేని ఆధిపత్యం. ఎర్రన్నాయుడు చనిపోయాక.. ఆయన పేరుతో ఎదిగారు సోదరుడు అచ్చెన్నాయుడు, కుమారుడు రామ్మోహన్‌ నాయుడు (Rammohan Naidu).

2014-19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు ఆ పవర్‌తో హవా నడిపిన అచ్చెన్న.. ఇప్పుడు పూర్తిగా పట్టు కోల్పోతున్నారన్నది లోకల్‌ టాక్‌. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడైనా.. కనీసం సొంత జిల్లా వ్యవహారాలను సైతం పట్టించుకోకపోగా.. పాతపట్నం, శ్రీకాకుళం, ఎచ్చెర్ల, ఆమదాలవలసలలో పార్టీ రెబల్స్‌ని అచ్చెన్న ప్రోత్సహిస్తున్నారన్న టాక్‌ ఉంది. దీంతో ఆయా నియోజకవర్గాల ఇంచార్జిల్లో.. కొందరు ఆయన తీరును బాహాటంగానే వ్యతిరేకిస్తున్నారు. మరికొందరు లోలోపల రగిలిపోతున్నారట. క్రమశిక్షణ ఉన్న పార్టీలో ఈ వ్యవహారాలేంటని సిక్కోలు తమ్ముళ్ళలో గుసగుసలు వినిపిస్తున్నాయ్. వ్యక్తిగత ఆధిపత్యం కోసం.. ఆయన పార్టీని పణంగా పెడుతున్నారన్న మాటలు కూడా వినిపిస్తున్నాయట స్థానిక నాయకుల నుంచి.. ఇన్నాళ్ళు ఎలా ఉన్నా.. ఇక నుంచి అచ్చెన్నకు అసలు సినిమా కనిపించడం ఖాయం అంటున్నాయ్ జిల్లా రాజకీయవర్గాలు.

ఎందుకంటే.. ఇన్నాళ్ళు నియోజకవర్గాల్లో తాను ప్రోత్సహించిన అసమ్మతి నేతలు ఇప్పుడు టిక్కెట్ల కోసం ఆయన మీద ఒత్తిడి తెస్తున్నారట. కానీ.. పార్టీ అధినాయకత్వం మాత్రం జిల్లాకు సంబంధించిన అభ్యర్థుల ఎంపికలో ఆయన్ని సంప్రదించడం లేదంటున్నారు. దీంతో ఆయన్ని నమ్ముకుని ఇన్నాళ్ళు చెలరేగిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా ఉందన్నది లోకల్‌ టాక్‌. అన్నిటికీ మించి.. ప్రస్తుతం టీడీపీలో అచ్చెన్న పదవి ఆరో వేలులాంటిదేనన్న అభిప్రాయం బలంగా ఉంది. చంద్రబాబు, లోకేష్‌ని కాదని.. ఈయన ఇష్టప్రకారం టిక్కెట్లు ఇస్తారా అని ప్రశ్నిస్తున్నాయి రాజకీయవర్గాలు. వాళ్ళిద్దరే పార్టీ కోసం పూర్తి సమయం కేటాయిస్తున్నారు. ఇక ఈయనకు సీన్‌ ఎక్కడిదని వెటకారాలు చేస్తున్నారట ఇన్నాళ్ళు ఇబ్బందులు పడ్డ స్థానిక నాయకులు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కరికైనా సిఫారసు చేసి.. టిక్కెట్‌ ఇప్పించగలరా అని ప్రశ్నిస్తున్నారట.

పాతపట్నం, ఎచ్చెర్ల, శ్రీకాకుళంలో గ్రూపులు పెరిగిపోవడానికి చాలావరకు ఆయనే కారణమన్నది పార్టీ పెద్దలకున్న సమాచారం అట. ఆమదాలవలసలో మీ పెత్తనం వద్దని.. నియోజకవర్గాన్ని తానే చక్కదిద్దుకుంటానని కూన రవికుమార్ ఇప్పటికే చెప్పేశారట. అలాగే.. మిగతా నియోజకవర్గాల్లో కూడా అచ్చెన్నకు నామమాత్రపు ఫాలోయింగ్ తప్ప.. ప్రభావం అంతగా ఉండదన్నది లోకల్‌ టాక్‌. ప్రస్తుతం అచ్చెన్న వర్సెస్ కళా వెంకట్రావుగా నడుస్తున్న జిల్లా రాజకీయాలపై అధిష్టానం ఫోకస్‌ పెట్టిందట. అచ్చెన్నాయుడి చర్యల్ని ఎదుర్కోవడానికి కళా కూడా మైండ్‌గేమ్‌కి తెరలేపి పాత పరిచయాలతో జిల్లా వ్యాప్తంగా తన గ్రూప్‌ని బలోపేతం చేసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. మొత్తంగా జిల్లా రాజకీయాలను చూస్తే.. రెబెల్స్‌ వ్యవహారం తిరిగి తిరిగి అచ్చెన్న మెడకే చుట్టుకుంటోందని అంటున్నాయి రాజకీయ వర్గాలు.