TS Demands : తిరుమల, ఓడరేవుల్లో వాటా కావాలి.. ఏపీకి తెలంగాణ కొత్త ఫిట్టింగ్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోయి పదేళ్ళయినా... రెండు రాష్ట్రాల మధ్య ఉన్న పంచాయతీ ఇంకా తీరలేదు. పదేళ్ళుగా పరిష్కారం కాని పంపకాలపై ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి దృష్టిపెట్టారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోయి పదేళ్ళయినా… రెండు రాష్ట్రాల మధ్య ఉన్న పంచాయతీ ఇంకా తీరలేదు. పదేళ్ళుగా పరిష్కారం కాని పంపకాలపై ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి దృష్టిపెట్టారు. ఆస్తుల విభజన, విద్యుత్ బకాయిలు, వాటాలే ఎజెండాగా ఈ మీటింగ్ ఉండబోతోంది. అయితే ఈ సమావేశంలో ఏపీకి కొత్త ఫిట్టింగ్ పెట్టబోతోంది తెలంగాణ ప్రభుత్వం. మళ్ళీ ఈ పంచాయతీ తీరడానికి ఇంకెంత కాలం పడుతుందో చూడాలి.
తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పాత లెక్కలే ఇంకా తేలలేదు. కానీ రేవంత్ రెడ్డి సర్కార్ కొత్త డిమాండ్లను చంద్రబాబు ప్రభుత్వం ముందు ఉంచబోతున్నారు. తెలుగు ప్రజల ఆరాధ్య దైవమైన తిరుమల తిరుపతి శ్రీవేంకటేశ్వర స్వామికి చెందిన TTDలో మాకూ భాగం కావాలని తెలంగాణ డిమాండ్ చేస్తోంది. ఆలయాన్ని ఉమ్మడి రాష్ట్రాల ఆస్తిగా చూడాలని కోరుతున్నారు. ఏపీకి మొత్తం వెయ్యి కిలోమీటర్ల దాకా తీర ప్రాంతం ఉంది. తెలంగాణకు లేనందున… తమకు ఏపీ కోస్టల్ కారిడార్ లో వాటా ఇవ్వాలని కోరుతోంది. అలాగే తెలంగాణకు ఓడ రేవులు కూడా లేవు. అందుకే విభజనలో భాగంగా కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం పోర్టుల్లో తమకూ భాగం కావాలని రేవంత్ రెడ్డి సర్కార్ కోరుతోంది. రాష్ట్ర ఏర్పాటు తరువాత ఆర్డినెన్స్ ద్వారా ఏపీలో కలిపిన 7 మండలాలను తిరిగి తెలంగాణలో చేర్చాలన్న డిమాండ్ వస్తోంది. అది చట్టరీత్యా సాధ్యం కాకపోతే… కనీసం ఐదు గ్రామాల కోసమైనా పట్టుబట్టాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించింది. చర్ల, వెంకటాపురం మండలాలకు వెళ్ళాలంటే ఈ ఐదు ఏపీ గ్రామాల నుంచి వెళ్ళాల్సి వస్తోంది.
ఇది కాకుండా కృష్ణా జలాల్లో 811 టీఎంసీల నీటి లభ్యత ఉంది. అంతర్జాతీయ నీటి పంపిణీ సూత్రం ప్రకారం క్యాచ్ మెంట్ ఏరియాల నిష్పత్తిలో నీటి పంపకాలు జరగాలని తెలంగాణ వాదిస్తోంది. అంటే కృష్ణా జలాల్లో 70శాతం చొప్పున 558 టీఎంసీలు కావాలని కోరుతోంది. తెలంగాణ విద్యుత్ సంస్థలకు ఏపీ సంస్థలు 24 వేల కోట్ల రూపాయల దాకా బకాయిలు ఉన్నాయి. వాటిని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తోంది. ఒకవేళ ఆంధ్రకు ఏవైనా చెల్లించాల్సి ఉంటే… వాటిని కూడా తీర్చేస్తామని అంటోంది. ఇప్పటికే విభజన చట్టంలోని 9, 10 షెడ్యూళ్ళ సంస్థల వాటాలకు సంబంధించి 10యేళ్ళుగా పంచాయతీ నడుస్తోంది. రేవంత్ పెట్టి ఈ కొత్త డిమాండ్లపై చంద్రబాబు నాయుడు ఎలా స్పందిస్తారనేది చూడాలి.