NEGGEDEVARU – NARASARAOPET : ఇద్దరు పాత మిత్రుల యుద్ధం… నరసరావుపేట ఎంపీగా నెగ్గేదెవరు..
నిన్నటివరకు ఆ ఇద్దరు ఒకే పార్టీలో ప్రజాప్రతినిధులు. కానీ కాలం మారింది. పరిస్థితులు మారిపోయాయ్. చివరికి వారిద్దరే ఎన్నికల్లో ప్రత్యర్థులుగా తలపడ్డారు. అధిష్ఠానం చెప్పినట్లు నడుచుకునే వ్యక్తి ఒకరైతే... నమ్ముకున్న సిద్దాంతాల కోసం పార్టీ మారిన వ్యక్తి మరొకరు.
నిన్నటివరకు ఆ ఇద్దరు ఒకే పార్టీలో ప్రజాప్రతినిధులు. కానీ కాలం మారింది. పరిస్థితులు మారిపోయాయ్. చివరికి వారిద్దరే ఎన్నికల్లో ప్రత్యర్థులుగా తలపడ్డారు. అధిష్ఠానం చెప్పినట్లు నడుచుకునే వ్యక్తి ఒకరైతే… నమ్ముకున్న సిద్దాంతాల కోసం పార్టీ మారిన వ్యక్తి మరొకరు. హోరాహోరీగా సాగిన ఆ పార్లమెంట్‌లో గెలిచేదెవరు? లోకల్‌బాయ్ పట్టు సాధిస్తారా ? లేదంటే అధికార పార్టీకి జైకొడతారా ? నరసరావుపేట పార్లమెంట్‌లో నెగ్గేదెవరు…
ఏపీలో ఎన్నికల వేడిని ప్రత్యక్షంగా రుచి చూపించిన నియోజకవర్గం… నరసరావుపేట పార్లమెంట్ స్థానం. ఇక్కడి సిట్టింగ్ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీ తరపున పోటీ చేశారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్… వైసీపీ నుంచి బరిలోకి దిగారు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన… అధిష్టానం సూచనతో నరసరావుపేటకు షిఫ్ట్ అయ్యారు. మరి ఈ ఇద్దరు యువనేతల్లో జనాల మనసు గెలుచుకునేది ఎవరు… ఎన్నికల బరిలో విజయం సాధించేది ఎవరు అని ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రస్తుతం జరిగిన అభివృద్దికి తోడు మరింత ముందుకు తీసుకెళ్తానని సిట్టింగ్ ఎంపీ లావు కృష్ణదేవరాయలు జనాల్లోకి వెళ్లారు. అసలు నరసరావుపేట పార్లమెంట్‌లో అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానని వైసీపీ అభ్యర్థి అనిల్ కుమార్ జనాలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. పోలింగ్ ముగిసింది. బ్యాలెట్ బాక్స్‌ల్లో అభ్యర్థుల భవితవ్యం నిక్షిప్తం అయింది. నరసరావుపేట పార్లమెంట్ స్థానంలో మొత్తం 17లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. ఈసారి 85.69 పోలింగ్ శాతం నమోదయింది. నియోజకవర్గాల వారీగా తీసుకుంటే… పెదకూరపాడు, వినుకొండలో అత్యధికంగా 89శాతం శాతం ఓట్లు పోలయ్యాయ్. మిగిలిన నియోజకవర్గాల్లో కూడా ఎక్కడా 80శాతానికి తగ్గనే లేదు. ఆ స్థాయిలో పల్నాడు ప్రాంత ఓటర్లు పోలింగ్ స్టేషన్‌లకు పోటెత్తారు.
పల్నాడు డివిజన్ హెడ్‌క్వార్టర్‌గా ఉన్న నరసరావుపేట.. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. ఈ నియోజకవర్గం కొత్తగా జిల్లా కేంద్రంగా మారింది. ప్రస్తుతానికి కొన్ని తాత్కాలిక హంగులు సమకూరాయ్. ఐతే నరసరావుపేటకు జరిగిన అభివృద్ధి సరిపోదు. నరసరావుపేట పార్లమెంటు స్థానంలో ఉన్న అనేక నియోజకవర్గాల్లో ఇంకా జరగాల్సింది చాలానే ఉందన్నది నాయకులు చెప్తున్న మాట. నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో మాచర్ల, గురజాల, వినుకొండ, పెదకూరపాడు, నరసరావుపేట, చిలకలూరిపేట, సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయ్. ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ మధ్య హోరాహోరీ పోరు సాగింది. రాళ్ల దాడులు, హాహాకారాలు.. ఏకంగా అభ్యర్థుల మీద దాడులతో దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులు లావు కృష్ణదేవయరాలు, అనిల్ కుమార్ మాత్రం… గెలుపు మాదే అన్న ధీమాతో ఉన్నారు. సంక్షేమ కార్యక్రమాలకు తోడు, అభివృద్ధిని వైసీపీ జనాల ముందు పెట్టింది. మరోవైపు టీడీపీ అభ్యర్థి తాను నిత్యం జనాలకు ప్రజలకు అందుబాటులో ఉన్నానని… జరిగిన అభివృద్ధిలో అగ్రభాగం తనదేనని చెప్పుకున్నారు. లోకల్ సెంటిమెంట్ కూడా రగిలించారు.
పల్నాడు జిల్లాలో మొదటిసారి బీసీ అభ్యర్థికి ఎంపీగా అవకాశం ఇచ్చింది వైసీపీ అధిష్టానం. కొత్త జిల్లా ఏర్పాటు చేసిన అధికార పార్టీని.. జనాలు అదరిస్తారని ఆ పార్టీ నేతలు నమ్ముతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బీసీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్‌కు పల్నాడు ఓటర్లు పట్టం కడతారా… లేదంటే టీడీపీ అభ్యర్థి చెప్పిన మాటలకు పల్నాడు జనాలు ఫిదా అవుతారా అన్న చర్చ జరుగుతోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలు తీరుకు ఓటర్లు కట్టబోతున్న పట్టాభిషేకం అని అధికార పార్టీ భావిస్తోంది. ప్రజా వ్యతిరేక పాలనను అంతం చేసేందుకు… పోలింగ్ కేంద్రాలకు ప్రజలు ఓట్లు వేశారనేది ప్రతిపక్ష పార్టీ వాదన. నియోజకవర్గంలో కమ్మ, కాపు ఓట్లతో పాటు కొన్ని బీసీ సామాజికవర్గాల బలంతో విజయం సాధిస్తామని టీడీపీ లెక్కలు వేసుకుంటోంది. రెడ్డి సామాజికవర్గంతో పాటు ప్రధాన ఆయుధంగా బీసీలు, ఎస్సీ ఓటర్లను అండతో బయటపడుతామని వైసీపీ విశ్వాసంతో ఉంది. గడిచిన 40ఏళ్లలో పల్నాడులో కమ్మ, రెడ్డి సామాజికవర్గాలే అత్యధికంగా పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. ఈసారి కూడా ఆ ట్రెండ్ కొనసాగుతుందా.. లేదంటే వైసీపీ చేసిన మార్పులతో క్యాస్ట్ ఈక్వేషన్ కలిసి వస్తుందా అన్నది ఉత్కంఠ రేపుతోంది.