AP Silent vote : లీడర్స్ కి చెమటలు పట్టిస్తున్న.. సైలెంట్ ఓటు

అంతా సైలెన్స్‌..ఎవరి మైండ్‌లో ఏముందో ఎవరికీ తెలీదు. రాజకీయ పార్టీలు... ఎవరి గోల అవి చెప్పుకుంటున్నాయి. జనం మాత్రం అన్నీ వింటూనే... సైలెంట్‌గా చూస్తున్నారు.. ఓటరు మైండ్‌లో ఏముందో ఊహించలేక అభ్యర్థులు, పార్టీలు కిందా మీదా అవుతున్నారు. ఓటరు ఎంత సైలెంట్‌గా ఉంటే... తీర్పు అంత వయోలెంట్‌గా ఉంటుందని భయపడుతున్నారు. ఏపీలో పోలింగ్‌కి టైమ్ ఎంతో లేదు. ఈ టైమ్ లో ఓటర్లు ఎటువైపు ఉన్నారో... కొన్ని సర్వేలు చెబుతాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 8, 2024 | 04:02 PMLast Updated on: May 08, 2024 | 4:02 PM

The Leader Is Sweating Silent Vote

 

 

అంతా సైలెన్స్‌..ఎవరి మైండ్‌లో ఏముందో ఎవరికీ తెలీదు. రాజకీయ పార్టీలు… ఎవరి గోల అవి చెప్పుకుంటున్నాయి. జనం మాత్రం అన్నీ వింటూనే… సైలెంట్‌గా చూస్తున్నారు.. ఓటరు మైండ్‌లో ఏముందో ఊహించలేక అభ్యర్థులు, పార్టీలు కిందా మీదా అవుతున్నారు. ఓటరు ఎంత సైలెంట్‌గా ఉంటే… తీర్పు అంత వయోలెంట్‌గా ఉంటుందని భయపడుతున్నారు. ఏపీలో పోలింగ్‌కి టైమ్ ఎంతో లేదు. ఈ టైమ్ లో ఓటర్లు ఎటువైపు ఉన్నారో… కొన్ని సర్వేలు చెబుతాయి. రాజకీయ విశ్లేషకులు కూడా తమ అనుభవంతో చెబుతారు. కానీ ఏపీలో ఇలాంటి పరిస్థితి లేదు. సర్వేలు అస్పష్టంగా ఉంటే… రాజకీయ పరిశీలకులు కూడా అంతకంటే అయోమయంగా ఉన్నారు. ప్రతి సభకూ జనం బాగానే వస్తున్నా… చప్పట్లు కొట్టేవాళ్లంతా నిజంగా ఓటేస్తారా అని లోలోపల అభ్యర్థుల్లో భయం కనిపిస్తోంది.

ఓటర్లను సెగ్మెంట్లుగా విడదీస్తే… టీడీపీ అభిమానులు, జనసేనను నమ్మేవాళ్లు, బీజేపీ ఓటర్లు.. ఆరు నూరైనా వైసీపీకే ఓటేసేవాళ్ళు. ఇలా పార్టీలకు నమ్మకంగా స్థిరమైన ఓటర్లు కొందరుంటారు. వీళ్లు కాకుండా తటస్థ ఓటర్లు కూడా భారీ సంఖ్యలో ఉంటారు. ఎన్నికల నాటికి పరిస్థితిని బేరీజు వేసుకుని ఏ పార్టీకి ఓట్లేయాలో డిసైడ్‌ చేసుకుంటారు. వీళ్ల పెరామీటర్లు. అభివృద్ధి, సంక్షేమం, మ్యానిఫెస్టోలు, అభ్యర్థి గుణగణాలు… ఇలా ఎవరి ప్రయారిటీలు వాళ్లకి ఉంటాయి.

కానీ, ఏపీలో మొత్తం సీన్‌ డిఫరెంట్‌గా కనిపిస్తోంది. ఈ ఎలక్షన్లో సైలెంట్‌ ఓటింగ్‌ ఉంటుందని భావిస్తున్నారు. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి. పొత్తులో భాగంగా టీడీపీ 144 స్థానాలకు, జనసేన 21, బీజేపీ 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. వైసీపీ సింగిల్‌గా 175 స్థానాల్లో బరిలో ఉంది. వైసీపీ తమ సంక్షేమ పథకాలే గట్టెక్కిస్తాయని నమ్ముతోంది. టీడీపీ, జనసేన మాత్రం అధికార పార్టీపై వ్యతిరేకత ఉందనీ…ఆ ఓటు చీలకపోతే గెలుపు తమదే అని భావిస్తోంది.

గత ఎన్నికల హామీల్లో 98శాతం అమలు చేశామని వైసీపీ చెబుతోంది. తమ వల్ల ఏదైనా మేలు జరిగితే… ఓటేయమని జగన్ కోరుతున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ గతంలో ఏం హామీలిచ్చాయి… అవి ఏమయ్యాయో గుర్తు చేస్తున్నారు. కూటమి నేతలు మాత్రం… సంక్షేమం పేరుతో జనంపైనే తిరిగి భారం వేస్తున్నారనీ… అభివృద్ధి జరగట్లేదని చెబుతున్నారు. ఈ రెండు వాదనల్లో జనం ఏది నమ్ముతున్నారనేది చూడాలి. పొలిటికల్ పార్టీలు తమ పాజిటివ్ అంశాలు ప్రచారం చేస్తూ.. ఎదుటి పార్టీలో లోపాలు చూపుతాయి. కానీ, ఓటర్లు రాజకీయ పార్టీల్లా ఆలోచించరు. అందుకే ఎన్నోసార్లు పార్టీలు, నేతలకు షాక్‌ ఇచ్చే ఫలితాలు వస్తుంటాయి. ఓటరు మదిలో ఏముందో చివరి వరకు ఊహించలేని పరిస్థితి ఉంటుంది. రాజకీయంగా అత్యంత చైతన్యంగా ఉండే ఏపీలాంటి చోట ఇది ఊహించటం మరీ కష్టం..

ఇందిరమ్మ చనిపోయి దేశమంతా ఒక వేవ్‌ నడిస్తే… ఆ టైమ్‌లో ఏపీ ఓటర్లు కాంగ్రెస్‌ని పట్టించుకోకుండా టీడీపీకి 30 లోక్‌సభ సీట్లు కట్టబెట్టారు. ఆ తర్వాత 1985లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి 202 సీట్లు ఇచ్చారు. ఇలా చాలా సార్లు అంచనాలకు భిన్నంగా ఏపీ ఓటర్ల తీర్పు కనిపించింది. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే ఉంది. ఓటరులో ఒక నిశ్శబ్దం ఉంది.. అది ఒక పక్షానికి అధికారం ఇవ్వబోతోంది.. ఆ నిశ్శబ్దం ఒక పక్షాన్ని పక్కన పెట్టబోతోంది.. అందుకే ఆ సైలెన్స్‌ వెనుక ఉన్నదేంటనేదే అందరిలో ఉన్న ప్రశ్న..

ఏపీలో వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తుందా.. లేక టీడీపీ కూటమికి జనం పవర్ ఇస్తారా అనేది టెన్షన్ గా మారింది. ఏపీలో వారానికో సర్వే బయటికొస్తోంది. ఓ సర్వే వైసీపీదే గెలుపంటే.. మరోటి టీడీపీకి పవర్ ఖాయమంటోంది. దీంతో ఏది నిజమో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. సర్వేల ఆధారంగా ఏ పార్టీ గెలుస్తుందో చెప్పలేకున్నా… సర్వేకో రకంగా వస్తున్న ఫలితాలు ఏ పార్టీని, దాని మద్దతుదారులనీ ప్రశాంతంగా ఉండనీయట్లేదు. గతంలో సర్వేల కోసం ఎదురుచూసిన పార్టీలు కూడా, ఇప్పుడా గోల మాకెందుకు అనుకుంటున్నాయి. ఓటరు సైలెంట్‌ ఓటింగ్‌ వైపు వెళ్తున్నట్టు కనిపిస్తుంటే… సర్వేలు మాత్రం చెప్పేదేముందని భావిస్తున్నాయి పార్టీలు. నిజానికి సర్వే సంస్థల కంటే కూడా సూక్ష్మంగా ఓటర్లు ఆలోచిస్తారని చాలాసార్లు రుజువైంది. స్థానిక ఎన్నికల దగ్గర్నుంచి లోక్ సభ ఎన్నికల దాకా ఓటర్ల ఆలోచనాసరళి డిఫ్రెంట్ గా ఉంటోంది. గతంలో పత్రికల మీదే ఆధారపడి ఉన్న రోజుల్లో అవి ఏది చెబితే అదే నిజమని నమ్మేవారు. కానీ ప్రస్తుతం ప్రపంచం మారింది. సోషల్ మీడియా హవా పెరిగింది. దాంతో జనాలకు నిజాలు తెలుస్తున్నాయి.

జనం సైలెంట్‌గా తీర్పిస్తారనే అంచనాతో బెట్టింగ్‌లు భారీగా ఊపందుకున్నాయి. మొదట్లో సెపరేట్ గా బెట్టింగ్ రింగులు నడిపిన పందెంరాయుళ్లు తర్వాత సిండికేట్ అయ్యారు. కొన్ని సర్వే సంస్థలతో లింక్ పెట్టుకుని విస్తరిస్తున్నారు. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని అందరిలో క్యూరియాసిటీ ఉంటుంది. దాన్ని అడ్డం పెట్టుకొని వందల కోట్ల నుంచి లక్ష కోట్ల వరకు బెట్టింగ్ మాఫియా పెరిగి పెద్దదైంది. జనం రెండు పక్షాలని చెరో అయిదేళ్లు చూశారు. ఇప్పుడు వాటి పనితీరుపై ఓ స్పష్టమైన అవగాహన కచ్చితంగా ఉంటుంది. ఏ పార్టీల ప్రాధాన్యత ఏంటి.. ఏ పార్టీ పాలసీలేంటో ఓ స్పష్టత వచ్చుంటుంది. ఇప్పుడదే ఏపీ ఎన్నికల ఫలితాన్ని డిసైడ్‌ చేయబోతోంది. రాజధాని, విభజన సమస్యలు, ప్రత్యేక హోదా, కొత్తగా వచ్చిన 30కి పైగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఇలాంటి అనేకానేక అంశాలు ఏపీలో ఓటర్ల ముందున్నాయి. ఇవే ఎన్నికల్లో కీలకంగా నిలిచే అంశాలు.. కానీ, ఏం ఓటర్లు డిసైడ్‌ చేసుకున్నారనేదే అర్థంకాని సైలెన్స్‌ ఏపీలో ఉంది.. ఈ సైలెంట్‌ ఓటింగ్‌ ఫలితం ఎవరి నెత్తిన బాంబు వేస్తుందో… ఎవరి నెత్తిన పాలు పోస్తుందో అనే టెన్షన్ ఏపీలో కొనసాగుతోంది..