Visakha Metro : విశాఖకు మెట్రో.. పనులు ఎప్పుడు ప్రారంభమంటే?
వైజాగ్ వాసుల చిరకాల వాంఛ తీరబోతోంది. త్వరలోనే సాగరతీరానికి మెట్రో రాబోతోంది. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న మెట్రో రైలు ప్రాజెక్టు.. కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కాస్త కదలిక వచ్చింది. ఇటీవల సీఎం చంద్రబాబు విశాఖ పర్యటన సందర్భంగా ఈ మెట్రో రైలు అంశం కూడా చర్చించారు.

The long wish of the people of Vizag is going to be fulfilled. Metro is coming soon to the beach.
వైజాగ్ వాసుల చిరకాల వాంఛ తీరబోతోంది. త్వరలోనే సాగరతీరానికి మెట్రో రాబోతోంది. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న మెట్రో రైలు ప్రాజెక్టు.. కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కాస్త కదలిక వచ్చింది. ఇటీవల సీఎం చంద్రబాబు విశాఖ పర్యటన సందర్భంగా ఈ మెట్రో రైలు అంశం కూడా చర్చించారు. విశాఖ నగర అభివృద్ధికి కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటున్న ప్రభుత్వం.. ప్రజా రవాణా సౌకర్యాన్ని మెరుగుపర్చేందుకు విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది.
విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి అధికారులకు దిశానిర్దేశం చేశారు సీఎం చంద్రబాబు. మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి గతంలో నిర్ణయించిన డిజైన్లకు అధికారులు కొన్ని మార్పులు చేయనున్నారు. విశాఖలో NHAI నిర్మించే ఫ్లై ఓవర్ బ్రిడ్జిల ఆధారంగా మెట్రో డిజైన్లు ఉండేలా చర్యలు చేపట్టనున్నారు.NHAIతో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లేందుకు వీలుగా అధికారులు ప్రణాళికలు చేస్తున్నారు. మెట్రో రైలుకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక డీపీఆర్‌లోనూ కొన్ని మార్పులు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు.. మెట్రో పనుల్ని ముందుకు తీసుకువెళ్లాలన్న తన ఆలోచనలను అధికారులకు వివరించారు.
ఇక నగరంలో ట్రాఫిక్‌ను తగ్గించేందుకు పలుచోట్ల ఫ్లైఓవర్ల నిర్మాణానికి NHAI ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వాటిని నిర్మించిన తర్వాత మెట్రో నిర్మిస్తే ఇబ్బందులు తలెత్తవచ్చన్న అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే NHAI మెట్రో రైలుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్మాణాలు చేపట్టాలని అధికారుల సమీక్షలో ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం విశాఖలో 12 ఫ్లై ఓవర్లు నిర్మించేందుకు NHAI డీపీఆర్ సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలోనే కొన్ని ప్రాంతాల్లో పిల్లర్ల చుట్టుకొలత పెంచడం, కొన్ని అదనంగా నిర్మించడం, వంతెనల పొడవు, వెడల్పుల్లోనూ కొన్ని మార్పులు చేయనున్నారు. అయితే అధికారుల సమావేశం తర్వాత త్వరలోనే వాటిపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. 2017 లోనే అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుకు ప్రీబిడ్ సమావేశాన్ని నిర్వహించింది.
2018 లోనే అర్హత కలిగిన 5 సంస్థలు మెట్రో రైలు నిర్మాణానికి ఆసక్తి చూపాయి. ఎస్సెల్ ఇన్‌ఫ్రా కన్సార్టియం ఫైనాన్షియల్ అనే సంస్థ బిడ్ దాఖలు చేయగా.. ప్రాజెక్టు పట్టాలెక్కే సమయానికి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు రావడం.. అప్పుడు చంద్రబాబు ఓడిపోవడంతో అది అక్కడే ఆగిపోయింది. తర్వాత 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి.. అంతకుముందు పిలిచిన టెండర్లతో పాటు డీపీఆర్‌ను రద్దు చేసి మళ్లీ కొత్తగా మొదలు పెట్టారు. తెలుగుదేశం ప్రభుత్వంలో 46 కిలోమీటర్లతో మొదట దశ మెట్రో రైలు ప్రాజెక్టు పూర్తిచేయాలని నిర్ణయించగా.. తర్వాత వైసీపీ సర్కార్ దాన్ని అనకాపల్లి నుంచి భోగాపురం వరకు 140.13 కిలోమీటర్లకు పెంచింది. కానీ ఆ పనులు మాత్రం మొదలు కాలేదు. ఇంతలోనే మళ్లీ ఇప్పుడు ప్రభుత్వం మారింది. దీంతో ఈసారి ఇక ఆలస్యం కాకుండా మెట్రో పనులు మొదలు పెట్టాలని భావిస్తున్నారు సీఎం చంద్రబాబు. మరి ఈ విషయంలో గుడ్ న్యూస్ అధికారికంగా ఎప్పుడు వస్తుందో చూడాలి.