YCP Party Office : నిర్మాణంలోని పార్టీ ఆఫీస్‌లే టార్గెట్‌.. చంద్రబాబు దెబ్బకు అల్లాడిపోతున్న జగన్‌..

ఏపీలో ఇప్పుడు కూల్చివేతల రాజకీయం నడుస్తోంది. సరిగ్గా 5ఏళ్ల కింద.. వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఇలాంటి సీన్లే కనిపించాయ్. ప్రజాభవన్‌ కూల్చివేత మొదలైన రచ్చ.. ఆ తర్వాత ఐదేళ్లు కొనసాగింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 22, 2024 | 03:59 PMLast Updated on: Jun 22, 2024 | 3:59 PM

The Party Offices Under Construction Are The Target Jagan Is Shaking From Chandrababus Blow

ఏపీలో ఇప్పుడు కూల్చివేతల రాజకీయం నడుస్తోంది. సరిగ్గా 5ఏళ్ల కింద.. వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఇలాంటి సీన్లే కనిపించాయ్. ప్రజాభవన్‌ కూల్చివేత మొదలైన రచ్చ.. ఆ తర్వాత ఐదేళ్లు కొనసాగింది. ఆ తర్వాత రకరకాల మలుపులు తిరిగింది. కట్ చేస్తే ఏపీలో అధికారం మారింది. కూల్చివేతలు మాత్రం కామన్‌. ఐతే అప్పటికీ, ఇప్పటికీ పరిస్థితులు మాత్రం వేరు. తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ పార్టీ కార్యాలయాన్ని.. అక్రమ నిర్మాణం అంటూ సీఆర్డీఏ అధికారులు కూల్చివేశారు. అటు విశాఖలోనూ పార్టీ ఆఫీస్‌కు జీవీఎంసీ అధికారులు నోటీసులు ఇచ్చారు. అనుమతుల్లేకుండా నిర్మాణాలు చేస్తున్నారని నోటీసులు అంటించిన అధికారులు.. వారంలో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఈ పరిణామాలపై.. జగన్ ఫైర్ అయ్యారు.

కక్షసాధింపు రాజకీయం అని.. చంద్రబాబు రాబోయే ఐదేళ్ల పాలనకు ఇది శాంపిల్ అంటూ ఘాటుగా విమర్శలు చేశారు. ఇదంతా ఎలా ఉన్నా.. నిర్మాణంలో ఉన్న పార్టీ ఆఫీస్‌లే టార్గెట్‌గా ఇప్పుడు ఏపీ సర్కార్‌ పావులు కదుపుతోంది. దీంతో రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. ఐతే వైసీపీ పార్టీ ఆఫీస్‌లు నిర్మాణం వెనక అసలు కథలు బయటకు తీస్తే.. సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయ్. తాడేపల్లి, విశాఖ మాత్రమే కాదు.. రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో వైసీపీ పార్టీ ఆఫీస్‌ నిర్మాణాలు అక్రమమే అని తేలినట్లు తెలుస్తోంది. చాలా జిల్లాల్లో పార్టీ ఆఫీసుల కోసం ప్రభుత్వ స్థలాలను కేవలం వెయ్యి రూపాయలకు లీజుకు తీసుకొని.. 33 ఏళ్లకు పైగా వైసీపీ అగ్రిమెంట్ రాసుకుంది. కాదు కాదు అప్పటి సీఎం జగన్ రాయించారు. స్థలాలను, భూములను ఏడాదికి వెయ్యి రూపాయలు చొప్పున వైసీపీకి అడ్డగోలుగా లీజుకి ఇచ్చింది అప్పటి జగన్ సర్కార్‌.

ఇక లీజుకు తీసుకున్న స్థలాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా.. కార్యాలయం నిర్మాణాలు చేపట్టింది వైసీపీ. ఐతే ఇదంతా జగన్ కనుసన్నల్లోనే జరిగినట్లు తెలుస్తోంది. తాడేపల్లిలో కేంద్ర కార్యాలయంతో పాటు.. విశాఖలో మరో వైసీపీ ఆఫీస్‌, కర్నూల్లో వైసీపీ కేంద్ర కార్యాలయం. ఇలా చాలా చాలా జిల్లాల్లో పార్టీ ఆఫీసుల కోసం జగన్‌ అడ్డగోలుగా నిర్మాణాలు ప్రారంభించారు. అధికారం ఎప్పటికీ తమదే అన్నట్లుగా.. కనీసం అనుమతుల విషయాన్ని జగన్ పట్టించుకున్నట్లు కూడా అనిపించలేదు. జూన్‌ 4న ఎన్నికల ఫలితాల తర్వాత.. పార్టీ ఓటమి ఖాయం అయిన తర్వాత.. పార్టీ ఆఫీస్‌ల భవన నిర్మాణ అనుమతుల కోసం వైసీపీ హడావుడిగా దరఖాస్తు చేసుకుంది. జూన్‌ 5న కొన్ని అనుమతులు తీసుకొచ్చి.. జనం కళ్లు కప్పే ప్రయత్నం చేసింది. ఏమైనా జగన్‌ను చంద్రబాబు సరిగ్గా గురిచూసి కొడుతున్నారు. మరి ఈ కూల్చివేతల రచ్చ.. ఎక్కడికి వెళ్తుందన్నది మరింత ఆసక్తికరంగా మారింది.