MADANAPALLY : పెద్దిరెడ్డి అనుచరుడి కోసం.. 3 రాష్ట్రాల్లో వేట
ఏపీలోని మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ ఫైళ్ళ కాల్చివేత వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుల కోసం పోలీసుల వేట కొనసాగుతోంది.
ఏపీలోని మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ ఫైళ్ళ కాల్చివేత వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుల కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. ఆయన అనుచరుడు మాధవరెడ్డి కోసం మూడు రాష్ట్రాల్లో పోలీసు టీమ్స్ వెతుకుతున్నాయి. బెంగళూరు లేదా చెన్నైకి పారిపోయి ఉంటాడని ఆ రెండు రాష్ట్రాల్లో వెతికారు. మొబైల్ స్విచ్ఛాఫ్ వస్తుండటంతో… చిత్తూరు జిల్లాలోనే ఎక్కడైనా రహస్యంగా దాక్కున్నాడా అని ఆరా తీస్తున్నారు. అయితే మాధవరెడ్డి ఢిల్లీకి పారిపోయినట్టు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. అక్కడైతే వైసీపీ ఎంపీలు ఇతర నేతల సంరక్షణలో ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. మాధవ రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారిస్తే… మదనపల్లి సబ్ కలెక్టరేట్ ఆఫీస్ అగ్ని ప్రమాదం కథంతా బయటకు వస్తుందని భావిస్తున్నారు. సంఘటన జరిగిన తెల్లారి మాధవ రెడ్డి ఇంట్లో పోలీసులు సెర్చ్ చేశారు. అప్పుడు దాదాపు రెండు బస్తాల డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. కానీ మాధవరెడ్డి దొరకలేదు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నిషేధ జాబితాలో ఉన్న 2 లక్షల 19 వేల ఎకరాలకు విముక్తి కల్పించి… వాటిని స్వాధీనం చేసుకోవాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన అనుచరలు ప్లాన్ చేసినట్టు చెబుతున్నారు. అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 22A నుంచి తొలగించిన భూముల వివరాలను రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా తెప్పించుకున్నారు. అటు పెద్దిరెడ్డి భూబాధితులు భారీగా సబ్ కలెక్టరేట్ కు క్యూ కడుతున్నారు. బాధితుల్లో రెవెన్యూ, పోలీసు అధికారులు కూడా ఉండటంతో సిసోడియా ఆశ్చర్యపోతున్నారు. పెద్దిరెడ్డి సోదరుడు తంబళ్ళపల్లి వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానథ రెడ్డి అనుచరులు చేసిన భూ కబ్జాలను వెలికితీయాలని చంద్రబాబు ప్రభుత్వం ఆదేశించింది. అదే టైమ్ లో మదనపల్లి సబ్ కటెక్టరేట్ లో అగ్నిప్రమాదం జరిగింది. దాంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన అనుచరులపైన అనుమానాలు మరింత బలపడ్డాయి.