JAGAN ASSEMBLY : అందుకేనా అసెంబ్లీకి వచ్చేది ? జగన్ హాజరుకు అసలు రీజన్ ఇదే
మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈసారి అసెంబ్లీ సమావేశాలకు వస్తారా... రారా... అన్న సస్పెన్స్ వీడిపోయింది.

The suspense over whether former CM and YCP leader Jaganmohan Reddy will come to the assembly meetings this time... or not... is over.
మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈసారి అసెంబ్లీ సమావేశాలకు వస్తారా… రారా… అన్న సస్పెన్స్ వీడిపోయింది. ఈనెల 22 నుంచి మొదలయ్యే ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు అటెండ్ అవ్వాలని జగన్ ఫిక్సయ్యారు. వైసీపీకి బూస్టింగ్ వచ్చేలా ఓ ప్లాన్ వర్కవుట్ చేయాలని కూడా డిసైడ్ అయ్యారు.
అసెంబ్లీ సమావేశాలకు వారం ముందే జగన్ బెంగళూరుకు వెళ్ళారు. దాంతో ఆయన సెషన్స్ కి వచ్చే ఛాన్స్ లేదని వార్తలు వచ్చాయి. కానీ ఎవరూ ఊహించని విధంగా… సమావేశాలకు హాజరవుతున్నట్టు పార్టీ వర్గాల ద్వారా మెస్సేజ్ పంపారు. సభ్యుల ప్రమాణం కోసం అసెంబ్లీ మొదటి సమావేశం జరిగినప్పుడు… తన ప్రమాణం పూర్తి కాగానే బయటకు వెళ్ళిపోయారు జగన్. ఆ తర్వాత సభలో ప్రతిపక్ష నేత హోదా కావాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడికి లెటర్ రాశారు. 10శాతం సీట్లు కూడా రాకపోవడంతో ఆ హోదా ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం ఒప్పుకోలేదు. సభలో పులివెందుల ఎమ్మెల్యేగా మాత్రమే పాల్గొనాల్సి రావడం… తనకు ఇష్టంలేని అయ్యన్నపాత్రుడు స్పీకర్ గా ఉండటంతో అసెంబ్లీలో తనకు ప్రియారిటీ ఉండదనుకున్నారు జగన్.
అందుకు అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరు అవుతారని పార్టీ వర్గాలు భావించాయి. కానీ ఉన్నట్టుంది అసెంబ్లీకి రావాలని జగన్ నిర్ణయించడం వెనక పెద్ద రీజనే ఉంది. ఇటీవల కాలంలో తెలుగు దేశం- వైసీపీ నేతల మధ్య దాడులు జరుగుతున్నాయి. దాన్ని సభలో ప్రస్తావించాలన్నది జగన్ ప్లాన్. అలాగే గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై సీఎం చంద్రబాబు శ్వేత పత్రాలు విడుదల చేస్తున్నారు. వైసీపీ సభ్యులెవరూ వాటిని ఖండించకపోతే జనంలో తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశముంది. అసెంబ్లీలో జగన్ తప్ప… మాట్లాడేది మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రమే.
ఇప్పుడు ఆయన మీదా పీకల్లోతు ఆరోపణలు ఉన్నాయి. వాటిల్లో మింగ లేక కక్కలేక అన్నట్టుంది పెద్దిరెడ్డి పరిస్థితి. అందుకే కూటమి ప్రభుత్వ ఆరోపణలకు జగన్ డైరెక్ట్ గా సమాధానం చెప్పే అవకాశం ఉంది. ఒకవేళ తనకు మాట్లాడేందుకు ఎక్కువ టైమ్ ఇవ్వకపోతే… అసెంబ్లీ నుంచి వైసీపీ బాయ్ కాట్ చేయాలని ప్లాన్ చేశారు. దాంతో జనంలో సానుభూతి పొందవచ్చని జగన్ ఆలోచిస్తున్నారు. 2014లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ ఇలా అసెంబ్లీని బహిష్కరించింది. అప్పట్లో టీడీపీ ప్రభుత్వం తమను మాట్లాడనీయలేదని క్యాంపెయిన్ చేసుకుంది. ఇప్పుడు అదే కార్డును మళ్ళీ బయటకు తీస్తున్నారు జగన్. జనంలో సానుభూతి కోసమే ఆయన ఈ ప్లాన్ వేసినట్టు… అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు.