NEGGEDEVARU – GAJUVAKA : అప్పుడు తండ్రులు – ఇప్పుడు కొడుకులు.. గాజువాక ఫైట్ లో విజయం ఎవరిదో ?
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో గాజువాక నియోజకవర్గం హాట్ ఫేవరెట్. వైసీపీ, టీడీపీ అభ్యర్ధులు ఇద్దరికీ హోం గ్రౌండ్. ఒకరు మంత్రైతే... మరొకరు సీనియర్ నేత. అభివృద్ధి -సింపథీ-లోకల్ ఈ మూడు అంశాల చుట్టూ ఎన్నికలు తిరిగాయి.
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో గాజువాక నియోజకవర్గం హాట్ ఫేవరెట్. వైసీపీ, టీడీపీ అభ్యర్ధులు ఇద్దరికీ హోం గ్రౌండ్. ఒకరు మంత్రైతే… మరొకరు సీనియర్ నేత. అభివృద్ధి -సింపథీ-లోకల్ ఈ మూడు అంశాల చుట్టూ ఎన్నికలు తిరిగాయి. ప్రచారం నుంచి పోల్ మేనేజ్మెంట్ వరకు అధికార, కూటమి పక్షాలు అత్యంత పకడ్భందీగా వ్యవహరించాయి. తెరచాటు రాజకీయాలు, లోపాయికారీ ఒప్పందాలు…ప్రధాన పార్టీల అభ్యర్ధులను టెన్షన్ పెడుతున్నాయి. 35 ఏళ్ళ క్రితం తండ్రులు… ఇప్పుడు కొడుకుల మధ్య ప్రత్యక్ష పోరులో అంతిమ ఫలితం ఎవరి పక్షం…జూన్ 4 న తేలుతుంది.
స్టీల్ సిటీ వైజాగ్‍లో కీలక స్ధానం గాజువాక నియోజకవర్గం. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్ధిరపడటంతో మినీ ఇండియాను తలపిస్తుంది. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2009లో గాజువాడ ఏర్పాటైంది. గత మూడు ఎన్నికల్లో మూడు భిన్న పార్టీల అభ్యర్థులు గెలుపొందారు. 2009లో ప్రజారాజ్యం ఈ సీటు ఎగరేసుకుని పోయింది. 2014లో తెలుగుదేశం విజయం సాధించింది. స్ధానికుడైన బీసీ నేత పల్లా శ్రీనివాస్‌కు ప్రజలు ఛాన్సిచ్చారు. 2019లో పవన్ కల్యాణ్ పోటీ చేసి ఓడిపోయారు. టీడీపీ, వైసీపీ, జనసేన మధ్య హోరాహోరీ పోరులో 65.33 శాతం పోలింగ్ నమోదైంది. వైసీపీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి…పవన్ కళ్యాణ్ పై 16,753 ఓట్ల తేడాతో గెలిచారు. ఈసారి గాజువాకలో టీడీపీ, వైసీపీ అభ్యర్ధులు ఢీ అంటే ఢీ అనేలా తలపడ్డారు. గాజువాకలో జనసేన జెండా ఎగురవేస్తామన్న పవన్ వ్యాఖ్యలతో…పల్లా సందిగ్దంలో పడ్డారు. పవన్ పోటీ చేస్తే సీటు వదిలేస్తానని… లేని పక్షంలో రాజీపడబోనని పల్లా ప్రకటించడంతో టీడీపీ ఇరుకునపడింది. అనేక తర్జనభర్జనల తర్వాత టిక్కెట్ మాజీ ఎమ్మెల్యేకు ఖరారు చేసింది.
మరోవైపు అధికార వైసీపీ అనేక మార్పులు చేసి ఆఖరి నిమిషం వరకు కేడర్‌ను తికమకపెట్టింది. సిట్టింగ్ ఎమ్మెల్యే నాగిరెడ్డిని తప్పించి.. .యాదవ సామాజిక వర్గానికి చెందిన కార్పోరేటర్ చందుకు బాధ్యతలు అప్పగించింది. సోషల్ ఇంజనీరింగ్‌లో భాగంగా ఈ ప్రయత్నం చేసినప్పటికీ…పార్టీని సమన్వయం చేయడం కొత్త నాయకత్వంతో సాధ్యం కాదని పార్టీ గ్రహించింది. ఎమ్మెల్యే వర్గం నుంచి వచ్చిన తీవ్ర ప్రతిఘటనను అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది. గాజువాకలో అతిపెద్ద సామాజికవర్గంగా ఉన్న కాపులకు అవకాశం అనే యాంగిల్‌లో…మంత్రి గుడివాడ అమర్నాథ్ రంగంలోకి దించింది. దీంతో గాజువాక ఎన్నికల వేడి ఒక్కసారిగా తారాస్థాయికి చేరింది. సరిగ్గా రెండు నెలల ముందు ఇక్కడ అడుగుపెట్టిన మంత్రి గుడివాడ…పోల్ మేనేజ్‌మెంట్‌లో తన మార్క్ చూపించారు. బలమైన కాపు సామాజిక వర్గం, స్ధానికుడు కావడం, మూడోతరం రాజకీయ కుటుంబం…ఇవన్నీ అమర్నాథ్‌కు పూర్తిగా కలిసి వచ్చాయి. లోకల్ ఫీలింగ్… వైసీపీ, టీడీపీ అభ్యర్ధులకు బాగానే వర్కౌట్ అయింది. సింపతీ, సాంప్రదాయ ఓట్ బ్యాంక్, బీసీ ఓటింగ్‌పై పల్లా శ్రీనివాస్ ఆధారపడ్డారు. హోమ్ పిచ్‌లో జరిగిన హోరాహోరీ పోరులో…ప్రచారం నుంచి పోలింగ్ వరకు ఉత్కంఠ భరితంగానే జరిగింది.
ఉమ్మడి విశాఖ జిల్లాలో ఓటర్ల పరంగా రెండో పెద్ద నియోజకవర్గం గాజువాక. ఇక్కడ 3,33,611 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో మగవాళ్ళు లక్షా 67,112 …మహిళలు లక్షా 66,457. 2,32,949 ఓట్లు పోలవడంతో 69.83 శాతం నమోదైంది. 2019లో ఇక్కడ 2,02,094 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 65.33% శాతం పోలింగ్ నమోదైంది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి దాదాపు నాలుగు శాతం ఎక్కువ పోలింగ్ జరిగింది. దీంతో పెరిగిన ఓట్లు ఎవరిని గెలిపిస్తున్నాయి…?. ఎవరికి షాక్ ఇస్తున్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కీలకమైన అంశాల ప్రభావం ఎంత అనేది ప్రధానంగా చర్చ జరుగుతోంది. వీటిలో విశాఖపట్టణం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ప్రధానం. RINLలో ప్రస్తుతం 16 వేల మందికిపైగా శాశ్వత ఉద్యోగులు ఉన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు 30 వేల మంది ఉన్నారు.
ఈ పరిశ్రమలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న నిర్వాసిత కుటుంబాలు దాదాపు 8వేల మంది ఉన్నారు. ఒక్క స్టీల్ ప్లాంట్ పారిశ్రామిక అవసరాలు తీర్చేందుకే 1200 చిన్న, మధ్య స్థాయి పరిశ్రమలు ఏర్పడ్డాయి. ఒక విధంగా చెప్పాలంటే గాజువాక అభివృద్ధి అంతా స్టీల్ ప్లాంట్, గంగవరం పోర్టు, ఇతర పరిశ్రమల ఆధారంగా జరిగిందనే చెప్పాలి. గాజువాకలో కూటమి అభ్యర్ధికి ఓటేయడం అంటే ఉక్కు అమ్మకానికి ప్రజామోదం లభించినట్టేనని… అందువల్ల తిప్పికొట్టాలని వైసీపీ విస్త్రతంగా ప్రచారం చేసింది. స్వయంగా సీఎం జగన్…ఈ అంశాన్ని లేవనెత్తి ప్రజల్లో పెద్ద చర్చకు తెరతీశారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్టు కేంద్రం ప్రకటిస్తే…పోటీ నుంచి తప్పుకోవడానికి సిద్ధమంటూ కూటమిని ఇరుకునపెట్టే ప్రయత్నం చేశారు మంత్రి అమర్నాథ్.
పీపుల్స్ మానిఫెస్టో పేరుతో తొలిసారి గాజువాక అభివృద్ధి ప్రణాళికను ప్రకటించి విజయవారధిగా నామకరణం చేశారు. ఐదేళ్ళ కాలంలో తాను ఏం చేస్తానో చెప్పేందుకు అమర్నాథ్ చేసిన ప్రయత్నం కొంత మేర ప్రజలకు చేరింది. మహిళా ఓటర్లు, కార్మిక వర్గం ఓట్ బ్యాంక్ ఖచ్చితంగా తమదేననే అంచనాలతో వైసీపీ ఉంది. జనసేన పోటీలో లేని కారణంగా కాపు సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ చీలిక వచ్చిందనే లెక్కలు వినిపిస్తున్నాయి. రెండు నెలల వ్యవధిలో గాజువాకలో టఫ్ ఫైట్ వాతావరణం తీసుకుని రావడంలో అమర్నాథ్ సక్సెస్ అయ్యారు. కానీ పార్టీలో అంతర్గత పోరు… ఎమ్మెల్యే నాగిరెడ్డి వర్గం అంటీ ముట్టనట్టు వ్యవహరించడం వంటివి వైసీపీకి ఎంత వరకు డ్యామేజ్ చేశాయనేది తేలాల్సి ఉంది. పైగా స్టీల్ ప్లాంట్ అమ్మకం కారణంగా కూటమిని వ్యతిరేకించే ఓటింగ్ మొత్తం అధికార పార్టీకి షిఫ్ట్ అయ్యే చాన్స్ కూడా లేదు. కారణం, ఇక్కడ సిపిఎం బరిలోకి దిగింది. జీవీఎంసీ ఎన్నికల్లోనూ గాజువాక పరిధిలోని కీలక డివిజన్లలో టీడీపీకి, కమ్యునిస్టు పార్టీలకే ఎక్కువ ఓట్లు పోలయ్యాయి.
అటు తెలుగుదేశం పార్టీకీ చిక్కులు తక్కువేమీ లేవు. సౌమ్యుడిగా ముద్ర ఉన్న పల్లా శ్రీనివాస్…ఈ దఫా ఎన్నికల నిర్వహణ బాధ్యతను పార్టీకే వదిలేయడం చర్చనీయాంశంగా మారింది. పోల్ మేనేజ్‌మెంట్‌లోనూ తడబడ్డారనే ప్రచారం జరుగుతోంది. అమర్నాథ్ అభ్యర్ధిత్వం ఖరారు కాకముందు తనకు బల్క్ గా పడతాయనుకున్న కాపు సామాజిక వర్గం ఓట్లు చీలిక ఏర్పడింది. ఇక్కడ జనసేన, బీజేపీకి పటిష్టమైన ఓట్ బ్యాంక్ ఉంది. అయితే అంతర్గత కారణాలతో ఎంత పర్సంటేజ్ షిఫ్ట్ అయిందనేది కీలకం. అదే సమయంలో సింపతీ, స్టీల్ ప్లాంట్ కోసం నిరాహార దీక్ష చేయడం, ప్రజలకు అందుబాటులో వుంటారనే అభిప్రాయం. అన్నింటికీ మించి బీసీల ఓట్ బ్యాంక్, కాపులతో ఉన్న కుటుంబ సంబంధాలు…ఇలా పల్లాకు చాలా ప్లస్ పాయింట్లే ఉన్నాయి. దీంతో గాజువాక ఎన్నికల పోరు 2019 అంత పీక్స్ లేకపోయినా ఈ దఫా కూడా ఆసక్తికరంగా మారింది.