AP KEY SEATS : ఈ మంత్రులు గెలుస్తారా ?

ఏపీలో మంత్రుల గెలుపుపై వాడి వేడి చర్చ నడుస్తోంది. వైసీపీ మున్నెన్నడూ లేని విధంగా రాజకీయ బదిలీలు చేసింది. ఇందులో కొందరు మంత్రులు సిట్టింగ్ నియోజక వర్గాలను వేరే చోట పోటీ చేయాల్సి వచ్చింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 25, 2024 | 10:24 AMLast Updated on: May 25, 2024 | 10:24 AM

There Is A Heated Discussion On The Win Of Ministers In Ap

 

 

 

ఏపీలో మంత్రుల గెలుపుపై వాడి వేడి చర్చ నడుస్తోంది. వైసీపీ మున్నెన్నడూ లేని విధంగా రాజకీయ బదిలీలు చేసింది. ఇందులో కొందరు మంత్రులు సిట్టింగ్ నియోజక వర్గాలను వేరే చోట పోటీ చేయాల్సి వచ్చింది. వైసీపీ ఆవిర్భావం తర్వాత ఇంతవరకూ బోణీ కొట్టని నియోజకవర్గాల్లో కూడా కొందరు మంత్రులు పోటీకి దిగారు. నాన్ లోకల్ అయినా… అక్కడ తమ శక్తికి మించి కష్టపడ్డారు. టఫ్ ఫైట్ నడిచిన నియోజకవర్గాల్లో గెలిచే మంత్రులు ఎవరు అనే చర్చ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా సాగుతోంది. మంత్రుల గెలుపు ఓటములపై భారీ బెట్టింగ్స్ నడుస్తున్నాయి.

ప్రకాశం జిల్లాకు చెందిన రాష్ట్ర మునిసిపల్ మంత్రి ఆదిమూలపు సురేష్.. ఎర్రగొండపాలెం నుంచి కొండపికి మారారు. రాష్ట్ర సాంఘికశాఖ మంత్రి మేరుగ నాగార్జున.. బాపట్ల జిల్లా వేమూరు నుంచి ప్రకాశం జిల్లా సంతనూతలపాడుకు మారారు. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాలైన ఈ రెండింటిలోనూ టఫ్ ఫైట్ నడిచిందనేది టాక్. కొండపిలో వైసీపీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు గెలవలేదు. 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి డాక్టర్ బాలవీరాజనేయులు వరుసగా గెలుపొందారు. ఆయన స్థానికుడు, డాక్టర్ గా సుపరిచితుడు. గెలుపు ఓటముల్ని ప్రభావితం చేసే స్థాయిలో కమ్మ సామాజిక వర్గం ఓటర్లు కొండపిలో ఉండటంతో అక్కడ హోరాహోరీ పోరు నడిచింది. మంత్రి ఆదిమూలపు సురేష్ గెలిచి నియోజకవర్గంలో బోణీ కొడతారా లేక బాలవీరాంజనేయులు హ్యాట్రిక్ సాధిస్తారా అనేది తేలాల్సి ఉంది.

సంతనూతలపాడు నుంచి 2014లో ఆది మూలపు సురేష్, 2019లో టీజేఆర్ సుధాకర్ బాబు వైసీపీ నుంచి
గెలుపొందారు. ఈసారి మంత్రి మేరుగ నాగార్జున పోటీ చేశారు. వైసీపీకి గట్టి పట్టున్న నియోజకవర్గాల్లో ఇది ఒకటి. వడ్డెర సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువ ఉన్నాయి. బీసీ, ఎస్సీ, కమ్మ సామాజిక వర్గం ఓటర్లు గెలుపోటముల్ని ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. వైసీపీ ఓట్ బ్యాంక్ బలంగానే ఉన్నా… గ్రూపు తగాదాలు, స్థానికేతరుడు కావడం లాంటి అంశాలు మంత్రి మేరుగను వెంటాడాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని సామాజిక సమీకరణల్లో భాగంగా ఈసారి గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేశారు. వైసీపీ పుట్టిన తరువాత జరిగిన 2014, 2019 ఎన్నికల్లో ఆ నియోజక వర్గం నుంచి టీడీపీ అభ్యర్థులే గెలుస్తూ వస్తున్నారు.

ఈసారి ఎలాగైనా గుంటూరు వెస్ట్ దక్కించుకోవాలని వైసీపీ అధిష్టానం రజనికి టిక్కెట్ కేటాయించింది. టీడీపీ గల్లా మాధవిని బరిలోకి దించింది. ఇద్దరూ బీసీ వర్గానికి చెందిన వారే. అక్కడ హోరాహోరీ పోరులో టీడీపీ ఆధిక్యత నిలబెట్టుకుంటుందా… వైసీపీ పాగా వేస్తుందా అన్నది చూడాలి. కృష్ణాజిల్లా పెడన సిట్టింగ్ ఎమ్మెల్యే, రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్ ఈసారి పెనమలూరు నుంచి పోటీకి దిగారు. ఈ నియోజకవర్గంలో కమ్మ, బీసీ, ఎస్సీ ఓటింగ్ ఎక్కువ. ఎన్నికలకు మూడు నెలల ముందు నుంచే జోగి పెనమలూరుకు మకాం మార్చారు. ప్రచార పర్వంలో జోగి దూకుడుగా వ్యవహరించారు. అయితే నాన్ లోకల్ ముద్ర పడటంతో వైసీపీ, టీడీపీ మధ్య నువ్వా.. నేనా అన్నట్లు పోరు సాగింది. పెనమలూరు ఫలితంపై రెండు పార్టీల్లోనూ ఉత్కంఠ నెలకొంది. అనకాపల్లి నుంచి గాజువాకకు బదిలీ అయిన రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్నారనేది టాక్.

ఈ నియోజకవర్గంలో గెలుపోటముల్ని ప్రభావితం చేసే స్థాయిలో కాపు, యాదవ సామాజిక వర్గం ఓటర్లు ఉన్నారు. గత ఎన్నికల్లో ముక్కోణపు పోటీ జరగ్గా… వైసీపీ నుంచి తిప్పల నాగిరెడ్డి, పవన్ కళ్యాణ్ పై అనూహ్య విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో గాజువాక నుంచి యాదవ సామాజిక వర్గానికి చెందిన పల్లా శ్రీనివాసరావును బరిలోకి దించింది. 2014 ఎన్నికల్లో పల్లా శ్రీనివాసరావు టీడీపీ నుంచి గెలిచారు. 2019 ఎన్నికల్లో పోటీ చేసి మూడో స్థానంలో నిల్చారు. ఈసారి మంత్రి గుడివాడ అమర్నాథ్, పల్లా శ్రీనివాసరావు మధ్య హోరాహోరీ పోరు నడిచింది. రాష్ట్రంలోనే హాట్ సీట్లతో రాజమండ్రి రూరల్ ఒకటి. ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ, టీడీపీ అభ్యర్ధి గోరంట్ల బుచ్చయ్య చౌదరి మధ్య రసవత్తర పోరు సాగింది.

2014.. 2019 ఎన్నికల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి వరుస విజయాలు సాధించారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం ఉంది. గోరంట్లపై బీసీ వర్గానికి చెందిన మంత్రి చెన్నుబోయిన వేణు గెలిచి…రాజమండ్రి రూరల్లో బోణీ కొడతారా…. ఏడోసారి గోరంట్ల ఈజీగా విజయం సాధిస్తారా అన్నది జూన్ 4న బయటపడుతుంది.
పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ నువ్వా-నేనా అన్నట్టుగా పోరు సాగింది. వీరిద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కావడంతో గెలుపుపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. 2014లో స్వల్ప తేడాతో ఓడిపోయిన అంబటి 2019లో దాదాపు 20 వేల ఓట్ల పైచిలుకు మెజార్టీతో విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి కన్నాకు ఈ నియోజకవర్గంలో సొంత అనుచర గణం ఉండటంతో పోరులో ఎవరిది విజయం అనేది తేలాల్సి ఉంది.

నగరి వైసిపి అభ్యర్ధి ఫైర్ బ్రాండ్ రోజా 2014, 2019 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించారు. హ్యాట్రిక్ విక్టరీ కోసం సర్వశక్తులు ఒడ్డి పోరాడారు. అయినా రోజా నగరిలో గట్టి పోటీ ఎదుర్కొన్నారు. సొంత పార్టీ నుంచే ఆమెకు వ్యతిరేకత ఎదురవడంతో ఆమె గెలుపుపై ఇక్కడ ఆసక్తికర చర్చ సాగుతోంది. 2014లో గాలి ముద్దుకృష్ణమనాయుడిని, 2019లో గాలి భాను ప్రకాష్ … ఇలా తండ్రీ కొడుకులను వరుసగా ఓడించిన చరిత్రను సొంతం చేసుకున్న రోజా.. ఈసారి టీడీపీ అభ్యర్ధి గాలి భానుప్రకాష్ పై విజయం సాధిస్తారా లేదా అనే చర్చ సాగుతోంది.