Chandrababu : మీరు మారిపోయారు సార్…
నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబులో.. కొత్త మార్పు కనిపిస్తోంది. రాజకీయాలను అంచనా వేయడంలో, రాజకీయాల్లో చక్రం తిప్పడంలో చంద్రబాబు స్టైలే సపరేట్.
నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబులో.. కొత్త మార్పు కనిపిస్తోంది. రాజకీయాలను అంచనా వేయడంలో, రాజకీయాల్లో చక్రం తిప్పడంలో చంద్రబాబు స్టైలే సపరేట్. రాజకీయాలు మాత్రమే తెలుసు అన్నట్లు కనిపించేవారు ఒకప్పుడు ! సీఎంగా ఎన్ని సంక్షేమ పథకాలు చేపట్టినా.. జనంతో ఉండి, జనంలో ఉండి వాటిని పెద్దగా ప్రమోట్ చేయడం కనిపించలేదు. గతంలో మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు చంద్రబాబు తీరు ఇలానే కనిపించింది. అలాంటిది జగన్ ఎఫెక్టో.. మరేదో కారణమో కానీ.. ఏపీలో ఇప్పుడు కొత్త చంద్రబాబు కనిపిస్తున్నారు. ఒకప్పుడు ఒక నిర్ణయం తీసుకోవాలి అనుకుంటే.. చంద్రబాబు సాగదీత ధోరణిలో కనిపించేవారు.
ఈలోపు అది ప్రతిపక్షాలకు ఆయుధంగా మారేది. అలాంటిది ఇప్పుడు చంద్రబాబు.. ధనాధన్, ఫటాఫట్ అనే రేంజ్‌లో నిర్ణయాలు తీసుకుంటున్నారు. సీఎంగా మొదటి ఐదు సంతకాల నుంచి సోమవారం ప్రారంభం అయిన పెన్షన్ల పంపిణీ వరకు ఇలాంటి తీరే కనిపించింది. ఇక జులైలో 7వేల పెన్షన్లు ఇచ్చిన చంద్రబాబు.. స్వయంగా ఓ లబ్దిదారుని ఇంటికి వెళ్లి మరీ దాన్ని అందించారు. వాళ్ల కష్టసుఖాలు తెలుసుకున్నారు. తను జనం మనిషిని అని.. జనంలో ఉండే మనిషిని అన్నట్లుగా వారితో ఈజీగా కలిసిపోయారు. పిల్లలను ప్రేమగా పలకరించారు. చిన్నారులను ఆప్యాయంగా ఎత్తుకున్నారు. ఇక్కడితో ఆగారా అంటే.. ఓ పూరి గుడిసెలోకి వెళ్లి లబ్దిదారులను కలిసి… వాళ్ల ఇంట్లో ఏకంగా టీ తాగారు.
ఇక స్టేజీ మీద లోకేశ్‌తో కలిసి చంద్రబాబు వేస్తున్న జోకులు.. అధికారులకు ఇచ్చిన వార్నింగ్‌లు.. కొత్త చంద్రబాబును జనాలకు పరిచయం చేశాయ్. 40ఏళ్ల పొలిటికల్ కెరీర్‌లో రాజకీయాలు మాత్రమే తెలుసు అన్నట్లు కనిపించిన చంద్రబాబు.. ఇప్పుడు మాత్రం స్టైల్ మార్చారు. వీటన్నింటిలో లబ్దిదారుల ఇంటికి వెళ్లి.. ఓ సీఎం పెన్షన్లు అందించడమే పెద్ద హైలైట్. దేశంలోనే ఇలా చేసిన మొదటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు రికార్డు క్రియేట్ చేశారు. వీటితోపాటు ప్రతీవారం జనాల నుంచి అర్జీలు తీసుకోవడం.. చాలా సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం చూపించడం.. ఇలా చంద్రబాబు ప్రతీ అడుగు ఈసారి కొత్తగానే కనిపిస్తోంది. దీంతో మీరు మారిపోయారు సార్.. అంటూ జనాలు సీఎం చంద్రబాబు మీద పొగడ్తలు గుప్పిస్తున్నారు.