AP Politics, YS Jagan : ఏపీకి గెస్ట్‌లా మారిన జగన్.. సొంత పార్టీ కార్యకర్తల ఫైర్..
ఏపీలో విచిత్రమైన సంస్కృతి ఒకటి కనిపిస్తోంది. పార్టీ అధినేతలు ఎవరైనా సరే.. అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే రాష్ట్రంలో కనిపిస్తున్నారు.
ఏపీలో విచిత్రమైన సంస్కృతి ఒకటి కనిపిస్తోంది. పార్టీ అధినేతలు ఎవరైనా సరే.. అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే రాష్ట్రంలో కనిపిస్తున్నారు. ఒక్కసారి ఓడిపోయామా.. అధికారం పోయిందా.. బైబై ఏపీ (Bye Bye AP) అనేస్తున్నారు. 2019వరకు చంద్రబాబు (Chandrababu) సీఎంగా ఉన్నప్పుడు జగన్ (YS Jagan) అదే చేస్తే.. ఆ తర్వాత వైసీపీ (YCP) హయాంలో చంద్రబాబు కూడా అదే ఫాలో అయ్యారు. ఇప్పుడు మళ్లీ జగన్ పాత తీరునే ఫాలో అవుతున్నారు. ఏపీకి అలా వచ్చి ఇలా వెళ్తున్నారు. ఇంకా చెప్పాలి అంటే.. గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తున్నారు. 151 సీట్ల నుంచి 11స్థానాలకు పడిపోయి కార్యకర్తలంతా డీలా పడిపోతే.. వాళ్లకు ధైర్యం నింపాల్సింది పోయి.. ఈ అతిధి పాత్రలేంటి జగన్ అంటూ.. సొంత పార్టీ కార్యకర్తలే విమర్శలు గుప్పిస్తున్నారు. వైనాట్ 175 అనే నినాదంతో ఈ ఎన్నికలకు వెళ్లిన జగన్‌కు.. ఫలితాలు డైజెస్ట్ కావడం లేదు అనుకుంటా బహుశా ! ఓటమి నుంచి పూర్తిగా తేరుకున్నట్లు కనిపించడం లేదు.
అందుకే ఏపీ కంటే బెంగళూరులోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. జగన్ మరోసారి బెంగళూరు వెళ్లారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత 45 రోజుల గ్యాప్‌లో జగన్ బెంగళూరు వెళ్లడం ఇది మూడోసారి. జూన్ 4న ఫలితాలు వచ్చాయ్. 12న ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. జూన్ 19న ఆయన పులివెందులకు వెళ్లారు. అక్కడ మూడురోజులు ఉండి 24న జగన్ బెంగళూరుకు వెళ్లారు. ఆ తర్వాత జులై 1న తాడేపల్లికి తిరిగి వచ్చారు. ఆ తర్వాత జులై 15న రెండోసారి బెంగళూరు వెళ్లారు. ఆ రోజు నుంచే తాడేపల్లిలో జగన్ ప్రజాదర్బార్ నిర్వహిస్తారని పార్టీ వర్గాలు చెప్తూ వచ్చాయ్. అయితే అనుకోకుండా ఆయన అదే రోజు బెంగళూరు వెళ్లిపోయారు జగన్.
వినుకొండలో రషీద్ ఫ్యామిలీ (Rashid Family) ని పరామర్శించేందుకు కూడా అక్కడి నుంచే నేరుగా వచ్చారు. పరామర్శించారు. తాడేపల్లికి అలా వచ్చి.. కార్యకర్తలను ఇలా కలిసి.. మళ్లీ అలా బెంగళూరు వెళ్లిపోయారు జగన్. మరో వారం రోజులు జగన్ అక్కడే ఉంటారని తెలుస్తోంది. ఐతే ఆయన పదేపదే బెంగళూరు వెళ్లడాన్ని ప్రత్యర్థి పార్టీలు అవకాశంగా మార్చుకుంటున్నాయ్. అప్పుడు చంద్రబాబు, పవన్‌ను నానా మాటలు అన్నారు కదా.. ఇప్పుడు జగన్ చేస్తున్నదేంటి అని నిలదీస్తున్నాయ్. ఇదంతా ఎలా ఉన్నా.. జగన్‌కు గతంలో కాలికి దెబ్బ అయిందని.. అది పూర్తిస్థాయిలో సెట్ కాలేదని.. చికిత్స కోసమే బెంగళూరు వెళ్తున్నారని పార్టీ నేతలు అంటున్నారు. మన దగ్గర ఆసుపత్రులు లేవా.. చికిత్స లేదా.. ఆపరేషన్ కోసం అక్కడికే వెళ్లాలా అని మరో లాజిక్ తీస్తున్నారు ప్రత్యర్థి పార్టీ నేతలు.