YCP Government : ఇండస్ట్రీలో వీళ్లు ఫినిష్‌..! కెరీర్‌కు ఇక శుభం కార్డేనా..

రాష్ట్రంలో ప్రభుత్వం మారింది అంటే.. చాలా మారుతాయ్. రాజకీయాలు మారతాయ్‌, పరిస్థితులు మారతాయ్.. చివరికి పలకరింపులు కూడా మారతాయ్.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 7, 2024 | 09:54 AMLast Updated on: Jul 07, 2024 | 9:54 AM

They Finish In The Industry Is It A Good Card For Career

 

 

రాష్ట్రంలో ప్రభుత్వం మారింది అంటే.. చాలా మారుతాయ్. రాజకీయాలు మారతాయ్‌, పరిస్థితులు మారతాయ్.. చివరికి పలకరింపులు కూడా మారతాయ్. అధికారం శాశ్వతం అనుకొని అడ్డగోలుగా మాట్లాడితే.. బతుకులు కూడా మారిపోతాయ్‌. ఆ ముగ్గురి పరిస్థితి ఇప్పుడు దాదాపుగా అలానే ఉంది. ముగ్గురిలో ఒక్కటి ఎఫెక్ట్ కాస్త తక్కువే ఉన్నా.. వైసీపీ హయాంలో ఆ ఇద్దరు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. సినిమా ఇండస్ట్రీ వాళ్లం అని మరిచిపోయారే.. లేదంటే గుర్తొచ్చి వినయంగా జీవించారో తెలియదు కానీ.. హద్దులు దాటారు.

ఇప్పుడు అనుభవిస్తున్నారు. వాళ్లే.. పోసాని, అలీ, రోజా. ఈ ముగ్గురి పరిస్థితి దాదాపు అయిపోయినట్లే ! వైసీపీకే భవిష్యత్ లేదని టాక్ నడుస్తున్న వేళ.. ఈ ముగ్గురి పరిస్థితి మరింత దారుణం అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. సినిమా ఇండస్ట్రీకి, రాజకీయాలను విడదీయలేని బంధం ఉంటుంది. సినిమాల్లోంచి రాజకీయాలకు వచ్చిన వారు ఉన్నారు.. రాష్ట్రాన్ని శాసించిన వారు ఉన్నారు. అలాగే రాజకీయాలు చేస్తూ సినిమాల్లో కొనసాగిన వారు ఉన్నారు. ఐతే ఈ ముగ్గురు మాత్రం అటు సినిమా, రాజకీయాలకు పనికిరాని పరిస్థితికి వచ్చారు. ఇక వీళ్ల కెరీర్‌కు ఎండ్ కార్డు పడినట్లే అనే చర్చ జరుగుతోంది. నటుడు అలీ.. దాదాపు పాతికేళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు.

టీడీపీ నుంచి జనసేన.. అక్కడి నుంచి వైసీపీ.. జంపింగ్ జపాంగ్ అన్నారు. పాపం.. ఎక్కడా ఆయనకు న్యాయం జరగలేదు. చూద్దాం అన్నవాళ్లే తప్ప.. పదవి ఇచ్చిన వాళ్లు లేరు. టీడీపీ నుంచి వైసీపీ వరకు.. ప్రతీ పార్టీలో ఇలాంటి అనుభవమే ఎదురైంది. కట్‌ చేస్తే ఇక రాజకీయాలు వద్దు అని డిసైడ్ అయిన.. వైసీపీకి రాజీనామా చేశారు. పోనీ సినిమాల్లో అవకాశాలు వస్తాయా అంటే.. ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఇండస్ట్రీ నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా.. ఇప్పుడు అలీని పలకరించడం లేదు. ఒకప్పుడు పవన్ సినిమాలో కచ్చితంగా ఉండే నటుల్లో అలీ ఒకరు. అలాంటిది ఇప్పుడు ఆయనకు పాత్రలు రావాలి అంటే.. మళ్లీ పవన్ దయ కావాల్సిందే ! లేదంటే కెరీర్‌కు శుభం కార్డు పడినట్లే. వైసీపీకి రాజీనామా చేసిన అలీ.. పవన్‌ను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారని తెలుస్తోంది. రేపేమాపో జనసేనలో చేరే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరి పవన్ కూల్ అవుతారా.. అలీకి దారి చూపిస్తారా అన్నది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది.

ఇక వివాదాలకు కేరాఫ్‌గా ఉండే పోసాని పరిస్థితి మరీ దారుణం. పవన్‌ కల్యాణ్ మాట ఎత్తితే చాలు.. మైక్ ముందు పెట్టుకొని వాలిపోయేవారు. కులాల వ్యవహారం నుంచి చిరంజీవి వరకు ప్రతీ విషయంలో ఘోరమైన కామెంట్లు చేయడం.. పవన్‌ను తీసిపారేయడం.. ఎన్నికల ముందు పోసాని ఇలానే కనిపించారు. కట్‌ చేస్తే.. వైసీపీ ఘోర పరాభవం మూటగట్టుకుంది. పోసాని అడ్రస్ గల్లంతయింది. విదేశాలకు పారిపోయాడని కొందరు… లేదు లేదు ఇంట్లోనే తాళాలు వేసుకొని దాక్కున్నారు అని మరికొందరు.. పోసాని విషయంలో కామెంట్లు చేస్తున్నారు. రాజకీయాలు ఎలాగూ పోయాయ్‌.. సినిమాలు అయినా చేస్తారా అంటే.. పోసాని పేరు చెప్తేనే ఇప్పుడు నిర్మాతలు అందరూ పారిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. నిజానికి పోసాని మంచి రైటర్ మాత్రమే కాదు.. మంచి యాక్టర్‌ కూడా ! అలాంటిది నోటి దూల అనాలో, అధినేత మీద వినయం అనాలో కానీ.. అడ్డగోలుగా నోరు జారి ఇప్పుడు అటు పొలిటికల్ కెరీర్‌ను, ఇటు సినిమా కెరీర్‌ను ప్రమాదంలో పడేసుకున్నారు. పవన్‌ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన పోసానికి సినిమా ఆఫర్లు వస్తాయి అని ఆలోచించడం కూడా దాదాపు అసాధ్యమే ! ఇక రోజా సంగతి సరేసరి. అసెంబ్లీ గేట్ కూడా తాకలేడు అంటూ పవన్‌కు సవాల్ విసిరింది. అలాంటిది వైసీపీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు పవన్‌. డిప్యూటీ సీఎం కుర్చీలో కూర్చున్నారు. సినిమాలు లేకపోయినా.. రాజకీయాల్లో అయినా కొనసాగుదాం అనుకుంటే.. సొంత పార్టీ నేతల నుంచే.. రోజాకు ప్రమాదం ఉంది.

నగరిలో రోజా పరాభవం వెనక.. వైసీపీ నేతలే కారణం అనే టాక్ ఉంది. అటు పొలిటికల్‌గా వరస్ట్‌ ఉంది పరిస్థితి.. సినిమాల్లో అయినా ప్రయత్నాలు చేద్దామంటే.. పవన్‌ను తిట్టిన రోజాకు పాత్రలు ఇచ్చే ధైర్యం.. ఏ డైరెక్టర్‌, ప్రొడ్యూసర్ చేసే అవకాశాలు ఉండవు. ఇలా ఈ ముగ్గురు.. ఇప్పుడు కెరీర్‌ను ప్రమాదంలో పడేసుకున్నారు. సినిమా అనేది ఇక వీళ్లకు దూరం అయినట్లే.. ఇక వీళ్లకు టీవీ షోలు మాత్రమే దిక్కు. మరి ఆ చాన్స్ అయినా వస్తుందా.. రానిస్తారా అంటే.. కాలమే సమాధానం చెప్పాలి.