Devineni Uma : మైలవరంలో ఉమకి షాక్.. బోడేకే పెనమలూరు టిక్కెట్
ఆంధ్రప్రదేశ్ లో లోక్ సభ, అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులతో టీడీపీ మూడో జాబితాను రిలీజ్ చేసింది. ఇందులో 11 అసెంబ్లీ స్థానాలతో పాటు 13 ఎంపీ సీట్లకు కూడా అభ్యర్థులను టీడీపీ (TDP) హైకమాండ్ ప్రకటించింది. మైలవరం నియోజకవర్గంలో మాజీ మంత్రి దేవినేని ఉమకు షాక్ ఇచ్చింది.
ఆంధ్రప్రదేశ్ లో లోక్ సభ, అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులతో టీడీపీ మూడో జాబితాను రిలీజ్ చేసింది. ఇందులో 11 అసెంబ్లీ స్థానాలతో పాటు 13 ఎంపీ సీట్లకు కూడా అభ్యర్థులను టీడీపీ (TDP) హైకమాండ్ ప్రకటించింది. మైలవరం నియోజకవర్గంలో మాజీ మంత్రి దేవినేని ఉమకు షాక్ ఇచ్చింది. ఆ సీటును ఈమధ్యే వైసీపీ (YCP) నుంచి టీడీపీలోకి వచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కు కేటాయించింది. మైలవరంలో దేవినేని ఉమ ఇప్పటి వరకూ ఐదుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. నాలుగు సార్లు గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు. గత 2019 ఎన్నికల్లో వసంత కృష్ణ ప్రసాద్ (Vasantha Krishna Prasad) పై పోటీ చేసి ఓడిపోయారు. ఉమ ఓటమితో పాటు పార్టీలో ఆయనపై అసంతృప్తి కూడా ఉండటంతో ఈసారి టీడీపీ అధిష్టానం టిక్కెట్ ఇవ్వకుండా పక్కనపెట్టేసింది. వసంత పార్టీలోకి రాకుండా, మైలవరం టిక్కెట్టు తనకే దక్కేలా దేవినేని ఉమ (Devineni Uma) చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. కనీసం పెనమలూరు టిక్కెట్టు అయినా వస్తుందని ఉమ వర్గం ఆశించింది. కానీ ఆ టిక్కెట్ ను బోడే ప్రసాద్ కు కేటాయించింది టీడీపీ.
పెనమలూరు (Penamalur) సీటుపై ఉత్కంఠ వీడిపోయింది. ఎట్టకేలకు బోడే ప్రసాద్ (Bode Prasad) కు సీటు కేటాయించింది టీడీపీ అధిష్టానం. మొదట బోడేకు సీటు ఇవ్వలేమని చంద్రబాబు చెప్పారు. అయితే స్వతంత్ర్య అభ్యర్థిగా అయినా సరే దిగి… చంద్రబాబు ఫోటోతో ప్రచారం చేసుకుంటానని బోడే ప్రసాద్ పట్టుబట్టారు. పెనమలూరు కోసం అనేక పేర్లను పరిశీలించిన టీడీపీ అధిష్టానం చివరకు బోడేనే సెలక్ట్ చేసింది. తనకు టిక్కెట్టు ఇవ్వడంపై బోడే ప్రసాద్ సంతోషం వ్యక్తం చేశారు. మూడోసారి తనకు అవకాశం కల్పించిన చంద్రబాబు, లోకేష్ కు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. పెనమలూరు సీటు భారీ మెజారిటీతో గెలిచి బహుమతి ఇస్తానన్నారు బోడే ప్రసాద్. సర్వేపల్లి టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ (Somireddy Chandramohan) రెడ్డిని ప్రకటించారు. టీడీపీ సీనియర్ నేత అయిన సోమిరెడ్డికి మొదటి రెండు జాబితాల్లో టిక్కెట్టు రాలేదు. స్థానిక నేతల రిక్వెస్ట్ తో ఆయనకే ఇచ్చింది టీడీపీ అధిష్టానం. టీడీపీ ఎంపీ అభ్యర్థుల్లో వైసీపీ నుంచి వచ్చిన లావు శ్రీకృష్ణ దేవరాయులు (Sri Krishna Deva Raya) కు నరసరావుపేట ఎంపీ టిక్కెట్ ఇవ్వగా… మరో లీడర్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి నెల్లూరు లోక్ సభ స్థానాన్ని కేటాయించింది టీడీపీ.