Top story: సోషల్ సైకోలు, ఎవర్రా మీరంతా.. ఇంత దారుణంగా ఉన్నారు..

పురాణాల్లో రాక్షసులుండేవారు.. వారెప్పుడో అంతరించిపోయారనుకున్నారు కానీ లేదు వారంతా బతికే ఉన్నారు. ఇప్పుడు సోషల్ శాడిస్టుల రూపంలో జనంపై పడుతున్నారు. సిగ్గు, శరం, ఉచ్చం-నీచం లేని ఆ దరిద్రులు సోషల్ మీడియాలో సైకోల్లా చెలరేగిపోతున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 12, 2025 | 11:43 AMLast Updated on: Apr 12, 2025 | 11:43 AM

Vulgar Comments On Social Media

పురాణాల్లో రాక్షసులుండేవారు.. వారెప్పుడో అంతరించిపోయారనుకున్నారు కానీ లేదు వారంతా బతికే ఉన్నారు. ఇప్పుడు సోషల్ శాడిస్టుల రూపంలో జనంపై పడుతున్నారు. సిగ్గు, శరం, ఉచ్చం-నీచం లేని ఆ దరిద్రులు సోషల్ మీడియాలో సైకోల్లా చెలరేగిపోతున్నారు. తమ స్వార్ధ రాజకీయాల కోసం ఇళ్లలోని ఆడవారి పరువును నడిరోడ్డుపై నగ్నంగా నిలబెడుతున్నారు. ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు అందరిదీ అదే తీరు…! ఎవరూ శుద్ధపూసలు కాదు… అన్నీ ఒకే తాను ముక్కలు

రేయ్ ఎవర్రా మీరంతా… ఏపీ రాజకీయాలను మరీ ఇంత చెండాలం చేసిపారేశారు. ఇంతకు మించి ఇక దిగజారడానికి లేదులే అని అనుకున్న ప్రతిసారీ అంతకు మించి అన్నట్లు మరీ ఇంత వల్గర్‌గా తయారవుతున్నారు. రాజకీయం అంటే సోషల్ సైకోయిజంలా మారిపోయింది పరిస్థితి. మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ భార్య భారతిపై అసహ్యకరమైన వ్యాఖ్యలు చేసిన ఓ సోషల్ సైకోను పోలీసులు అరెస్ట్ చేశారు. అతనొక్కడే కాదు సోషల్ శాడిస్టులు మన దగ్గర వేలమంది ఉన్నారు. ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు. అన్ని పార్టీలు అలాగే తయారయ్యాయి. గతంలో అధికారంలో ఉన్నప్పుడు వాళ్లు చేస్తే ఇప్పుడు వీళ్లు చేస్తున్నారు. వాళ్లు చంద్రబాబు ఇంట్లో ఆడవాళ్లను రోడ్డుపైకి లాగితే.. వీరు ఇప్పుడు జగన్ ఇంట్లోవారిని ఇలా టార్గెట్ చేశారు.. మరీ ఇంత దారుణంగా తయారయ్యారేంటో…! నువ్వు ఒకటి రాస్తే నేను నాలుగు కూస్తా అన్నట్లు తయారయ్యారు ఈ వెధవలు… ఈ సోషల్ రాక్షసుల వెనక ఉన్నది ఆ పార్టీల పెద్దలే కావడం మరో దారుణం.

ఈ చేబ్రోలు కిరణ్, వర్రా రవీందర్‌రెడ్డి, బోరుగడ్డ అనిల్ వీరంతా ఎవరు…? ఎక్కడి నుంచి వచ్చారు…? మరి వీరి వెనక ఉన్నది ఎవరు….? ఈ పార్టీలు కాదా…! రాజకీయాలు చేయడం చేతకాక ఇలా ఆడవారిని అసభ్యకరంగా రోడ్డుకు లాగుతుంటే ఆపే పని అవి ఎందుకు చేయవు…? టీడీపీ ఇప్పుడు మేం ఐటీడీపీ కార్యకర్తను అరెస్ట్ చేశామని చెప్పుకోవచ్చు… ఇలాంటివి సహించం అని సంకేతాలు పంపొచ్చు కానీ ఇలాంటి సైకోలు శృతిమించేదాకా ఎందుకు కంట్రోల్ చేయలేదు..? ఈ రోజు భారతమ్మపై ఇలాంటి కారుకూతలు కూశాడని వైసీపీ వాళ్లు రగిలిపోతున్నారు. మరి ఆనాడు నారా భువనేశ్వరిపై పేలిన అవాకులు చెవాకుల సంగతేంటి…? షర్మిల వ్యక్తిత్వాన్ని దిగజార్చేలా పెట్టిన చెత్తపోస్టుల సంగతేంటి…? మరి ఆ రోజుల్లో పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని తలదించుకునేలా చేయలేదా…? ఆ పార్టీల నేతలు దిగజారి వ్యాఖ్యలు చేస్తుంటే ఈ సోషల్ సైకోలు మరింత రెచ్చిపోయారు. ఇప్పుడు అదే పని టీడీపీ చేస్తోంది. నాడు మన ఇంట్లో వారిని అన్నప్పుడు మనం ఎంత బాధపడ్డామో వారికి గుర్తులేదా….? నాడు వారు తప్పుడు పనులు చేశారని చెప్పే మనం ఇప్పుడెందుకు అదే తప్పు చేస్తున్నాం…? అప్పట్లో ఓ మహిళ సోషల్ మీడియాలో పవన్ కల్యాణ్‌ను అరేయ్ ఒరేయ్ అంటుంటే వైసీపీ అడ్డుకోలేదు… ఓ నటుడు అదే స్థాయిలో కారుకూతలు కూస్తుంటే తమ ఛానల్‌లో గంటలు గంటలు లైవ్ ఇచ్చింది. ఆ రోజే ఇది తప్పని చెప్పి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదుగా… ఆ రోజు ఆ తప్పు చేయకపోయి ఉంటే ఈ రోజు టీడీపీని మరింత గట్టిగా గల్లా పట్టుకుని అడిగే అవకాశం ఉండేదిగా…!అలా చేయలేదు కాబట్టే ఇప్పుడు టీడీపీని నిలదీసే హక్కు వైసీపీకి లేకుండా పోయింది.

ఈ సైకోలను పెంచి పోషిస్తున్నది ఎవరు…? ఈ పార్టీలు కాదా…? వాళ్లు ఎక్కడుంటారో తెలియదు… ఎలా ఉంటారో తెలియదు.. కానీ పోస్టులు మాత్రం పెట్టేస్తారు. ఇలాంటి శాడిస్టులను నెలకు ఇంత అని ఇచ్చి మరీ పందుల్లా మేపుతున్నది, మేపింది ఈ పార్టీలే కాదా…? వాళ్ల తప్పుడు కూతలకు ఇంత అని లెక్కగడుతోంది ఎవరు….? ఎంత చెత్త రాస్తే అంత ముట్టచెబుతున్నది ఎవరు…? తమ స్వార్థం కోసం ఇలాంటి సైకోలను జల్లెడ పట్టి మరీ వెతికట్లేదా పార్టీలు..?

చేతిలో ఫోన్ ఉంటే చాలు.. ఎవరిపై పడితే వారిపై, ఏది పడితే అది రాసేయడమే. నిజానిజాలు అవసరం లేదు. ఆధారాలు చూపాల్సిన అవసరం లేదు. మన నోటికి వచ్చిన కారుకూతలు కూయడమే నేటి ట్రెండై కూర్చుంది. ఎవరి వ్యక్తిగత జీవితాల్లోకైనా చొరబడొచ్చు… ఎవరికి ఎవరితో అయినా రంకు అంటగట్టొచ్చు… మనల్ని ఎవడూ ఆధారాలు అడగడు కదా…! వినలేని, చదవలేని స్థాయికి రాతలు దిగజారిపోయాయి. ఎవడో ఒకడు ఏదో ఒకటి మాట్లాడతాడు. మిగిలిన వాళ్లు దానికి మసాలా దట్టించి జనంపై కి వదులుతారు.

పార్టీలన్నీ ఈ సోషల్ మీడియా సైకోలను ప్రోత్సహిస్తూ బురదలో కూరుకుపోయాయి. దాన్ని పట్టించుకోకుండా ఎదుటివారిని వేలెత్తి చూపితే ఊపయోగం ఉండదు. ఇప్పటికైనా ఈ సోషల్ రాక్షసుల్ని కంట్రోల్ చేయాలి. లేకపోతే ఈ అబద్దాలతోనే రేపు నంది కాస్తా పందైపోతుంది. ఏది నిజమో ఏది అబద్దమో తెలియని రోజులు ఇవి. నిజాన్ని మనం టైప్ చేసేలోపే అబద్దం, అశ్లీలతా అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్లను చుట్టేస్తోంది. కాబట్టి ఇలాంటి వాటికి ఇప్పుడే అడ్డుకట్ట వేయాలి. అమ్మ గురించి మాట్లాడితే అడ్డంగా కోసేయాలి…ఆడవారి గురించి అవాకులు చెవాకులు పేలి పరువుని రోడ్డుకు లాగితే అది నడిరోడ్డుపై వారిని నరికేయాలి. అప్పుడే వీరు కంట్రోల్‌లోకి వస్తారు. పార్టీలు అనుకుంటే అయిపోతుంది. కానీ అవి అలా అనుకుంటాయా… లేక ఎదురుదాడికి దిగి ఇంకాస్త దిగజారిపోతాయా….?