Gajuwaka YCP politics : గాజువాక వైసీపీలో వర్గ పోరు … రోడ్డుకెక్కిన నాగిరెడ్డి, చందు వర్గీయులు !

గాజువాక (Gajuwaka) వైసీపీ (YCP) రాజకీయం (politics) రంగు మారుతోంది. ఎమ్మెల్యే నాగిరెడ్డి...సమన్వయకర్త చందు యాదవ్ మధ్య వర్గపోరు బజారు కెక్కింది. తాజా పరిణామాలతో వాతావరణం గందరగోళంగా మారుతోంది. సీటు ఫైట్ ముదిరి ఎమ్మెల్యే వెర్సెస్ కో - ఆర్డినేటర్‌ గ్రూపులుగా విడిపోయింది పార్టీ. ఇన్నాళ్ళు ఎమ్మెల్యే ను గురువుగా సంబోధించిన చందు యాదవ్ ఇప్పుడు తిరుగుబాటు బావుటా ఎగరేయడం అధికార పార్టీని కలవరపరుస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 5, 2024 | 11:50 AMLast Updated on: Mar 05, 2024 | 11:50 AM

War Of Factions In Gajuwaka Ycp Nagireddy And Chandu Vargiyula Are On The Road

గాజువాక (Gajuwaka) వైసీపీ (YCP) రాజకీయం (politics) రంగు మారుతోంది. ఎమ్మెల్యే నాగిరెడ్డి…సమన్వయకర్త చందు యాదవ్ మధ్య వర్గపోరు బజారు కెక్కింది. తాజా పరిణామాలతో వాతావరణం గందరగోళంగా మారుతోంది. సీటు ఫైట్ ముదిరి ఎమ్మెల్యే వెర్సెస్ కో – ఆర్డినేటర్‌ గ్రూపులుగా విడిపోయింది పార్టీ. ఇన్నాళ్ళు ఎమ్మెల్యే ను గురువుగా సంబోధించిన చందు యాదవ్ ఇప్పుడు తిరుగుబాటు బావుటా ఎగరేయడం అధికార పార్టీని కలవరపరుస్తోంది. ఎమ్మెల్యే నాగిరెడ్డి వ్యవహార శైలి ఏమీ బాగోలేదనడమేగాక 2019 ఎన్నికల్లో లోకల్,నాన్ ఫీలింగ్ తీసుకొచ్చి ఆయన లబ్ధి పొందారని చందు ఆరోపించడంతో గాజువాక వైసీపీ గరం గరంగా ఉంది.

గాజువాకలో కాపు, యాదవ, గవర, మత్స్యకార, ముస్లిం మైనారిటీ ఓట్ బ్యాంక్ ఎక్కువ. 2019లో వైసీపీ క్యాస్ట్‌ కాంబినేషన్‌ను పక్కాగా వర్కౌట్‌ చేయడంతో పవన్‌కళ్యాణ్‌ మీద విజయం సాధించారు తిప్పల నాగిరెడ్డి. సరిగ్గా అయిదేళ్లు తిరిగే సరికి గాజువాకలో రాజకీయ ముఖచిత్రం మారింది. వచ్చే ఎన్నికల్లో కాపులు జనసేన,టీడీపీ (Janasena, TDP) కి మొగ్గు చూపుతారని అంచనాలు వున్నాయి. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే నాగిరెడ్డి సీటుకు గండి పడింది. తొలిజాబితాలోనే శాసనసభ్యుడికి షాక్ ఇచ్చింది హైకమాండ్. సామాజిక సమీకరణాలు లెక్కేసి యాదవ, కాపు కాంబినేషన్ వర్కవుట్ చేసి 70వ వార్డు కార్పొరేటర్ చందు యాదవ్ ను సమన్వయకర్తగా నియమించింది. ఈ పరిణామం ఊహించిందే అయినప్పటికీ ఎమ్మెల్యే వర్గం జీర్ణించుకోలేకపోయింది.

నాగిరెడ్డి (Nagireddy) కుమారుడు తిప్పల దేవన్‌రెడ్డిని గాజువాక సమన్వయకర్త బాధ్యతల నుంచి తప్పించడంతో అగ్గి రాజుకుంది. కొత్త సమన్వయకర్త చందు మంత్రి అమర్నాథ్ అనుచరుడు కావడంతో ఇక్కడ అసమ్మతి చాపకింద నీరులా విస్తరించింది. టికెట్ పై ఆశలు సన్నగిల్లిన ‘తిప్పల’ వర్గం మొదటి నుంచి చందు నాయకత్వాన్ని వ్యతిరేకిస్తోంది. ఈ పరిస్థితుల్లో కొత్తగా గాజువాక వైసీపీలో ఆసక్తికరమైన పరిణామాలు జరిగాయి. సీటురాక అలక బూనిన నాగిరెడ్డి కుమారుడు జనసేనలో చేరేందుకు సన్నాహాలు చేసుకున్నారు. అయితే ఎమ్మెల్యే మాత్రం పార్టీని వీడేది లేదని ప్రకటించడంతో పాటు యథావిధిగా నియోజకవర్గ కార్యకలాపాల్లో బిజీబిజీగా గడుపుతున్నారు. అదే సమయంలో సమన్వయకర్త చందు యాదవ్ నీడను సైతం ఎమ్మెల్యే వర్గం అంగీకరించడం లేదు. దీంతో రెండు వర్గాలు సై అంటే సై అంటున్నాయి.

చందు నాయకత్వంలో పనిచేయడం తమకు అవమానమని భావించిన ఎమ్మెల్యే ఫ్యామిలీ… పార్టీ పెద్దల ఎదుట పంచాయితీ పెట్టింది. తర్వాత సమన్వయకర్త మార్పు దిశగా ప్రచారం ఊపందుకుంది. ప్రత్యామ్నాయం కోసం ఎమ్మెల్యే వర్గం అభిప్రాయాలు సేకరించగా సమన్వయకర్త చందు తప్ప ఎవరి నాయకత్వమైనా సమ్మతమేనని అంగీకారం కుదిరిందట. జిల్లాలో యాదవులకు ప్రాతినిధ్యం లేనందున గాజువాక సీటును వాళ్లకు ఇచ్చేయడం సరైన స్ట్రాటజీ అనే అభిప్రాయం చుట్టూ చర్చ జరిగింది. దీంతో సీటు రేసులోకి అనూహ్యంగా మేయర్ హరి వెంకట కుమారి పేరు వచ్చింది. టీడీపీ యాదవులకు టిక్కెట్ ఇస్తే… అదే సామాజిక వర్గానికి ఛాన్స్ అనేది ఇక్కడ లాజిక్. పైగా బొత్స ఝాన్సీ ఎంపీ అభ్యర్థిత్వం ఖరారు కావడంతో కాపు, యాదవ లెక్కలు సరిపోతాయనే అనుకున్నారు. ఈ వ్యవహారం నలుగుతుండం గానే సీటు నాదేనంటూ మళ్ళీ నాగిరెడ్డి లాబీయింగ్ విస్తృతం చేశారు.

పార్టీకి విధేయతతో పాటు సామాజికంగా, ఆర్ధికంగా తనకు వున్న బలాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరారట నాగిరెడ్డి. ఈ పరిణామాల నడుమ చందు ఆధ్వర్యంలో పార్టీ మీటింగ్‌ హాట్‌ హాట్‌గా జరిగింది. మరోవైపు సమావేశానికి వెళ్లకుండా పార్టీ కేడర్‌ను నియంత్రించేందుకు ప్రయత్నాలు చేసిందట ఎమ్మెల్యే వర్గం. హాజరైన నేతలు ఎమ్మెల్యే తిప్పల టార్గెట్‌గా ప్రసంగాలు చేయడంతో… వర్గ పోరు తారస్థాయికి చేరినట్లయిందంటున్నారు. దీంతో గాజువాక వైసీపీలో గజిబిజి ఎక్కువైంది. ఇక్కడ మార్పు అనివార్యం అనే సంకేతాలు వస్తుండగా ఎమ్మెల్యే నాగిరెడ్డి లేదా మేయర్ హరి వెంకటకుమారిలో ఒకరికి ఛాన్స్ రావొచ్చంటున్నారు. అదే జరిగితే చందుకు మేయర్ అవకాశం ఇస్తారని, సామాజిక సమీ కరణలు దెబ్బ తినకుండా జాగ్రత్త పడాలన్నది వైసీపీ అధినాయకత్వం ఆలోచనగా తెలిసింది. దీంతో జరుగుతున్న పరిణామాలను ఆసక్తిగా గమనిస్తోంది గాజువాక వైసీపీ కేడర్‌.