Mithun Reddy : పుంగనూరులో ఏం జరుగుతోంది.. మిథున్ రెడ్డి నెక్ట్స్ ఏంటి ?
ఏపీలో ఎన్నికలు పూర్తయినా.. వేడి మాత్రం ఇంకా చల్లారలేదు. ఎలక్షన్స్ అయిపోయినప్పటి నుంచి పుంగనూరులో వైసీపీ వర్సెస్ టీడీపీ ఫైట్ నడుస్తోంది.
ఏపీలో ఎన్నికలు పూర్తయినా.. వేడి మాత్రం ఇంకా చల్లారలేదు. ఎలక్షన్స్ అయిపోయినప్పటి నుంచి పుంగనూరులో వైసీపీ వర్సెస్ టీడీపీ ఫైట్ నడుస్తోంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి టార్గెట్‌గా టీడీపీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇక వైసీపీకి చెందిన పలువురు నేతలను టీడీపీలోకి చేర్చుకుంటూ…. పెద్దిరెడ్డికి షాక్ ఇచ్చేలా పావులు కదుపుతున్నారు. ఈ మధ్యే పుంగనూరులోని వైసీపీ కౌన్సిలర్లు షాకిచ్చారు. మున్సిపల్ చైర్మన్ అలీమ్ భాషతో సహా మిగతా కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. వీళ్లే కాకుండా పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు కూడా టీడీపీ కండువా కప్పుకున్నారు.
దీంతో క్షేత్రస్థాయిలో పరిస్థితి చక్కదిద్దాలని భావించిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి… కార్యకర్తలతో సమావేశాన్ని నిర్ణయించారు. అయితే ఈ సమావేశాన్ని అడ్డుకునేందుకు టీడీపీ శ్రేణులు రెడీ అవుతున్నారన్న సమాచారంతో… నియోజకవర్గంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే ఇంటిని చుట్టిముట్టారు. ఈ పర్యటనకు వెళ్తే పుంగనూరులో గొడవలు జరిగే అవకాశం ఉందనే సమాచారంతో… మిధున్ రెడ్డి పర్యటనకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. మిథున్ రెడ్డి ఇంటి చుట్టూ వందలాది మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేశారు. చిన్న గొడవ జరిగినా కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు.
ఐతే పోలీసుల తీరుపై మిథున్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమపై కక్షగట్టి కేసులు నమోదు చేస్తున్నారని.. ఎంపీగా సొంత నియోజకవర్గంలో తిరిగే హక్కు లేదా అని ప్రశ్నించారు. రాజకీయ దాడుల్లో గాయపడిన వారిని పరామర్శించకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. నియోజకవర్గ ప్రజలు ఓటేస్తేనే ఎంపీగా గెలిచానని…. అలాంటి వారిని పరామర్శించేందుకు వెళ్లొద్దటే ఎలా అని నిలదీశారు. గొడవలు చేయటానికి తాను పుంగనూరు వెళ్లటం లేదని చెప్పుకొచ్చారు. ఇలా టీడీపీ, వైసీపీ తగ్గేదే లే అంటున్నారు. దీంతో ఈ రచ్చ ఎక్కడికి వెళ్తుందన్నది ఆసక్తికరంగా మారింది.