కాదంబరి జెత్వానీ అసలు ఎవరు.. బ్యాగ్రౌండ్ ఏంటి.. వైసీపీకి ఎలా చిక్కింది?
కాదంబరి జెత్వానీ.. ఈ పేరు ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. అసలు ఎవరు ఈమె.. ఈమె చేసిన సినిమాలు ఏంటి.. జెత్వానీకి వైసీపీకి సంబంధం ఏంటి.. రాజకీయ క్రీడలో ఈమె ఎలా భాగం అయింది.. ఇలా రకరకాల ప్రశ్నలు ప్రతీ ఒక్కరిని వెంటాడుతున్నాయ్.
కాదంబరి జెత్వానీ.. ఈ పేరు ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. అసలు ఎవరు ఈమె.. ఈమె చేసిన సినిమాలు ఏంటి.. జెత్వానీకి వైసీపీకి సంబంధం ఏంటి.. రాజకీయ క్రీడలో ఈమె ఎలా భాగం అయింది.. ఇలా రకరకాల ప్రశ్నలు ప్రతీ ఒక్కరిని వెంటాడుతున్నాయ్. బాలీవుడ్‌తో పాటు తెలుగు, కన్నడ, మళయాళం, పంజాబీలో ఒక్కో సినిమాలో యాక్ట్ చేసింది జెత్వానీ. ఆమె నటి మాత్రమే కాదు.. డాక్టర్ కూడా !
కాదంబరి తండ్రి మర్చంట్ నేవీలో పనిచేయగా.. ఆమె తల్లి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేశారు. 1996 ఏప్రిల్ 20న గుజరాత్ అహ్మదాబాద్ లో పుట్టింది జెత్వానీ. 12ఏళ్ల వయసులోనే ఏడేళ్ల భరతనాట్యం కోర్సు పూర్తి చేసి… సర్టిఫికెట్ అందుకుంది. అహ్మదాబాద్‌లోని SHL మున్సిపల్ మెడికల్ కాలేజీ నుంచి ఎంబీబీఎస్ చేసింది. ఆర్బీఐలో పనిచేస్తున్న తల్లికి… ముంబై ట్రాన్స్‌ఫర్ కావడంతో అక్కడికి షిఫ్ట్ అయింది. సడ్డా అడ్డా అనే హిందీ సినిమాలో లీడ్ రోల్ చేసింది. 2014లో ఓయిజా అనే కన్నడ సినిమాలో నటించింది. తెలుగులో ఆట… మలయాళంలో ఐ లవ్ మీ, పంజాబిలో ఓ యారా ఐన్వయి ఐన్వయి లుట్ గయా అనే సినిమాల్లో యాక్ట్ చేసింది.
వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌తో.. జెత్వానీకి 2015లో పరిచయం ఏర్పడింది. అదే ఏడాది అతను పెళ్లి ప్రతిపాదన చేశాడని జెత్వానీ చెప్తోంది. ఐతే విద్యాసాగర్ బ్యాక్‌గ్రౌండ్ తెలిసి.. ఆ ప్రతిపాదన ఆమె తిరస్కరించిందట. అప్పటి నుంచి న్యూడ్ వీడియో కాల్స్, అసభ్యకర సందేశాలతో విద్యాసార్ వేధించేవాడట. 2024 ఫిబ్రవరిలో ఇబ్రహీంపట్నం పీఎస్‌లో విద్యాసాగర్ తనపై దొంగ కేసు పెట్టాడని… ముంబైలో కేసు విత్‌డ్రా చేసుకుంటే ఇక్కడ తనపై కేసు తీసివేస్తామని చెప్పారని.. ఇప్పటికీ కేసు విత్ డ్రా చేసుకోలేదని జెత్వానీ అంటోంది. తప్పుడు కేసులో తనను, తన కుటుంబాన్ని అరెస్ట్ చేసి నరకం చూపించారని.. జెత్వానీ కన్నీటి పర్యంతం అవుతోంది.
ఇంటర్నేషనల్ స్మగ్లర్లు, ఉగ్రవాదుల తరహాలో… తమను ఏపీ పోలీసులు అరెస్టు చేసి విమానంలో తీసుకొచ్చారని జెత్వానీ కుటుంబసభ్యులు అంటున్నారు. విశాల్ గున్నీ నేతృత్వంలో జెత్వానీని, ఆమె తల్లిదండ్రులను ఈ ఏడాది ఫిబ్రవరి 3వ తేదీన విజయవాడకు తీసుకొచ్చారు. మూడు రోజులపాటు వారిని ఇబ్రహీంపట్నంలోని వీటీపీఎస్ గెస్ట్‌హౌ్‌సలో ఉంచారు. తీవ్రంగా హింసించారు. ఫిబ్రవరి 6వ తేదీన కాదంబరిని రిమాండ్‌కు పంపించారు. రిమాండ్ ఖైదీగా ఉన్న ఆమెను చూసేందుకు.. ములాఖత్‌లు ఇవ్వకుండా జైలు అధికారులపై విజయవాడ పోలీసులు ఒత్తిడి చేశారు.
తన కుమార్తెకు నెలసరి వచ్చినప్పుడు శానిటరీ న్యాప్‌కిన్స్ పంపేందుకూ కూడా అంగీకరించలేదని జెత్వానీ తల్లి అంటున్నారు. ప్రభుత్వ పెద్దలు, ఐపీఎస్ అధికారులు బెదిరిస్తుండటంతో… తమ సన్నిహితులెవరూ సహాయం చేసేందుకు ముందుకు రాలేదన్నారు. ఇప్పుడు ఈ వ్యవహారం ఎలా బయటికి వచ్చిందో తమకు తెలియదని, తనను హింసించిన వైసీపీ నాయకుడు విద్యాసాగర్‌తోపాటు పోలీసు అధికారులపైనా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి జెత్వానీ విన్నవించుకుంటోంది.