PINNELLI VIDEO : పిన్నెల్లి వీడియో లీక్ చేసిందెవరు? లోకేశ్ కి ఎవరు ఇచ్చారు ?
ఏపీలో వైసీపీ (YCP) ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) ఈవీఎం (EVM) ధ్వంసం వ్యవహారం వివాదస్పదంగా మారింది.
ఏపీలో వైసీపీ (YCP) ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) ఈవీఎం (EVM) ధ్వంసం వ్యవహారం వివాదస్పదంగా మారింది. ఈ వీడియో బయటకు రావడంతో… ఈసీ ఆదేశాలతో ఆయన్ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు గాలించారు. ఈలోగా హైకోర్టులో పిన్నెల్లికి రిలీఫ్ దక్కింది. అయితే అసలు ఈ వీడియో ఎలా బయటకు వచ్చిందన్న దానిపై ఇప్పుడు పోస్ట్ మార్టమ్ జరుగుతోంది. మే 13న పోలింగ్ డే నాడు వెబ్ క్యాస్ట్ లో రికార్డయిన వీడియోని తాము రిలీజ్ చేయలేదని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా చెబుతున్నారు. ఈసీ పరిధిలో ఉండే ఈ వీడియో రిలీజ్ పై వైసీపీ (YCP) అనుమానాలు వ్యక్తం చేస్తోంది. హైకోర్టులో కూడా ఇదే ఇష్యూని బేస్ చేసుకొని పిన్నెల్లి లాయర్ వాదనలు వినిపించారు.
ఆ వీడియోను ఈసీ (EC) రిలీజ్ చేయనప్పుడు… అది ఫేక్ అయి ఉండొచ్చని కోర్టు దృష్టికి తెచ్చారు. పిన్నెల్లి వీడియో లీక్స్ వ్యవహారంపై సిట్ ఛీఫ్ వినీత్ బ్రిజ్ లాల్ ప్రస్తుతం విచారణ చేస్తున్నారు. ఈవీఎం ధ్వంసం వీడియోను మొదటగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది టీడీపీ (TDP) ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అని వైసీపీ చెబుతోంది. అందువల్ల లోకేశ్ (Nara Lokesh) ని ప్రశ్నించాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు గుంటూరుకు చెందిన ఓ పోలీస్ ఉన్నతాధికారి వీడియో లీక్ చేశారన్న అనుమానాలు వస్తున్నాయి. ఆ అధికారి టీడీపీకి అనుకూలడన్న ముద్ర ఉంది. పోలింగ్ తర్వాత జరిగిన హింసలో కూడా ఆ పోలీస్ అధికారి టీడీపీకి అనుకూలంగా వ్యవహరించాడని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆయనే ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం వీడియోను వెబ్ క్యాస్ట్ నుంచి తీసుకొని నారా లోకేశ్ కి పంపినట్టు ఆరోపిస్తున్నారు.
ఈసీకి తెలియకుండా వీడియో లీకేజ్ అవడంపై కేంద్ర ఎన్నికల సంఘానికి వైసీపీ నేతలు కంప్లయింట్ చేశారు. దాంతో ఈ వ్యవహారం ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా మెడకు కూడా చుట్టుకుంటోంది. మాచర్ల ఏరియాలో మొత్తం 7 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు ధ్వంసం అయినట్టు మీనా ప్రకటించారు. కానీ పోలింగ్ జరిగిన రోజు, ఆ తెల్లారి ఈ విషయాన్ని ఆయన ఎందుకు బయట పెట్టలేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సిట్ రిపోర్ట్ తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది చూడాలి.