Why Chiru hates Ramoji : రామోజీ సంస్మరణకు చిరంజీవి ఎందుకు రాలేదు.. ప్రజా రాజ్యం పగ ఇంకా చల్లారలేదా ?

విజయవాడలో జరిగిన ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు సంస్మరణ సభకు మెగాస్టార్ చిరంజీవి హాజరుకాకపోవడంపై రక రకాల కామెంట్స్ వస్తున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 29, 2024 | 04:30 PMLast Updated on: Jun 29, 2024 | 4:30 PM

Why Didnt Chiranjeevi Come To Ramojis Commemoration

 

 

విజయవాడలో జరిగిన ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు సంస్మరణ సభకు మెగాస్టార్ చిరంజీవి హాజరుకాకపోవడంపై రక రకాల కామెంట్స్ వస్తున్నాయి. నిర్మాత అల్లు అరవింద్ కూడా రాకపోవడంతో… ప్రజారాజ్యం పార్టీకీ.. వీళ్ళిద్దరు గౌర్హాజరుకు లింక్ పెడుతున్నారు కొందరు.

సినీ పరిశ్రమకు సంబంధించి ఏ కార్యక్రమం జరిగినా అందులో మెగాస్టార్ చిరంజీవి తప్పకుండా ఉంటారు. అలాంటిది టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధం ఉన్న రామోజీరావు సంస్మరణ సభకు మెగాస్టార్ రాకపోవడం తీవ్ర చర్చకు దారితీసింది. టీడీపీ కూటమిలో భాగస్వామి అయిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాత్రమే విజయవాడలో జరిగిన ప్రోగ్రామ్ కి అటెండ్ అయ్యారు. తెలుగు సినీ పరిశ్రమ నుంచి రాజమౌళి, రాఘవేంద్రరావు, కీరవాణి, అశ్వినీదత్, సురేష్ బాబు లాంటి దిగ్గజాలు వచ్చినా… చిరంజీవి ఎందుకు రాలేదు. ఏపీ ప్రభుత్వం ఈ ప్రోగ్రామ్ ని అధికారికంగా నిర్వహించింది. మెగాస్టార్ తో పాటు అల్లు అరవింద్ కి ఆహ్వానం పంపినా అటెండ్ కాలేదన్న ప్రచారం సాగుతోంది.

2009లో చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినప్పుడు. ఈనాడు ఆ పార్టీ మీద పనిగట్టుకొని విష ప్రచారం చేసింది. ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ ఓడిపోయింది. ఉమ్మడి ఏపీలో ఓట్లు చీలడం వల్లే టీడీపీ ఓడిపోయిందనే అక్కసు… రామోజీరావులో కనిపించింది. అప్పట్లో చంద్రబాబు కూడా ఇదే విషయం చెప్పారు. అందుకే ప్రజారాజ్యం పార్టీని ఈనాడు ఏకిపారేసింది. చిరంజీవితో పాటు అల్లు అరవింద్ పైనా నెగిటివ్ న్యూస్ ఇచ్చింది. ఆ తర్వాత కొన్ని రోజులకే అదే ఈనాడులో జెండా ఎత్తేద్దాం… అనే హెడ్ లైన్ పెట్టి… ప్రజా రాజ్యం పార్టీని చిరంజీవి పీకేస్తున్నట్టు వార్త వచ్చింది. ఈ వార్తపై అప్పట్లో రామోజీరావు మీద చిరంజీవి సంచలన కామెంట్స్ చేశారు. మా జెండా పీకేయడానికి రామోజీరావు ఎవరు అంటూ ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకి రాకపోతే ఈనాడు సంస్థల అధినేత తట్టుకోలేరనీ… ఎన్టీఆర్ ని కూడా టీడీపీ నుంచి దూరం చేయడంలో రామోజీరావుదే ప్రముఖ పాత్ర అంటూ చిరంజీవి ఆరోపించారు. అప్పట్లో ఈనాడులో ఈ వార్త వచ్చాకే.. ప్రజారాజ్యం పార్టీ క్రమంగా నిర్వీర్యం అవుతూ వచ్చింది. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఈ విలీనాన్ని పవన్ కల్యాణ్ తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ కొన్ని దుష్ట శక్తుల వల్లే ఈ పరిస్థితి వచ్చిందని పవర్ స్టార్ కూడా ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజారాజ్యం పార్టీ నాశనానికి రామోజీరావు తన వంతు పాత్ర పోషించారన్న కోపం చిరంజీవికి ఇప్పటికీ ఉందని అంటారు. అందుకే ఆయన సంస్మరణ సభలకు హాజరు కావడం లేదని అంటున్నారు. ఈ మధ్యే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను సినీరంగానికి చెందిన పెద్దలంతా కలిశారు. వాళ్ళంతా రామోజీ సంస్మరణ సభకు వచ్చినా… వాళ్ళల్లో అల్లు అరవింద్ మాత్రం డుమ్మా కొట్టారు. ప్రజారాజ్యం విషయంలో రామోజీరావు, ఈనాడు వ్యవహరించిన తీరుపై కోపంతోనే ఆయన కూడా వెళ్ళలేదని అంటున్నారు.