Penamalure TDP : అందరూ పెనమలూరుకే ఎందుకో ? టీడీపీలో మొదలైన వర్గపోరు !
పెనమలూరు (Parthasaradhi) టీడీపీ (TDP) అభ్యర్థుల లిస్ట్ చాంతాడులా పెరిగిపోతోంది. అక్కడ పోటీ చేయాలని తమకు తాముగా ఉబలాటపడుతున్నవారు కొందరైతే... సర్లే... పెనమలూరులో చూద్దామని పార్టీ పెద్దలు ఆశపెడుతున్నవాళ్ళు మరికొందరు. దీంతో అందరికీ అదే ఎందుకన్న చర్చ మొదలైంది. వేరే చోట టిక్కెట్ దక్కే అవకాశాలు కూడా లేని వారి పేర్లు కూడా పెనమలూరు లిస్ట్ లో కనిపించడం లోకల్ హాట్ టాపిక్ అయింది.
పెనమలూరు (Parthasaradhi) టీడీపీ (TDP) అభ్యర్థుల లిస్ట్ చాంతాడులా పెరిగిపోతోంది. అక్కడ పోటీ చేయాలని తమకు తాముగా ఉబలాటపడుతున్నవారు కొందరైతే… సర్లే… పెనమలూరులో చూద్దామని పార్టీ పెద్దలు ఆశపెడుతున్నవాళ్ళు మరికొందరు. దీంతో అందరికీ అదే ఎందుకన్న చర్చ మొదలైంది. వేరే చోట టిక్కెట్ దక్కే అవకాశాలు కూడా లేని వారి పేర్లు కూడా పెనమలూరు లిస్ట్ లో కనిపించడం లోకల్ హాట్ టాపిక్ అయింది. టీడీపీ నుంచి ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ పడుతున్న లిస్ట్ లో ఉమ్మడి కృష్ణా జిల్లా మొత్తం మీద టాప్‌లో ఉందట పెనమలూరు. దీంతో… సర్వ రోగ నివారిణి జిందా తిలిస్మాత్‌లా… అందరికీ అదే మందా అంటూ పెనమలూరుపై సెటైర్స్ వినిపిస్తున్నాయి. ఇక్కడ టీడీపీ ఆశావహుల్లో అందరికంటే ముందున్నారు మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఇన్చార్జి బోడె ప్రసాద్. రేస్‌లో ఎవరున్నా… ఫైనల్‌గా మా నాయకుడిదే టిక్కెట్ అని అంటోంది బోడె వర్గం. కాదని వేరే వాళ్ళకు ఇస్తే సహాయ నిరాకరణకు కూడా సిద్ధమన్నది లోకల్ టాక్.
సిట్టింగ్ ఎమ్మెల్యే పార్థసారధి (Parthasaradhi) టీడీపీలో చేరుతున్నారన్న వార్తలు బయటికి వచ్చినప్పటి నుంచి టిక్కెట్ ఈసారి బోడె ప్రసాద్‌కు కాకుండా సారధికే ఇస్తారన్న ప్రచారం మొదలైంది. అందుకు ఒప్పుకోబోమంటూ చంద్రబాబు సమక్షంలోనే ఆందోళన చేశారు బోడె అనుచరులు. తర్వాత రోజుల్లో కొన్ని కారణాలతో సారధికి నూజివీడు టికెట్ కన్ఫామ్ అయిందన్న సమాచారంతో ఊపిరి పీల్చుకున్నారు బోడె. అయితే… తాను నూజివీడు వెళ్ళినా… నియోజకవర్గం మీద పట్టు తగ్గకుండా ఉండటం కోసం తన వర్గానికి చెందిన కమ్మ సామాజిక వర్గానికి చెందిన తుమ్మల చంద్రశేఖర్‌ను తెరమీదికి తెచ్చారట సారధి. వైసీపీ సర్కార్‌లో కమ్మ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ఉన్న చంద్రశేఖర్ ఆ పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్యేతో పాటు టీడీపీలో చేరడానికి సిద్ధమయ్యారు. దీంతో ఆయన కోసం ప్రతిపాదన పెట్టినట్టు సమాచారం. మరోవైపు మైలవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరడం దాదాపు ఖాయమైంది. వసంత మళ్ళీ మైలవరం నుంచే టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగుతారనేది ఆయన వర్గం చెబుతున్న మాట.
ఆయనకు మైలవరం సీటు ఇస్తే… అక్కడ టికెట్ దక్కని మాజీ మంత్రి దేవినేని ఉమా (Devineni Uma) ను పెనమలూరుకు మారుస్తారని మరో ప్రచారం జరుగుతోంది. వసంత, ఉమా ఇద్దరి పేర్లతో పెనమలూరులో టీడీపీ సర్వే చేయించటంతో పరిస్థితుల్ని బట్టి కృష్ణప్రసాద్‌ను పెనమలూరుకు పంపుతారా అన్న అనుమానాలు కూడా పెరుగుతున్నాయి పార్టీ వర్గాల్లో.. మైలవరంలో వసంత కృష్ణప్రసాద్ రాకను ఉమా వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇద్దరి మధ్య మాటల యుద్ధం కూడా గట్టిగానే జరుగుతోంది. ఉమాకే టికెట్ ఇవ్వాలని ఆయన వర్గం కోరుతున్నా… అధిష్టానం మాత్రం పెనమలూరులో ఉమా పేరుతో సర్వే చేయించడం ఇంట్రస్టింగ్‌గా మారింది. అదంతా ఒక ఎత్తయితే తాజాగా టీడీపీ, బీజేపీ (TDP-BJP) మధ్య పొత్తు పొడిచే అవకాశాలు పెరగడంతో తెరమీదకు మరో పేరు కూడా వచ్చి చేరిందట. టీడీపీ బెజవాడ ఎంపీ అభ్యర్ధిగా కేశినేని (Kesineni Chinni) పోటీ చేస్తారనేది ఇప్పటి వరకు ఉన్న మాట. అయితే పొత్తులో భాగంగా విజయవాడ ఎంపీ సీటును బీజేపీకి ఇస్తే… చిన్నిని పెనమలూరుకు పంపుతారన్నది లేటెస్ట్ టాక్.
మొత్తంగా ఎవరికి టికెట్ అన్న విషయంలో అధిష్టానం క్లారిటీ ఇవ్వకపోవటంతో పెనమలూరులో రోజుకోరకమైన ప్రచారం జరుగుతోంది. ఇది ఇలాగే కొనసాగితే… చివరికి టీడీపీలో పేచీలకు అడ్డాగా పెనమలూరు మారే అవకాశం ఉందన్నది స్థానికంగా వినిపిస్తున్న మాట. ఇక్కడ ఇంకో ఇంట్రస్టింగ్ పాయింట్ ఉంది. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న పేర్లన్నీ కమ్మ సామాజిక వర్గానికి చెందిన బలమైన అభ్యర్థులవే కావడంతో రేస్‌లో చివరికి ఎవరు నెగ్గుతారోనన్న ఆసక్తి పెరుగుతోంది. అధిష్టానం క్లారిటీ ఇచ్చే లోపు ఇంకెన్ని కొత్త పేర్లు తెర మీదికి వస్తాయోనన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్‌లో జరుగుతోంది. ఫైనల్ అభ్యర్థి ఎవరో చూడాలి మరి.