GNT NEGGEDEVARU : కేపిటల్ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా.. గుంటూరులో మళ్ళీ టీడీపీ గెలుస్తుందా..
ఏపీ (AP) లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో (General Elections) గెలుపు అంచనాలు తారస్థాయికి చేరుతున్నాయి... 2019 వైసీపీ (YCP) సునామీలో కూడా టీడీపీ (TDP) గెలిచిన నియోజకవర్గం కావడంతో... గుంటూరు (Guntur) లో ఈసారి మేమే గెలుస్తామని అధికార పార్టీ, లేదు ఈసారి మాదే సీటని ప్రతిపక్ష కూటమి... డంకా బజాయించి చెబుతున్నాయి.
ఏపీ (AP) లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో (General Elections) గెలుపు అంచనాలు తారస్థాయికి చేరుతున్నాయి… 2019 వైసీపీ (YCP) సునామీలో కూడా టీడీపీ (TDP) గెలిచిన నియోజకవర్గం కావడంతో… గుంటూరు (Guntur) లో ఈసారి మేమే గెలుస్తామని అధికార పార్టీ, లేదు ఈసారి మాదే సీటని ప్రతిపక్ష కూటమి… డంకా బజాయించి చెబుతున్నాయి. గుంటూరు అత్యంత ఆసక్తి రేపుతున్నపార్లమెంట్ స్థానం కావడంతో ఆ సీటు ఎవరు గెలుచుకుంటారన్న దానిపై ఆసక్తి సర్వత్రా కనిపిస్తోంది. ఓ వైపు అధికార పార్టీ మూడు రాజధానులు గ్యారెంటీ అంటుంటే… అమరావతిని కేపిటల్ చేస్తామని టీడీపీ అంటోంది. ఈ రెండు పార్టీల్లో గుంటూరులో నెగ్గేదెవరో చూడాలి.
గుంటూరు పార్లమెంట్ స్థానం (Parliament Elections) లో ఎవరు గెలుస్తారన్న చర్చ జోరుగా సాగుతోంది. వైసీపీ అభ్యర్థి కిలారు రోశయ్య గెలుస్తారా లేదంటే టీడీపీ అభ్యర్థి పెమ్మసాని గెలుపు జెండా ఎగురేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. గుంటూరులో దశాబ్ద కాలంగా జరగాల్సిన అభివృద్ధి అలాగే ఉంది. తెలుగుదేశంకి ఈ పార్లమెంట్ అత్యంత ప్రతిష్టాత్మకం. అత్యంత బలమైన ఓట్ బ్యాంకు కలిగింది ఉందని చెప్పుకోవచ్చు. గుంటూరు ఈస్ట్, వెస్ట్ నియోజకవర్గాలతో పాటు తెనాలి, ప్రత్తిపాడు, తాడికొండ, పొన్నూరు, మంగళగిరి నియోజకవర్గాలు ఈ పార్లమెంటు పరిధిలో ఉన్నాయి. గుంటూరు ఈస్ట్ ముస్లిం సామాజిక వర్గానికి పెట్టని కోటగా ఉంది. ఐదు నియోజకవర్గాల్లో కమ్మ, కాపు సామాజిక వర్గాలు గెలుపోటములను ప్రభావితం చేస్తాయి. ప్రత్తిపాడు, తాడికొండ నియోజకవర్గాలు ఎస్సీ రిజర్వుడు స్థానాలు.
గుంటూరు పార్లమెంట్‌లో 17 లక్షల 82 వేల మందికి పైగా ఓటర్లు ఉన్నారు. ఇందులో 14 లక్షల 12 వేల మంది ఓటర్లు ఈసారి ఓట్లు వేశారు. 2014లో 79.20 శాతం, 2019లో 79.21 పోలింగ్ శాతం నమోదైంది. తాజా ఎన్నికల్లో 78.81% శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. తాడికొండలో అత్యధికంగా 87.47 శాతం నమోదైతే…అత్యల్పంగా గుంటూరు పశ్చిమ లో 66.53% ఓట్లు పడ్డాయి. అంటే అర్బన్ ఓటర్ల కంటే గ్రామీణ ఓటర్లు చైతన్యవంతంగా ఓటు వేశారు. మంగళగిరిలో 85.74 శాతం, తెనాలిలో 76.16% మాత్రమే పోలింగ్ నమోదైంది. దీంతో గుంటూరు పార్లమెంట్ స్థానంలో ఎవరు గెలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
కాపు సామాజిక వర్గాల ఓటర్లు…గుంటూరు పార్లమెంట్‌లో గెలుపోటములను అత్యధికంగా ప్రభావితం చేస్తారు. ఇక్కడ టీడీపీ కమ్మ వర్గానికి చెందిన పెమ్మసాని చంద్రశేఖర్‌ను దించితే…అధికార పార్టీ కాపు సామాజిక వర్గం, పొన్నూరు ఎమ్మెల్యే కిలారు రోశయ్యను పోటీకి పెట్టింది. అమరావతే రాజధాని అని…పరిపాలన ఇక్కడి నుంచే చేస్తామంటూ తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించింది. అమరావతిని అభివృద్ది చేయడంతో పాటు మూడు రాజధానులు, మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయడమే ఎజెండాగా వైసీపీ ఎన్నికల క్యాంపెయిన్ చేసింది. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, గ్రామ గ్రామానా అందాయని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత రాజధాని ప్రాంతం అమరావతిలో కూడా గణనీయమైన అభివృద్ధి చేశామని అధికార పార్టీ చెప్పుకుంటోంది.
గుంటూరు పార్లమెంట్‌లో పోటీ చేస్తున్న అభ్యర్థుల గెలుపోటముల్లో ప్రధాన పాత్ర పోషించేది వ్యక్తిగత ప్రతిష్టే అంటున్నారు రెండు పార్టీల నాయకులు. పార్టీల ప్రతిష్ట కంటే ఇక్కడ వ్యక్తిగతంగా తాము ఎంత దూకుడుగా వ్యవహరించామన్న అంశమే విజయంలో కీలకమని అంచనా వేస్తున్నారు. అందుకే ఇక్కడి నుంచి ఎలాగైనా విజయం సాధించాలన్న ఆలోచనతో రెండు పార్టీల అభ్యర్థులు ఉన్నారు. పెమ్మసాని చంద్రశేఖర్ గడిచిన దశాబ్ద కాలంగా తెలుగుదేశంలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. బ్యాక్ ఎండ్‌లో టిడిపికి ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా చేస్తారన్న ప్రచారం ఉంది. అలాంటి వ్యక్తి తన ఎన్నికల అఫిడవిట్‌లో భారీగా ఆస్తులు ప్రకటించి సంచలనం సృష్టించారు. గుంటూరును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు పెమ్మసాని చంద్రశేఖర్.
ముగ్గురు నలుగురు అభ్యర్థులను మారుస్తూ వచ్చి…చివరకు కాపు సామాజిక వర్గానికి చెందిన కిలారు రోశయ్యను బరిలోకి దించింది వైసీపీ. గడిచిన రెండు ఎన్నికల్లో టీడీపీయే ఇక్కడి విజయం సాధించింది. 2014, 2019 ఎన్నికల్లో గల్లా జయదేవ్ గెలిచారు. ఆయన ఎన్నికలకు దూరంగా ఉండటంతో పెమ్మసాని పోటీ చేస్తున్నారు. గల్లా జయదేవ్… నియోజకవర్గంలో పెద్దగా అందుబాటులో లేరనీ… ఇప్పుడు కూడా టీడీపీ ఎక్కడి నుంచో అభ్యర్థిని దిగుమతి చేసుకొందని వైసీపీ విమర్శించింది. కిలారు రోశయ్య మాత్రం పక్కా లోకల్ అని…ఎక్కడికీ వెళ్లరని వైసీపీ ప్రచారం చేసుకుంది. గడిచిన ఐదేళ్లలో గుంటూరు పార్లమెంట్‌లో పెద్ద ఎత్తున సంస్కరణల తెచ్చామని అధికార పార్టీ చెబుతోంది.
వాస్తవ పరిస్థితులు చూస్తే… వైసిపి అభ్యర్థి కిలారు రోశయ్య కంటే టిడిపి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ముందంజలో ఉన్నారని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. అందుకు టిడిపి చేసిన అమరావతి రాజధాని అంశం ప్రధాన కారణం. అమరావతి ప్రాంతాన్ని సెంటిమెంట్‌గా చూపిస్తూ…టిడిపి అభ్యర్థి పెద్ద ఎత్తున ఓట్లు సంపాదించేందుకు ప్రయత్నించారు. మరోవైపు ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు లబ్ధి చేకూర్చాయని వైసీపీ భావిస్తోంది. స్థానికంగా ఉన్న ఎస్సీ, బీసీ ఓటర్లు వైసీపీకి అనుకూలంగా ఓటు వేస్తే, ఫలితం వైసిపి వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఏదేమైనా గుంటూరు పార్లమెంట్‌లో అటు అధికార పార్టీ, ఇటు ప్రతిపక్ష కూటమి ప్రతిష్టాత్మకంగా తీసుకొని పని చేశాయి. అభ్యర్థులు ఆర్థికంగా ఎంత దూకుడు ప్రదర్శించారు ? పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు సాధించబోయే ఫలితాలు కూడా విజయంలో కీలకంగా మారనున్నాయి.