NLR RURAL NEGGEDEVARU : కోటంరెడ్డి హ్యాట్రిక్ కొడతారా ? ఆదాల అడ్డుకుంటారా ?
ఆంధ్రప్రదేశ్‌లో 175 స్థానాలకు ఎన్నికలు జరిగినా...ప్రజల దృష్టి మాత్రం కొన్ని నియోజకవర్గాల మీదే ఉంది. ఎందుకంటే ఆ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల చరిత్ర, పార్టీల బలాబలాలు లాంటి అంశాలతో వార్తల్లోకి ఎక్కాయి.
ఈ ఎన్నికల్లో ప్రస్తుతం అందరి దృష్టి… నెల్లూరు రూరల్ (Nellore Rural) నియోజకవర్గం పై ఉంది. ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ సిట్టింగ్ ఎంపీ (Sitting MP) … టీడీపీ (TDP) లో చేరిన వైసీపీ (YCP) సిట్టింగ్ ఎమ్మెల్యే పోటీ పడుతుండటంతో… ఇక్కడ ఎవరు విజయం సాధిస్తారనే దానిపై జోరుగా చర్చ సాగుతోంది. ఇద్దరు నేతలూ.. పోటా పోటీగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఎత్తుకు పైఎత్తులు వేస్తూ… జనాన్ని ఆకట్టుకున్నారు. నెల్లూరు రూరల్ లో నెగ్గేదెవరు ?
ఆంధ్రప్రదేశ్‌లో 175 స్థానాలకు ఎన్నికలు జరిగినా…ప్రజల దృష్టి మాత్రం కొన్ని నియోజకవర్గాల మీదే ఉంది. ఎందుకంటే ఆ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల చరిత్ర, పార్టీల బలాబలాలు లాంటి అంశాలతో వార్తల్లోకి ఎక్కాయి. అలాంటి అసెంబ్లీ స్థానమే నెల్లూరు రూరల్ నియోజకవర్గం. నెల్లూరు నగరంలోని సగం ప్రాంతంతో పాటు నెల్లూరు రూరల్ మండలంలోని 30 గ్రామాల్లో… రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం విస్తరించింది. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో నెల్లూరు..సర్వేపల్లి… రాపూరు… నియోజకవర్గాల్లోని కొన్ని ప్రాంతాలను కలిపి… నెల్లూరు రూరర్‌ను ఏర్పాటు చేశారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఆనం వివేకానంద రెడ్డి… 3వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విజయం సాధించారు. ముచ్చటగా మూడోసారి పోటీ చేస్తున్నారు. 2014లో 25వేలు, 2019లో 22 వేల మెజార్టీ సాధించారు కోటంరెడ్డి.
నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలో 2 లక్షల 80 వేల మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ మగవాళ్ళ కంటే మహిళా ఓటర్లే ఎక్కువ. 2014లో 60.56 శాతం, 2019లో 60.56 పోలింగ్ శాతం నమోదైంది. ప్రస్తుత ఎన్నికల్లో 67.76 శాతానికి పెరిగింది. ఈ ఎన్నికల్లో మొత్తం లక్షా 90 వేల మంది ఓటు వేశారు. 2019లో గెలిచిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Sridhar Reddy) … వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ తరపున బరిలోకి దిగారు. ఆయన తరపున కుటుంబసభ్యులంతా క్యాంపెయిన్ చేశారు. నెల్లూరు రూరల్ పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి వైసీపీ నేతలను తన వైపునకు తిప్పుకున్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి జనానికి అందుబాటులో ఉండటం… సమస్యల పరిష్కారానికి కృషి చేయడం లాంటి అంశాలే కోటంరెడ్డిని గెలిపిస్తాయని టీడీపీ నేతలు చెబుతున్నారు. శ్రీధర్ రెడ్డికి మద్దతుగా టిడిపి అధినేత చంద్రబాబు, బాలకృష్ణ, లోకేష్ ప్రచారం చేశారు. పట్టణ ప్రాంతాల్లో వైసిపి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, ఉద్యోగులు, టీచర్లు, విద్యావంతులు…తమకు అనుకూలంగా ఓటు వేశారని టిడిపి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
గతంతో పోలిస్తే అధికంగా పోలింగ్ శాతం నమోదు కావడం కూడా తమకు కలిసొస్తుందని అభిప్రాయపడుతున్నారు. కోటంరెడ్డి పార్టీని వీడటంతో ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని రూరల్ నుంచి బరిలోకి దించింది వైసీపీ. తన అభ్యర్థిత్వం ఖరారయ్యాక… పెండింగ్ పనులకు నిధులను మంజూరు చేయించి…పూర్తి చేయించారు ఆదాల. నెల్లూరు లోక్‌సభ అభ్యర్థిగా విజయ సాయి రెడ్డి పోటీ చేయడంతో వైసీపీ కేడర్‌లో ఉత్సాహంగా పని చేసింది. 2014, 2019 ఎన్నికల్లో కోటంరెడ్డి విజయంలో కీలక పాత్ర పోషించిన…మలిరెడ్డి బ్రదర్స్‌ను వైసీపీలోకి తీసుకొచ్చారు. మలిరెడ్డి బ్రదర్స్ కి నియోజకవర్గంలో పట్టు ఉండటంతో…అది తమకు ప్రయోజనమే అంటున్నారు వైసీపీ నేతలు.
2014, 2019 ఎన్నికల్లో శ్రీధర్ రెడ్డి విజయానికి మలిరెడ్డి బ్రదర్స్.. కృషి చేశారు. ఇన్నాళ్లూ తెర వెనుక రాజకీయాలు నడిపిన వీరు…ఈసారి ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వచ్చారు. శ్రీధర్ రెడ్డి ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ఆదాల ప్రభాకర్ రెడ్డికి అండగా నిలిచారు. కోటంరెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డి దందాలు, అవినీతి, దోపిడీలను ఆదాల జనంలోకి తీసుకెళ్లారు. రూరల్ నియోజకవర్గంలో ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకునేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఆదాల చేసిన అభివృద్ధి పనులు, ప్రభుత్వ పథకాలు తమను సులభంగా గెలిపిస్తాయని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
సిట్టింగ్ ఎమ్మెల్యే కోటంరెడ్డి, వైసీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్‌రెడ్డి…ఎవరికి వారు తామే గెలుస్తామంటూ లెక్కలు వేసుకుంటున్నారు. తమ అనుచరులకు మనమే గెలుస్తున్నామని…భారీ మెజార్టీ వస్తుందని ఉత్సాహం నింపేందుకు ప్రయత్నిస్తున్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఏడు శాతం పోలింగ్ అధికంగా నమోదయింది. ఇదంతా తమకే కలిసి వస్తుందని వైసీపీ, టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు. ఎన్నికల్లో ఎవరికి ప్రజలు పట్టం కట్టారనేది కౌంటింగ్ రోజు బయటపడనుంది.