YS Family : రమ్మన్నారు… రోడ్డున పడేశారు.. వైస్ ఫ్యామిలీపై లీడర్ల అసహనం
అప్పుడు రమ్మన్నారు... ఇప్పుడు రోడ్డున పడేశారు... మమ్మల్ని వాడుకొని మీరు బాగు పడ్డారు. వేర్వేరు కుంపట్లు పెట్టుకొని మా బతుకులు అన్యాయం చేశారు.
అప్పుడు రమ్మన్నారు… ఇప్పుడు రోడ్డున పడేశారు… మమ్మల్ని వాడుకొని మీరు బాగు పడ్డారు. వేర్వేరు కుంపట్లు పెట్టుకొని మా బతుకులు అన్యాయం చేశారు. వైఎస్ ఫ్యామిలీపై వైసీపీ లీడర్లు, వైఎస్ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు వైసీపీకి ఓట్లేయమని చెప్పిన షర్మిల ఇప్పుడు వేరు కుంపటి పెట్టుకోవడం… విజయమ్మ వాళ్ళిద్దరికీ మద్దతు ఇవ్వడంపై వైసీపీ లీడర్లు రగిలిపోతున్నారు. మీకు మీకు ఆస్తి గొడవలు ఉంటే కోర్టుల్లో తేల్చుకోండి… చెరో పార్టీలో ఉండి మమ్మల్ని ఎటూ కాకుండా చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు.
వైఎస్ ఆకస్మిక మరణంతో ఆ కుటుంబానికి అండగా ఉన్న నేతలు ఇప్పుడు క్రాస్ రోడ్డులో నిలబడ్డారు. ఆ రోజున కాంగ్రెస్ లో మంచి పదవుల్లో ఉన్నవాళ్ళందర్నీ వైసీపీలోకి తీసుకొచ్చింది వైఎస్ ఫ్యామిలీ. మనకు అన్యాయం జరిగిపోయింది. జగన్ ని కాంగ్రెస్ మోసం చేసింది… మనం వైసీపీ పెట్టుకుందాం రండి… అంటూ అందర్నీ కాంగ్రెస్ నుంచి లాక్కెళ్ళారు జగన్ అండ్ ఫ్యామిలీ. అప్పట్లో విజయమ్మ, షర్మిల కూడా కాంగ్రెస్ ని అంటరాని పార్టీగా ముద్రవేశారు. ఓసారి అధికారం అనుభవించాక… ఇప్పుడు వైఎస్ ఫ్యామిలీలో ఎవరికి వారే అన్నట్టుగా తయారైంది. ఈసారి ఏపీలో వైసీపీ ఓటమికి వైఎస్ కుటుంబ సభ్యులే కారణమని మండిపడుతున్నారు లీడర్లు. జగన్ ని టార్గెట్ చేస్తూ షర్మిల చేస్తున్న రాజకీయం కరెక్ట్ కాదంటున్నారు వైసీపీ నేతలు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి షర్మిల తీరును తప్పుబట్టగా… మాజీ మంత్రి పేర్ని నాని కూడా ఆయనకు సపోర్ట్ ఇచ్చారు. ఒకప్పుడు పార్టీలోకి రాండి… నా కొడుకు జగన్ మీకు అండగా ఉంటాడని వైఎస్ విజయమ్మ చెప్పారు. కానీ అదే విజయమ్మ… కాంగ్రెస్ పార్టీలో ఉన్న షర్మిలకు ఓటెయ్యమని ఎన్నికల టైమ్ లో వీడియో విడుదల చేశారు.
వైఎస్ కుటుంబాన్ని నమ్ముకొని… విజయమ్మ భరోసాతో లక్షల మంది పార్టీలోకి వచ్చామని అంటున్నారు పేర్ని నాని. మీకు మీకు ఆస్తి గొడవలు ఉంటే కోర్టుల్లో తేల్చుకోండి… నమ్ముకున్న మమ్మల్ని బలిపశువులు చేస్తారా అని ప్రశ్నించారు. మీ కుటుంబ వ్యవహారాల కోసం ఇంతమందిని పతనం చేస్తారా అని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క కేతిరెడ్డి, పేర్ని నానియే కాదు… వైసీపీ కార్యకర్తలు, లీడర్లంతా ఇదే ఉద్దేశ్యంలో ఉన్నారు. నమ్ముకొని వచ్చిన వారిని నట్టేట ముంచారని వైఎస్ ఫ్యామిలీపై అసహనంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా జగన్ కి షర్మిల రూపంలో ఓట్ల చీలిక ముప్పు పొంచే ఉంది. వైఎస్సార్ అభిమానుల ఓట్లు చీలితే బాగుపడేది… టీడీపీ, జనసేన, బీజేపీయే అన్న ఆగ్రహం వైసీపీ లీడర్లలో కనిపిస్తోంది. కోర్టుల్లో తేల్చుకునే వ్యవహారాన్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చి తమకు అన్యాయం చేస్తున్నారని కోపంతో రగిలిపోతున్నారు. ఇప్పటికి ఇద్దరు లీడర్లు వైఎస్ ఫ్యామిలీపై అసహనం వ్యక్తం చేయగా… ఇంకెంతమంది బరస్ట్ అవుతారో చూడాలి.