YCP SOCIAL MEDIA : ఫోన్లు బ్లాక్ … ఇళ్ళు ఖాళీ వైసీపీ వారియర్స్ ఎక్కడ ?
వైఎస్సార్ కాంగ్రెస్ (YSR Congress) అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి చెందిన సోషల్ మీడియా వారియర్స్ చెలరేగిపోయారు.
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ (YCP) కి మరీ 11 సీట్లు రావడం… జగన్ అధికారం కోల్పోవడంతో ఆ పార్టీ సోషల్ మీడియా కంటికి కనిపించకుండా పోయింది. జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఊ… అంటే ఒంటి కాలిమీద లేచే వైసీపీ సోషల్ మీడియా (YCP Social Media) వారియర్స్ ఇప్పుడు మాయమయ్యారు. టీడీపీ, జనసేన నేతలకు భయపడి దాక్కున్నారా … లేదంటే ముఖం చూపించలేక గాయబ్ అయ్యారా అన్నది తెలియట్లేదు.
వైఎస్సార్ కాంగ్రెస్ (YSR Congress) అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి చెందిన సోషల్ మీడియా వారియర్స్ చెలరేగిపోయారు. టీడీపీ (TDP), జనసేన (Jana Sena) అధినేతలు బాబు, పవన్ తో పాటు మిగతా నేతలు, ఆ రెండు పార్టీలపై… ఏ చిన్న అవకాశం వచ్చినా దుమ్మెత్తి పోశారు. తమ పార్టీయే అధికారంలోకి వస్తుంది. జూన్ 9న విశాఖలో జగన్ ప్రమాణం అంటూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు. కానీ వైసీపీ దారుణంగా 11 సీట్లకు పడిపోవడంతో వారియర్స్ కి ముఖం చూపించుకోలేని పరిస్థితి ఏర్పడింది. వైసీపీ సోషల్ మీడియాను మొత్తం గవర్నమెంట్ అడ్వైజర్ సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల భార్గవ హ్యాండిల్ చేశాడు.
ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడన్నది తెలియట్లేదు. ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేసిన తర్వాత సజ్జల కుటుంబం అంతా హైదరాబాద్ కి వెళ్ళిపోయింది. కానీ భార్గవ ఇక్కడ కూడా లేడని టీడీపీ నేతలు చెబుతున్నారు. భార్గవ్ కాకుండా గుర్రంపాటి దేవేందర్ రెడ్డి, ఇంటూరి రవికిరణ్ రెడ్డి జాడ కూడా తెలియట్లేదు. కొందరు ఊళ్ళు వదిలి వెళ్ళిపోయారని టాక్. మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని చెప్పినట్టుగా వీళ్ళంతా భయంతో పారిపోయారా ? లేదంటే వైసీపీ ఓడిపోయింది కదా… ముఖం చూపించుకోలేక కనిపించకుండా పోయారా అన్నది తెలియట్లేదు. చంద్రబాబు, పవన్, లోకేష్, బాలకృష్ణ లాంటి నేతలను ఘోరంగా అవమానించిన… వైసీపీ సోషల్ మీడియా వారియర్స్ కోసం టీడీపీ శ్రేణులు మాత్రం వెతుకుతూనే ఉన్నాయి.