YCP Incharges : ఇంఛార్జులందరికీ టిక్కెట్లు ఇస్తారా ? వైసీపీ ఎమ్మెల్యేల్లో కొత్త టెన్షన్ !

కొత్తగా నియోజకవర్గాలకు ఇంఛార్జులుగా నియమితులైన వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఇప్పుడో కొత్త టెన్షన్ పట్టుకుంది. ఎన్నికల నాటికి తమకు టిక్కెట్లు ఇస్తారా ? లేదంటే పార్టీని గెలిపించడానికే ఇంఛార్జులను చేశారా ? ఎందుకంటే...సిట్టింగ్స్ మాత్రం ఎన్నికల నాటికి ఏదైనా జరగొచ్చు... తమకే వైసీపీ అధిష్టానం టిక్కెట్ ఇస్తుందని చెప్పుకుంటున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 13, 2024 | 10:02 AMLast Updated on: Jan 13, 2024 | 10:02 AM

Ycp Incharges ఇంఛార్జులందరికీ టిక్క

ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ (YCP) నియోజకవర్గాల ఇంఛార్జులను ఎడా పెడా మార్చేస్తోంది.  ఇప్పటికి 3 లిస్టులు అయిపోయాయి.  ఫోర్త్ లిస్ట్ కూడా ఉంటుందని చెబుతున్నారు.  దాంతో ఇంకా కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు టెన్షన్ పడుతున్నారు.  ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు జరిగాయి. కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలను పక్కనపెట్టిన జగన్… ఆయా నియోజకవర్గాల్లో కొత్తవాళ్ళకీ… స్థానం మార్చి కొందరికి అవకాశం ఇచ్చారు.   కానీ పార్టీ పక్కనబెట్టిన కొందరు సిట్టింగ్స్ మాత్రం తమ సీట్లపై ఆశలు వదులుకోవట్లేదు. అభిమానులతో భారీ బలప్రదర్శనలు చేస్తూ… ఇప్పుడు నియమించింది ఇంఛార్జులే… టిక్కెట్లు తమకే వస్తాయని కేడర్ కు భరోసా ఇస్తున్నారు.

నియోజకవర్గాల ఇంఛార్జులు అంటే ఏంటి ? వైసీపీని గెలిపించడానికి బాధ్యత తీసుకునే నాయకులా… లేదంటే… రేపు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులా…. వైసీపీ అధిష్టానం దృష్టిలో వాళ్ళంతా అభ్యర్థులే అన్నట్టు కనిపిస్తోంది. మార్పులు, చేర్పులతో కొత్తగా నియమితులైన వాళ్ళంతా పోటీలో ఉంటారు… వాళ్ళకే టిక్కెట్లు ఇస్తున్నారు. కానీ ఇంఛార్జ్ పదవి రానివాళ్ళు… సీటు మార్చినవాళ్ళు ఇప్పుడో కొత్త వాదన తెరపైకి తెచ్చారు.   ఇప్పుడు జగన్ నియమిస్తోంది… నియోజకవర్గాలకు ఇంఛార్జులను మాత్రమే… ఇంకా రెండు నెలలు టైమ్ ఉంది.  మనకే సీటు వస్తుంది… మీరేమీ కంగారు పడొద్దు అంటూ కొందరు సిట్టింగ్స్ తమ నియోజకవర్గాల్లోని అభిమానులు, వైసీపీ కార్యకర్తలకు భరోసా ఇస్తున్నారు.

YCP MLAS: టెన్షన్‌లో వైసీపీ ఎమ్మెల్యేలు.. ఏ నిమిషానికి ఏమి జరుగునో..!

పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణ చంద్ర ప్రసాద్ కు ఈసారి టిక్కెట్లు రాలేదు.  వాళ్ళ నియోజకవర్గాల్లో వేరే వాళ్ళని ఇంఛార్జులుగా నియమించారు జగన్.  కానీ వీళ్ళు తమ నియోజకవర్గాల్లో బలప్రదర్శనకు దిగారు. చంటి లోకల్ ఇక్కడ… పార్టీ బలమే కాదు… మాకూ బలం ఉంది చూసుకోండి అంటూ వైసీపీ అధిష్టానానికి సవాల్ విసురుతున్నారు. కర్నూలు ఎంపీ ఇంఛార్జ్ గా ప్రకటించిన మంత్రి జయరామ్ కూడా… తన అనుచరులకు ఇదే చెబుతున్నారు. తన సిట్టింగ్ సీటు ఆలూరు నుంచి మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తాననీ… ఎవరూ కంగారు పడొద్దని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ఎన్నికలకు ఇంకా రెండు, మూడు నెలల టైమ్ ఉంది.  నామినేషన్ల గడువు ముగిశాక కూడా అభ్యర్థులను మార్చే ఛాన్స్ ఉందని అంటున్నారు జయరామ్.

ఇంఛార్జులు అంటే వాళ్ళకే టిక్కెట్లు ఇస్తామని మాత్రం వైసీపీ అధిష్టానం కూడా క్లియర్ గా చెప్పలేదు. కానీ వాళ్ళకే అన్న సంకేతాలు మాత్రం వెళ్తున్నాయి. అయితే కొత్తగా ఎలాట్ అయిన ఇంఛార్జులు… ఎన్నికల నాటికి నియోజకవర్గం మొత్తం తిరగాలి… పార్టీ కార్యకర్తలను గ్రిప్ లో పెట్టుకోవాలి… ముఖ్యంగా సెకండ్ కేడర్ అంతా ఆ కొత్త అభ్యర్థికి సహకరించాలి.  ఇవన్నీ తేలేలోపు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది.  అప్పటి కల్లా ఈ కొత్తవాళ్ళు పుంజుకోకపోతే పరిస్థితి ఏంటి? అప్పుడు సిట్టింగ్స్… ఇంకా తమకు నియోజకవర్గంలో గ్రిప్ ఉందంటూ… బలం నిరూపించుకుంటే… జగన్ టికెట్ తమకే ఇస్తారని నమ్మకం పెట్టుకున్నారు. తాము నిలబడకపోతే… పార్టీ గెలవదన్న సంకేతాలు కూడా అధిష్టానానికి పంపాలని డిసైడ్ అయ్యారు. దాంతో కొత్తవాళ్ళని కాదని… పాతవాళ్ళకే టిక్కెట్లు ఇచ్చే ఛాన్సుందని… సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు లెక్కలు వేసుకుంటున్నారు….

 

జగన్ కూడా ఇలాగే ఆలోచిస్తున్నారా… ఎన్నికల ముందు వరకూ ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితిని అంచనా వేసి… అప్పుడే అభ్యర్థులను ఫైనల్ చేసి టిక్కెట్లు ఇస్తారా ? అలాగైతే ఇప్పుడు ప్రకటించిన జాబితాల్లో దాదాపు 30శాతం దాకా మార్పులు ఉంటాయని కొందరు ఎమ్మెల్యేలు చెబుతున్న దాంట్లో నిజముందా ? ఇందులో నిజం ఉంటే మాత్రం… ఇప్పుడు ఇంఛార్జులుగా నియమితులైనా ఎమ్మెల్యేలు, ఎంపీలు తమను తాము నిరూపించుకునే ప్రయత్నం చేయాలి. లేకపోతే… ఎన్నికల ముందు ఎటూ కాకుండా పోయే ప్రమాదం ఉంది.