గేట్లు ఎత్తిన టీడీపీ.. కొట్టుకుపోతున్న వైసీపీ..
వైసీపీకి షాక్ మీద షాక్ తగులుతోంది. ఒక్కొక్కరుగా జెండా ఎత్తేస్తున్నారు. తాజాగా పార్టీకి, పదవికి ఇద్దరు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు.
వైసీపీకి షాక్ మీద షాక్ తగులుతోంది. ఒక్కొక్కరుగా జెండా ఎత్తేస్తున్నారు. తాజాగా పార్టీకి, పదవికి ఇద్దరు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి ఎన్నికైన కళ్యాణ్ చక్రవర్తి, గవర్నర్ కోటా నుంచి ఎన్నికైన పద్మశ్రీ… తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. అలాగే రాజ్యసభ సభ్యులు మోపిదేవి రమణ, బీద మస్తాన్ రావు… పదవులకు, పార్టీకి కూడా రిజైన్ ఇచ్చారు. ఆ ఇద్దరిలో మోపిదేవి.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి కుడిభుజంలా వ్యవహరించిన వ్యక్తి. బీద మస్తాన్ రావు కూడా… పార్టీలో కీలకంగా వ్యవహరించిన నేతే. నమ్మిన వ్యక్తులుగా ఉన్న ఇద్దరూ.. రాజ్యసభను, పార్టీని వీడుతూ నిర్ణయం తీసుకున్నారు. బీద మస్తాన్ రావు, మోపిదేవి టీడీపీలో చేరాలని డిసైడయ్యారు. టీడీపీలో చేరగానే మస్తాన్ రావుకి తిరిగి అదే రాజ్యసభ సీట్లు దక్కనుంది. మోపిదేవికి మాత్రం ఎమ్మెల్సీ ఇవ్వడానికి ఒప్పందం కుదిరినట్లు సమాచారం. అసెంబ్లీలో వైసీపీ నెంబర్.. 11. రాజ్యసభలో కూడా ఆ సంఖ్య పదకొండే. ఇందులో ఇద్దరు రాజీనామా చేయగా మిగిలింది 9మంది. వీరిలో టర్మ్ కంప్లీట్ అయ్యేవరకు ఎంతమంది పార్టీలో ఉంటారో తెలియదు. రాజ్యసభ ఎంపీల రాజీనామాల పర్వం వీరిద్దరితో ఆగేలా కనిపించడం లేదని పార్టీలో టాక్. మరో ఇద్దరు త్వరలో పార్టీకి గుడ్‌బై చెప్పబోతున్నారు . రాజ్యసభ పదవులకు, వైసిపికి రాజీనామా చేయబోతున్న లీడర్లు ఇద్దరు టీడీపీలోనే చేరబోతున్నారు. మిగిలిన ఏడుగురులో మరికొందరు బీజేపీకి వెళ్లే ఛాన్స్ ఉంది. కీలక నేతలే పార్టీని వీడుతుండటంతో ఎమ్మెల్యేలు, కార్యకర్తల్లో గుబులు పుడుతోంది. ఓటమి తర్వాత వైసీపీ నేతలంతా చాలా వరకూ సైలెంట్ అయిపోయారు. కౌంటర్లు లేవు. కామెంట్లు లేవు. అంబటి, పేర్ని నానిలాంటి వాళ్లు తప్ప… మిగతావాళ్లు మీడియా ముందుకు పెద్దగా రావడం లేదు. నేతలంతా ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. సైలెంట్‌గా వైసీపీని వీడేందుకు సిద్ధమవుతున్నారని పార్టీలో టాక్ నడుస్తోంది. ఇటీవలే ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామా చేశారు. ఆమె బీజేపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. అంతకు ముందే మాజీ ఎమ్మెల్యేలు ఆళ్లనాని, మద్దాలి గిరి రిజైన్ చేశారు. ఇటు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా పార్టీపై అలిగారు. ఈవీఎంలపై నామ్ కే వాస్తే ఫైట్ చేస్తున్నారు కానీ, పార్టీ ఆయన్ని పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. బాలినేని జనసేనలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. పార్టీ అధికారంలో ఉన్నంత కాలం హార్డ్ హిట్టింగ్ చేసిన మాజీ మంత్రులు రోజా, కొడాలి నాని స్క్రీన్‌పై కనిపించడం లేదు. ఇలా అనలైజ్ చేసుకుంటూ పోతే పార్టీలో ఎవరుంటారో.. ఎవరు వీడుతారో పొలిటికల్ పల్స్ అంతు చిక్కడం లేదు.