Cargo Ship Fire Accident: అట్లాంటిక్ మహాసంద్రంలో అగ్నిప్రమాదం.. బుగ్గిపాలైన దాదాపు 3000 కార్లు
సాధారణంగా ఒకదేశం నుంచి మరో దేశానికి ఎగుమతులు దిగుమతులు జరుగుతూ ఉంటాయి. ఇందులో మసాలా దినుసులు మొదలు మోటారు వాహనాల వరకూ అన్నింటినీ తరలిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఒక్కో సారి సరకు నష్టం, ప్రాణనష్టం సంభవిస్తూ ఉంటుంది. తాజాగా ఇలాంటి ఘటన అట్లాంటిక్ సముద్రంలో చోటు చేసుకుంది.

A cargo ship carrying three thousand cars caught fire in the Atlantic Ocean
నెదర్లాండ్స్ కు చెందిన కార్గో షిప్ లో భారీగా అగ్ని ప్రమాదం జరిగింది. ఇందులో తరలిస్తున్న మూడువేల కార్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఈ నౌక ఉత్తర సముద్రంలో సరుకును తీసుకొని ప్రయాణం చేస్తుంది. సముద్రం మధ్యలో ఆకస్మికంగా మంటలు చెలరేగడంతో అందులోని సిబ్బంది అప్రమత్తం అయ్యారు. మంటలు ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఎంతటికీ అగ్ని జ్వాలలు అదుపులోకి రాలేదు. ప్రమాద తీవ్రత అధికమౌతుందని గుర్తించిన అధికారులు భయాందోళనకు గురై సముద్రంలోకి దూకేశారు. ఈ లోపూ దగ్గరలోని నౌకా కేంద్రానికి సమాచారం అందించడంతో రెస్క్యూ బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి. పెద్ద ఓడలో చిక్కుకొని ఉన్న వారిని హెలికాఫ్టర్ల సహాయంతో బయటకు తీసుకువచ్చి కాపాడారు. ఈ లోపు ఒక వ్యక్తి మరణించినట్లు నౌక అధికారులు వెల్లడించారు. దీంతో పెద్దగా ప్రాణనష్టం జరుగలేదు.
ఇక విలువైన కార్ల విషయానికొస్తే నౌకలో చెలరేగిన మంటలు తీవ్రంగా ఎగసిపడుతున్నాట్లు గుర్తించారు. అందులోని కార్లు అన్నీ కాలి బూడిదయ్యేలా ఉన్నాయని ఎప్పటికప్పుడు నౌక పరిస్థితిని అంచనావేసే టీంలోని సభ్యులు తెలిపారు. ఈ నౌక జర్మనీలోని బ్రెమెన్ పోర్ట్ నుంచి ఈజిప్ట్ లోని మరో పోర్ట్ కు దాదాపు 2857 కార్లతో బయలుదేరింది. దీనిపేరు ఫ్రెమాంటిల్ హైవే నౌకగా నామకరణం చేశారు. ఈమార్గం మధ్యలో అమేలాండ్ ద్వీపం ఉంది. ఈ ద్వీపానికి చేరుకునేందుకు 27 కిలోమీటర్ల దూరం ఉండగా షిప్లో ఉన్న పళంగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న డచ్ కోస్ట్ గార్డ్ బోట్లు, హెలికాఫ్టర్లతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ లోపు నౌకలోని కార్లు దాదాపు కాలిపోయాయి. ప్రస్తుతం ఈ నౌక మునిగిపోకుండా ఉండేందుకు రెస్క్యూ సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. మంటల తలెత్తడానికి గల కారణాన్ని ఇంకా అంచనావేయలేదు. సాంకేతిక లోపం వల్లే ఇలా జరిగి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఎంత మేర ఆస్తి నష్టం సంభవిస్తుందో తెలియాలంటే మంటలు పూర్తిగా అదుపులోకి రావాలంటున్నారు. అంతవరకూ జరిగిన నష్టాన్ని అంచనా వేయలేమన్నారు.
T.V.SRIKAR