America Banks: అమెరికాలో బ్యాంకింగ్ సంక్షోభం.. రెండు రోజుల్లో రెండు బ్యాంకులు క్లోజ్
ఒకటి కాదు రెండు బ్యాంకులు... అదీ రెండు రోజుల్లో మూతబడటం... అది కూడా అమెరికాలో జరగడం కల్లోలానికి కారణమైంది. మొత్తంగా వారంలో మూడు ఆర్థిక సంస్థలు మూతబడ్డాయి. ఇంతకీ బ్యాంకులు ఎందుకు మూతబడ్డాయి...? దాని ఎఫెక్ట్ మనపై ఉండబోతోందా...?
ఒకటి కాదు రెండు బ్యాంకులు… అదీ రెండు రోజుల్లో మూతబడటం… అది కూడా అమెరికాలో జరగడం కల్లోలానికి కారణమైంది. మొత్తంగా వారంలో మూడు ఆర్థిక సంస్థలు మూతబడ్డాయి. ఇంతకీ బ్యాంకులు ఎందుకు మూతబడ్డాయి…? దాని ఎఫెక్ట్ మనపై ఉండబోతోందా…?
అమెరికాలోని సిగ్నేచర్ బ్యాంక్ ఆదివారం మూతబడింది. అంతకు రెండ్రోజుల ముందే సిలికాన్ వ్యాలీ బ్యాంక్ క్లోజయింది. ఇక సిల్వర్‌గేట్ కేపిటల్ కూడా కార్యకలాపాలు మూసేసుకోవాల్సి వచ్చింది. వారం రోజుల వ్యవధిలో మూడు అతిపెద్ద ఆర్థిక సంస్థలు మూతబడటం అమెరికాలోనే కాదు ప్రపంచ బ్యాంకింగ్ వ్యవస్థనే కల్లోలానికి గురిచేస్తోంది. తమ బ్యాంకింగ్ వ్యవస్థలు ఎంత బలంగా ఉన్నాయని చెబుతున్నా చాలాదేశాల్లో పునాదులు అంత బలంగా లేవన్నది అందరికీ తెలిసిన వాస్తవమే.
గత డిసెంబర్ 31నాటికి సిగ్నేచర్ బ్యాంకు ఆస్తులు 110.36బిలియన్ డాలర్లు…. అది సేకరించిన డిపాజిట్లు 88.59బిలియన్ డాలర్లు… బ్యాంకు కొంత ఇబ్బందుల్లో ఉన్నా ఇన్నాళ్లూ ఇబ్బందులు లేవు. కానీ సిలికాన్ వ్యాలీ బ్యాంకు మూసివేత ప్రభావం దీనిపై బాంబులా పడింది. బ్యాంకింగ్ వ్యవస్థపై అనుమానాలతో చిన్న బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్లు విత్‌డ్రా చేసుకునేందుకు అమెరికన్లు పోటెత్తారు. ఈ బ్యాంకులో చాలామంది రెండున్నర లక్షల డాలర్ల కంటే ఎక్కువ డిపాజిట్ చేశారు. అయితే ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ రెండున్నర లక్షల డాలర్ల వరకే ఇన్సూరెన్స్ కల్పిస్తోంది. దీంతో ముందు జాగ్రత్తగా తమ డిపాజిట్లు వెనక్కు తీసుకునేందుకు జనం బారులు తీరారు. నిజానికి శుక్ర, శనివారాల్లో డబ్బుల కోసం బారులు తీరినా ఆదివారానికి పరిస్థితి చక్కబడింది. అయినా హఠాత్తుగా రెగ్యులేటర్లు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కొంత ఆశ్చర్యానికి గురిచేసింది. ఆర్థిక వ్యవస్థను రక్షించడానికే సిగ్నేచర్ బ్యాంకుపై చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని ఫెడరల్ రిజర్వ్ ప్రకటించింది. కస్టమర్లు డిపాజిట్లు ఉపసంహరించుకునేందుకు అనుమతి ఉందని తెలిపింది.
క్రిప్టో కరెన్సీకి ఫేవరెట్ బ్యాంకుగా సిగ్నేచర్ బ్యాంకును చెబుతారు. క్రిప్టో ఆస్తుల్లో ఇది పెట్టుబడులు పెట్టింది. అయితే ఇటీవల క్రిప్టోకరెన్సీ దారుణంగా పతనం కావడంతో ఈ బ్యాంకుపై ఒత్తిడి పడింది. దానికి తోడు క్రిప్టో కరెన్సీపై ఎక్కువగా ఫోకస్ చేసిన సిల్వర్‌గేట్ బ్యాంక్ కూడా మూతబడటంతో డిపాజిటర్లు బెంబేలెత్తిపోయారు. మరికొన్ని బ్యాంకులు కూడా మూతబడే అవకాశం ఉందని తెలుస్తోంది. దీన్నుంచి బయటపడటానికి అమెరికా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. బ్యాంకులకు ద్రవ్యలభ్యత ఇబ్బందులు ఎదురుకాకుండా 25మిలియన్ డాలర్లతో చర్యలు ప్రారంభించింది.
ఇటీవల మూతబడ్డ సిలికాన్ వ్యాలీ బ్యాంకుది కూడా ఇలాంటి పరిస్థితే… అధిక వడ్డీరేట్ల కారణంగా ఈ బ్యాంకు పెట్టుబడులు పెట్టిన ట్రెజరీ, కార్పొరేట్ బాండ్ల విలువలు పడిపోయాయి. దీంతో తక్కువ రాబడిని ఇచ్చే 20బిలియన్ డాలర్ల బాండ్లను విక్రయించాలని భావించింది. మూడీస్ నివేదిక వచ్చే ముందే దీన్ని పూర్తి చేయాలని భావించింది. అయితే అప్పటికే వార్త బయటకు పొక్కడంతో ఇన్వెస్టర్లు పెట్టుబడులు వెనక్కు తీసుకున్నారు. ఫలితంగా నగదు లభ్యత నిలిచిపోయింది. కేవలం 48గంటల్లోనే సిలికాన్ వ్యాలీ బ్యాంకు మునిగిపోయింది. దీంతో బ్యాంకింగ్ రెగ్యులేటర్లు రంగంలోకి దిగారు. బ్యాంకును మూసివేశారు. అంతర్జాతీయ స్టార్టప్‌ల్లో పెట్టుబడులు పెట్టడం ఈ బ్యాంకు ప్రత్యేకత. దీని దగ్గరున్న 175బిలియన్ డాలర్ల డిపాజిట్లలో 89శాతానికి బీమా లేకపోవడంతో కస్టమర్లు విత్‌డ్రాకు పోటీపడ్డారు. 2008లో వాషింగ్టన్ మ్యూచువల్ మూసివేత తర్వాత అతిపెద్ద బ్యాంకింగ్ సంక్షోభం ఇదే.
అమెరికాలో బ్యాంకింగ్ సంక్షోభం ఎఫెక్ట్ మన మార్కెట్లపై భారీగానే పడింది. బ్యాంకు నిఫ్టీ భారీగా నష్టపోయింది. అసలు మన బ్యాంకులు సేఫేనా అన్న అనుమానాలు రేగుతున్నాయి. అయితే అమెరికా సంక్షోభం
మనపై భారీగా ఉండబోదన్నది బ్యాంకింగ్ నిపుణుల అంచనా. మన బ్యాంకుల మూలాలు పటిష్టంగానే ఉన్నాయంటున్నారు. నిబంధనలు కఠినంగా ఉండటం, విస్తృత డిపాజిట్ బేస్ మన బ్యాంకులకు అడ్వాంటేజ్.
ఉదాహరణకు సిలికాన్ వ్యాలీ తన బ్యాలెన్స్‌షీట్‌లోని 200బిలియన్ డాలర్లలో ఏకంగా 100బిలియన్ డాలర్లను హెచ్‌టీఎం(హెల్ట్ టు మెచ్యూరిటీ) కేటగిరీలోకి తీసుకొచ్చింది. అయితే మన దగ్గర మాత్రం దాన్ని ఆర్‌బీఐ అనుమతించదు. దానిపై పరిమితి ఉంది. అలాగే ఎస్‌వీబీ డిపాజిట్లు అన్నీ బల్క్ డిపాజిట్లు… భారీ మొత్తాల్లో ఇన్వెస్ట్ చేశారు. కానీ మన దగ్గర మాత్రం రీటెయిల్ డిపాజిట్లే ఎక్కువ. పైగా మన బ్యాంకుల డిపాజిట్లు ఎక్కువగా వివిధ ప్రాంతాలు, వివిధ పరిశ్రమలకు విస్తరించి ఉన్నాయి. దీంతో ఒక్కసారిగా డిపాజిట్ విత్‌డ్రా ఒత్తిళ్లు ఉండబోవన్నది నిపుణుల సూచన.
మొత్తంగా చూస్తే అమెరికా బ్యాంకింగ్ సంక్షోభం మనపై కొంతమేరకే ఉండే అవకాశం ఉంది. ఆ బ్యాంకుల్లాగా మనవి కుప్పకూలే అవకాశాలు లేవు. అలాగని ఎందులో పడితే అందులో పెట్టుబడులు పెట్టకూడదు. అధిక వడ్డీకి ఆశపడి నిబంధనలు పాటించని, అనుమతులు లేని ఆర్థిక సంస్థల్లో పెట్టుబడులు మాత్రం పెట్టకపోవడం మంచిది.
(KK)