Budget 2024: రైతులకు మరిన్ని వ్యవసాయ రుణాలు… కొత్త బడ్జెట్ పై ఆశలు !
రైతులకు మరింతగా వ్యవసాయ రుణాలు అందుబాటులోకి రానున్నాయి. అందుకోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టబోయే 2024-25 బడ్జెట్ లో ఏర్పాట్లు ఉంటాయని భావిస్తున్నారు. వ్యవసాయ రుణాల లక్ష్యాన్ని రూ.22-25 లక్షల కోట్లకు పెంచుతారని లీక్స్ వస్తున్నాయి.
ఫిబ్రవరి 1నాడు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. లోక్ సభ ఎన్నికల ముందు ఈ బడ్జెట్ వస్తుండటంతో రైతులకు ఎంతో కొంత ఊరట కలిగించే నిర్ణయాలు తీసుకుంటారని నిపుణులు చెబుతున్నారు. ఈ బడ్జెట్ లో వ్యవసాయ రుణ లక్ష్యం రూ.22-25 లక్షల కోట్లకు పెరుగుతుందని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ వ్యవసాయ రుణ లక్ష్యం రూ.20లక్షల కోట్లు. దీని ప్రకారం అన్ని ఆర్థిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం 3 లక్షల లోపు స్వల్పకాలిక వ్యవసాయ రుణాలపై 2 శాతం వడ్డీ రాయితీని అందిస్తోంది. అంటే రైతులు ఏటా 7శాతం రాయితీపై 3 లక్షల రూపాయల దాకా వ్యవసాయ రుణాలు తీసుకుంటున్నారు. సకాలంల చెల్లించే రైతులకు ఏడాదికి మరో 3శాతం అదనపు వడ్డీ రాయితీ కూడా ఉంటోంది. దీర్ఘకాలిక రుణాలకు మాత్రం మార్కెట్ రేటు ప్రకారం వడ్డీ వసూలు చేస్తారు.
కేంద్రం రాబోయే బడ్జెట్ లో వ్యవసాయ రుణ లక్ష్యాన్ని 25 లక్షల కోట్లకు తీసుకెళితే… అర్హులైన మరికొందరు రైతులకు వ్యవసాయ రుణాలను అందించే అవకాశం ఉంటుంది. వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఇలాంటి రుణాల కోసం ప్రత్యేక విభాగాన్ని కూడా తెరిచింది. వ్యవసాయ రుణాలే కాదు… వ్యవసాయ అనుబంధ కార్యకలాపాల కోసం రుణ పంపిణీ కూడా గత 10యేళ్ళ లక్ష్యం కంటే ఎక్కువే ఉందంటున్నారు. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ 2023 నాటికి 20 లక్షల కోట్ల వ్యవసాయ రుణాల లక్ష్యంలో 82శాతం టార్గెట్ ను చేరుకుంది. ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకుల ద్వారా దాదాపు 16.37 లక్షల కోట్ల రుణాలను రైతులకు అందించారు.