ఈ టైమ్‌లో గోల్డ్ కొనొచ్చా…?
అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా ఔన్స్ గోల్డ్ 2వేల 9వందల డాలర్లు దాటేసింది. త్వరలో అది 3వేల డాలర్లు దాటొచ్చని మెజారిటీ ఎక్స్‌పర్ట్స్ లెక్కలేస్తున్నారు.

అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా ఔన్స్ గోల్డ్ 2వేల 9వందల డాలర్లు దాటేసింది. త్వరలో అది 3వేల డాలర్లు దాటొచ్చని మెజారిటీ ఎక్స్‌పర్ట్స్ లెక్కలేస్తున్నారు. అంటే బంగారం మరింత పెరుగుతుందన్నమాట. నిజానికి ద్రవ్యోల్బణం భయంతో అమెరికా ఫెడ్ వడ్డీరేట్ల తగ్గింపునకు బ్రేక్ వేసింది. లెక్కప్రకారం ఇన్వెస్టర్లు గోల్డ్‌వైపు మళ్లకూడదు. కానీ సీన్ మాత్రం రివర్స్ అయ్యింది. డాలర్ బలంగా ఉన్నా, వడ్డీరేట్లు తగ్గకున్నా గోల్డ్ మాత్రం జూమ్ అంటోంది. బంగారం దూకుడుకు ట్రంప్ నిర్ణయాలే కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనికూడా లేదు. పిచ్చోడి చేతిలో రాయిలాగా అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి తన పవర్‌ను ఎవరిపై వడితే వారిపై ఎడాపెడా వాడేస్తున్నారు. పలు దేశాలపై టారిఫ్ వార్‌కు సై అంటున్నారు.
చెనా, మెక్సికో, కెనడాలపై పన్నుపోటు వేశారు. అయితే ఆ తర్వాత కాస్త తగ్గి దాన్ని వాయిదా వేశారు. హమ్మయ్య అనుకునేలోపే మరోసారి అమెరికాలోకి వచ్చే స్టీల్, అల్యూమినియం వంటి వాటిపై అదనంగా 25శాతం ట్యాక్స్ తప్పదని వార్నింగ్ ఇచ్చారు ప్రెసిడెంట్. దీంతో మార్కెట్లు పడిపోయాయి. బంగారం మరింత దూసుకుపోయింది. ట్రంప్ దూకుడు చూస్తుంటే ఈ వారం పది రోజుల్లోనే మరికొన్ని దేశాలపై అదనంగా టారిఫ్‌లు విధించొచ్చు. అదే జరిగితే ట్రేడ్ వార్ మరింత ముదురుతుంది. చైనా ఇప్పటికే యూఎస్‌పై గుర్రుగా ఉంది. ఈ కారణాలతో అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు ఏర్పడ్డాయి. మార్కెట్లు కూడా పడిపోతున్నాయి. ఒకరోజు కాస్త కోలుకుంటే మరో రెండ్రోజులు ఏదో ఓ కారణంతో పడిపోతున్నాయి. ఇది కూడా గోల్డ్ రష్‌కు కారణమవుతోంది. ఇలాంటి రిస్కీ సమయంలో గోల్డ్ బెటర్ అని ఇన్వెస్టర్లు అటువైపు మళ్లుతున్నారు. దీంతో బంగారానికి గిరాకీ పెరుగుతోంది.
డాలర్‌తో పోల్చితే రూపాయి పతనం కూడా బంగారం ధరలు ఎక్కువగా ఉండటానికి మరో కారణం. ప్రస్తుతం డాలర్‌తో పోల్చితే రూపాయి మారకపు విలువ 87రూపాయలకు పైన ఉంది. మనం ఎక్కువగా బంగారాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే. రూపాయి విలువ పడిపోవడంతో డాలర్ల కోసం ఎక్కువ చెల్లించాలి. ఫలితంగా మన దగ్గర రేటు కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఒకవేళ అంతర్జాతీయంగా గోల్డ్ రేట్ కాస్త తగ్గినా రూపాయి కోలుకోకపోతే మాత్రం మన దగ్గర బంగారం రేటు తగ్గదు.
ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం కొనాలా వద్దా…? ఇప్పుడు కొంటే ముందు ముందు తగ్గుతుందేమో….? ఇప్పుడు కొనకపోతే ఇకముందు కొనలేమేమో…? ఇవి చాలామందిని వేధించే ప్రశ్నలు. మార్కెట్ నిపుణులు మాత్రం ఇప్పట్లో అయితే మాత్రం బంగారం ధరలు తగ్గడం డౌటే అని చెబుతున్నారు. రానున్న రోజుల్లో బంగారం పెరగడమే కానీ తగ్గడం ఉండదని అంటున్నారు. ఒకవేళ ఒకటి, రెండుసార్లు కాస్త తగ్గినా మళ్లీ పుంజుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. తగ్గినప్పుడు కాస్త కాస్త కొనుక్కోవడమే మేలంటున్నారు. ఏదైనా అనూహ్యం జరిగితే తప్ప బంగారం రేట్లు ఇప్పట్లో దిగిరావడం కష్టమే. ట్రంప్ తన తీరు మార్చుకుని సాఫ్ట్‌గా మారాలి. టారిఫ్ వార్ ఆగిపోవాలి. రూపాయి కోలుకోవాలి. వడ్డీరేట్లు పెరగాలి…ఇవన్నీ జరగడం కాస్త కష్టమే కాబట్టి బంగారం తగ్గడం కష్టమే. మొత్తంగా చూస్తే ఈ ఏడాది గోల్డ్‌కు గోల్డెన్ ఇయర్ లాగానే కనిపిస్తోంది.