LPG Cylinder: పండుగల వేళ సామాన్యుడికి షాక్.. వాణిజ్య సిలిండర్ ధర పెంపు..!
కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను పెంచాయి. 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను రూ.209 మేర పెంచుతున్నట్లు చమురు కంపెనీలు ప్రకటించాయి. గత నెలలో కంపెనీలు సిలిండర్ ధరను తగ్గించిన సంగతి తెలిసిందే. కమర్షియల్ సిలిండర్ ధరను సెప్టెంబర్‌లో రూ.157 వరకు తగ్గించాయి.
LPG Cylinder: దసరా నవరాత్రులు ప్రారంభమయ్యే సమయంలో చమురు కంపెనీలు సామాన్యుడికి షాక్ ఇచ్చాయి. కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను పెంచాయి. 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను రూ.209 మేర పెంచుతున్నట్లు చమురు కంపెనీలు ప్రకటించాయి. గత నెలలో కంపెనీలు సిలిండర్ ధరను తగ్గించిన సంగతి తెలిసిందే. కమర్షియల్ సిలిండర్ ధరను సెప్టెంబర్‌లో రూ.157 వరకు తగ్గించాయి. నెల రోజుల్లోపే ధరలు పెంచుతూ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు అక్టోబర్ 1 నుంచే అమల్లోకి వస్తాయి.
అసలే పండుగల సమయం.. ఈ సమయంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పెరగడం కూడా సామాన్యుడిపై ప్రభావం చూపిస్తుంది. ఈ సీజన్‌లో గ్యాస్ అవసరం ఎక్కువగా ఉంటుంది. అయితే, గృహ వినియోగ సిలిండర్ ధర పెరగకపోవడం సామాన్యుడికి కొంతమేర ఊరటనిచ్చే విషయం. ధరలు పెంచుతూ చమురు కంపెనీలు తీసుకున్న నిర్ణయంతో ఈ సీజన్‌లో ఎక్కువ వ్యాపారం చేసే వాణిజ్య వినియోగదారులు, వ్యాపారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ వ్యాపారం తగ్గుతుందంటున్నారు. అసలే నిత్యావసరాలు, కూరగాయలు ధరలు పెరిగి, ఇబ్బంది పడుతున్న వేళ సిలిండర్ ధర పెంపు మరింత భారంగా మారనుంది. హోటళ్లు, రెస్టారెంట్లలో ధరలు పెరిగే ఛాన్స్ ఉంది. బయటి ఆహార పదార్థాల ధరలు పెరుగుతాయి.
దేశంలో సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ జనంలో వ్యతిరేకతను తగ్గించుకునేందుకు మోదీ సర్కార్ గృహ సిలిండర్ ధరను గత నెలలోనే రూ.200 మేర తగ్గించింది. అయితే ఈ ఊరట ఎన్నికలు ముగిసేంత వరకే అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం పెంచిన ధరలు వివిధ నగరాల్లో ఇలా ఉన్నాయి. ధరల పెంపు తర్వాత ఢిల్లీలో వాణిజ్య సిలిండర్ ధర రూ.1,731.50కాగా, హైదరాబాదులో రూ.1,798.50గా ఉండనుంది. ఇక చెన్నైలో రూ.1,898, ముంబైలో రూ.1,684, కోల్‌కతాలో రూ.1,839.50గా ఉన్నాయి.