ONDC: హైదరాబాద్‌లో ఓఎన్‌డీసీ సేవలు ప్రారంభం.. తక్కువ చార్జీతోనే ఫుడ్ డెలివరీ..

ఓఎన్‌డీసీ (ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్)తో. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ సేవలు ఇటీవలే హైదరాబాద్‌లో అందుబాటులోకి వచ్చాయి. ఎలాంటి మధ్యవర్తిత్వం లేకుండా వ్యాపారికి, వినియోగదారుడికి మధ్య సేవలు అందించేదే ఓఎన్‌డీసీ.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 30, 2023 | 04:22 PMLast Updated on: Dec 30, 2023 | 4:22 PM

Commission Free Ride Hailing App On Ondc Launched In Hyderabad

ONDC: ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేస్తే డెలివరీ చార్జెస్, ప్యాకేజింగ్ చార్జెస్, పీక్ అవర్స్.. అంటూ డెలివరీ కంపెనీలు వసూలు చేస్తున్న చార్జీలతో వినియోగదారుల జేబులకు చిల్లు పడుతోంది. అయితే, ఇకపై వీటికి చెక్ పెట్టొచ్చు. తక్కువ ధరలోనే డెలివరీ, వెహికల్ బుకింగ్ వంటి సేవలు పొందొచ్చు. ఎలా అనుకుంటున్నారా..? ఓఎన్‌డీసీ (ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్)తో. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ సేవలు ఇటీవలే హైదరాబాద్‌లో అందుబాటులోకి వచ్చాయి.

Grandhi Srinivas: పవన్ కల్యాణే కావాలి.. భీమవరంలో గ్రంథి శ్రీనివాస్..!

ఎలాంటి మధ్యవర్తిత్వం లేకుండా వ్యాపారికి, వినియోగదారుడికి మధ్య సేవలు అందించేదే ఓఎన్‌డీసీ. దీని ద్వారా తక్కువ ధరల్లోనే ఫుడ్ డెలివరీ సేవల్ని పొందేవీలుంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని డీపీఐఐటీ (డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ అండ్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌) ఆధ్వర్యంలో ఇది పని చేస్తుంది. ఓఎన్‌డీసీ ద్వారా జొమాటో, స్విగ్గీ, ఊబర్, ఓలా వంటి ఎలాంటి మిడిల్ యాప్స్ అవసరం లేకుండానే ఫుడ్‌ మొదలు క్యాబ్స్‌ వరకు బుకింగ్‌ చేసుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా ప్యాకేజింగ్‌, ఇంటర్నెట్‌ ఛార్జీలు అంటూ అదనపు ఛార్జీలు ఉండవు. ఓఎన్‌డీసీ ద్వారా రెస్టారెంట్స్, హోటళ్ల నుంచి ఆహార పదార్థాల్ని డెలివరీ చేయాలంటే దూరం ఆధారంగా నిర్దేశిత మొత్తం చెల్లిస్తే చాలు. అలాగే క్యాబ్స్, ఎలక్ట్రానిక్ డివైజెస్‌కు సంబంధించి అదనపు చార్జీలు వసూలు చేయరు. వేరే యాప్స్‌తో పోలిస్తే డెలివరీ సేవలు తక్కువ ధరలకే అందుబాటులో ఉంటాయి.

ఇప్పటికే ఈ సేవలు కోల్‌కతా, బెంగళూరు, కొచ్చి, మైసూరు నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. 1,15,000 మందికి పైగా డెలివరీబాయ్స్‌ ఈ ప్లాట్‌ఫామ్‌పై పనిచేస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్‌లోనూ ఈ సేవలు ప్రారంభమయ్యాయి. ‘తెలంగాణ గిగ్‌వర్కర్స్‌ అసోసియేషన్‌’కు చెందిన డెలివరీబాయ్‌లు ఇందులో భాగస్వాములైనట్లు ఆ సంస్థ పేర్కొంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 25,000 మంది ఓఎన్‌డీసీలో కొనసాగుతున్నారు. హైదరాబాద్ పరిధిలో రూ.500 కోట్ల ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ బిజినెస్ జరుగుతుండగా.. ఓఎన్‌డీసీ ద్వారా రూ.50 కోట్ల వ్యాపారం అవుతుందని అంచనా.